తెలుగు సూపర్ హిట్ సినిమా 'అర్జున్ రెడ్డి' తమిళ వెర్షన్ విడుదలకు రంగం సిద్ధం అయ్యింది. ముందుగా బాల దర్శకత్వంలో తమిళ వెర్షన్ మొదలైంది. అయితే ట్రైలర్ వరకూ వచ్చాకా ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత షూటింగ్ మళ్లీ మొదలుపెట్టారు. మొత్తం సినిమాను తీశారు.
హీరోయిన్ ను కూడా మార్చేసి.. పూర్తిగా తెలుగు వెర్షన్ కు కార్బన్ కాపీలా సినిమాను తయారు చేశారు. ఈ వెర్షనే ఈనెల ఎనిమిదో తేదీన విడుదల కాబోతూ ఉంది. తమిళంలో 'ఆదిత్యవర్మ' పేరుతో ఈ సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న విక్రమ్ తనయుడు ధ్రువ్ ప్రస్తుతం ప్రమోషనల్ యాక్టివిటీస్ లో ఉన్నాడు. ఇప్పటి వరకూ తను సినిమాను పూర్తిగా చూడలేదని, తన తండ్రి మాత్రం కనీసం వందసార్లు ఈ సినిమాను చూసేసి ఉంటారని, ఆయనకు బాగా నచ్చిందని ధ్రువ్ చెప్పాడు.
తన తదుపరి సినిమా తండ్రితో కలిసే ఉండవచ్చని ధ్రువ్ చెప్పాడు. అవకాశం వస్తే తండ్రి విక్రమ్ నటించిన 'భీమ' సినిమా రీమేక్ లో నటించాలని ఉందని ధ్రువ్ చెప్పడం గమనార్హం!