ఓవైపు హైకోర్టు నుంచి బ్యాక్ టు బ్యాక్ చీవాట్లు పడినా కేసీఆర్ ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. కార్మిక సంఘాలతో చర్చలు జరిపే బదులు, ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకే ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగా సమ్మె, ఆర్టీసీ భవిష్యత్తుపై రేపు కీలక సమావేశం జరగబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రేపు జరగనున్న కేబినెట్ భేటీలో ఆర్టీసీపై ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.
ఓవైపు చర్చల కోసం అధికారుల బృందాన్ని ఏర్పాటుచేసిన తెలంగాణ ప్రభుత్వం, ఈసారి ప్లాన్-బిని అమలుచేయబోతోంది. ఇందులో భాగంగా ఆర్టీసీలో ప్రైవేటు బస్సుల అనుమతికి సంబంధించి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ రవాణా విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రణాళికలో భాగంగా ఆర్టీసీలో కొంతభాగాన్ని ప్రైవేటీకరించాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది.
తాజా ఆలోచన ప్రకారం, ఆర్టీసీలో 50శాతం యాజమాన్య బస్సులు, 30శాతం అద్దె బస్సులు, 20శాతం ప్రైవేటు స్టేజి క్యారియర్లు ఉంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా రేపు జరగనున్న కేబినెట్ భేటీలో ప్రైవేట్ స్టేజి క్యారియర్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే ఆర్టీసీలో 20శాతం ప్రైవేటీకరణ పూర్తయినట్టే. ఒక్క సంతకం పెడితే, వందలాది ప్రైవేటు బస్సులు రోడ్లపైకి వస్తాయని కేసీఆర్ గతంలో బెదిరించారు. ఇప్పుడు అదే జరగబోతోందన్నమాట.
కేవలం విలీనం అనే అంశాన్ని పట్టుకొని కార్మిక సంఘాలు సమ్మెకు దిగడం కేసీఆర్ కు ఆగ్రహం తెప్పిస్తోంది. ఇప్పటివరకు ఆర్టీసీ విలీనం అనేది ఏ రాష్ట్రంలో జరగలేదని (ఏపీలో ఈ విలీన ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైంది) అలాంటప్పుడు తెలంగాణలోనే ఎందుకు చేయాలని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. తాము అనుమతించిన 21 డిమాండ్లపై చర్చకు కార్మిక సంఘాలు వచ్చి ఉంటే, అదే ఊపులో విలీనంపై కూడా సానుకూలంగా ఓ నిర్ణయం తీసుకొని ఉండేవాడినని, కార్మిక సంఘాలు కేవలం విలీనం అని మాత్రమే పట్టుకొని కూర్చోవడంతో తను కూడా వెనక్కితగ్గడం లేదని కొంతమంది మంత్రుల వద్ద కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది.
ఈరోజు మరోసారి ఈ సమస్యపై హైకోర్టులో వాదనలు జరగబోతున్నాయి. ఈరోజు కోర్టులో జరిగే వాదనలు విన్న తర్వాత, ప్రైవేటు బస్సుల అనుమతిపై ఓ నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. అటు కార్మిక సంఘాలు మాత్రం తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈరోజుతో కార్మికుల సమ్మె వరుసగా 28వ రోజుకు చేరింది.