నిర్మాతగా కూడా రామ్ చరణ్ కు నూటికి నూరు మార్కులేయాలి. ఇన్నాళ్లూ మెగా కాంపౌండ్ లో అల్లు అరవింద్ ఒక్కరే సినిమా ప్లానింగ్ లో దిట్ట అనుకునేవాళ్లంతా. అలాంటి వారు కూడా రామ్ చరణ్ ప్లానింగ్ చూసి బిత్తర పోతున్నారు. తాజాగా చరణ్ మరోసారి తన మార్క్ చూపించాడు. చిరంజీవి హీరోగా నిర్మిస్తున్న ఆచార్య సినిమా వైపు పవన్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా చూసేలా చేయగలిగాడు.
చిరంజీవి 152వ సినిమా ప్రీ లుక్ పోస్టర్ లో పిడికిలి బిగించిన చేయి ఓ ఎర్ర గుడ్డని పట్టుకుని కనిపిస్తుంది. సరిగా చూస్తే ఇది పవన్ కల్యాణ్ మార్క్ లాగా కనిపిస్తుంది. పవన్ కూడా పిడికిలి బిగించి, ఎర్ర తువ్వాలు మెడలో వేసుకుని రాజకీయ ర్యాలీలు, సభల్లో పాల్గొనేవారు. సో.. ఈ పోస్టర్ తో పవన్ అభిమానుల్ని బాగానే ఎట్రాక్ట్ చేశారు ఆచార్య మేకర్స్.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ప్రీ-లుక్ పోస్టర్, పవన్ ఎర్ర కండువా ఎగరేసే పోస్టర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలా పవన్ ఫ్యాన్స్ ను ఈ సినిమా వైపు ఆకర్షించడంలో రామ్ చరణ్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు.
ఆచార్య సినిమాకి సంబంధించి విడుదలైన ఒకే ఒక్క స్టిల్ లో (అది కూడా లీకైన స్టిల్) చిరంజీవి మెడలో ఎర్ర కండువా వేసుకుని కనిపిస్తారు. ఇప్పుడు విడుదలైన స్టిల్ లో కూడా పిడికిలితో ఆ ఎర్ర కండువా పట్టుకున్న చేయి కనిపిస్తుంది. ఎర్ర కండువా అనగానే సినిమాల్లో ఎవరికైనా పవన్ కల్యాణ్ గుర్తుకురావడం కామన్. అలా చిరు సినిమాతో జనసైనికుల్లో కూడా సంతోషాన్ని నింపారు రామ్ చరణ్.
చిరంజీవి నోరుజారి టైటిల్ చెప్పేశారు కానీ, ఆచార్య టైటిల్ ను అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఈనెల 22న సాయంత్రం 4 గంటలకు ఆ లాంఛనం పూర్తిచేయబోతున్నారు. కాబట్టి టైటిల్ పై ఎవ్వరికీ ఎలాంటి క్యూరియాసిటీ లేదు. ఎటొచ్చి ఆ టైటిల్ తో పాటు ఎర్ర కండువా పట్టుకొని రాబోతున్న చిరంజీవి లుక్ పై మాత్రం అందర్లో ఆసక్తి ఉంది.