మంత్రులకు సరికొత్త డెడ్ లైన్ విధించారు జగన్. ఇంతకుముందు విధించిన రెండున్నరేళ్ల కాల పరిమితిని అమాంతం కుదించేశారు. పనితీరు సరిగ్గా లేని మంత్రులు మరో 6 నెలల్లోనే తమ పదవులు కోల్పోతారని హెచ్చరించారు ముఖ్యమంత్రి. దీంతో మంత్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మంత్రుల 5 నెలల పనితీరు పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయానికొచ్చారు జగన్.
పనితీరు మెరుగుపరుచుకోకపోతే ఎక్కువకాలం భరించే పరిస్థితి ఉండదని, 6 నెలల్లోనే మార్పులు జరుగుతాయని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికీ చాలామంది మంత్రులకు తమ శాఖలపై పట్టురాలేదని గ్రహించిన ముఖ్యమంత్రి… రెండున్నరేళ్లు పదవిలో ఉంటామనే భావన వీడాలని సూచించారు. సమర్థత నిరూపించుకోకపోతే ఇప్పుడున్న మంత్రుల్లో 25శాతం మందిని 6 నెలల్లోనే తప్పిస్తానని ఘాటుగా స్పందించారు.
జిల్లాల్లో ప్రభుత్వ పథకాల అమలు, పర్యవేక్షణ, పార్టీ బలోపేతం లాంటి అంశాలు మంత్రుల బాధ్యతేనని గుర్తుచేశారు జగన్. ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య సఖ్యత లేనప్పుడు కచ్చితంగా మంత్రులు కల్పించుకోవాలని, సయోధ్య కుదర్చాలని సూచించారు. వారానికి కనీసం 2 రోజులు తమకు కేటాయించిన జిల్లాల్లో ఉండాలని ఆదేశించారు.
ఇప్పటికీ 90శాతం మంది మంత్రులు, తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు సీఎం. దీంతో పాటు తమ శాఖకు సంబంధించిన పనుల్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు. తను నియమించిన మంత్రులపై నమ్మకంతో ఇన్నాళ్లూ వాళ్లను చూసీచూడనట్టు వదిలేశారు జగన్.
కానీ ప్రతి జిల్లా నుంచి అసంతృప్తి సెగలు బయటకొస్తున్న వేళ.. ఇక ఉదాసీనత పనికిరాదని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రులకు చెప్పిన ముఖ్యమంత్రి, ఇకపై ప్రతి 6 నెలలకు మంత్రుల పనితీరుపై రివ్యూ ఉంటుందని స్పష్టంచేశారు. జగన్ తాజా నిర్ణయంతో మంత్రులకు కొత్త టెన్షన్ మొదలైంది.