అసలే టాలీవుడ్ కు కమెడియన్ల కొరత ఎక్కువగా వుంది. కమెడియన్లు వస్తున్నారు. ప్రూవ్ చేసుకుంటున్నారు. కాస్త ప్రూవ్ చేసుకోగానే హీరోలుగా మారిపోతున్నారు. ఒక్క వెన్నెల కిషోర్ మినహా మిగిలిన అంతా ఇలా ట్రయ్ చేసిన వారు, చేస్తున్నవారే. కానీ హీరోలుగా నిలదొక్కుకోలేక, ఆ పై కమెడియన్లుగా చాన్స్ లు రాక ఇబ్బందులు పడుతున్నారు. వెన్నెల కిషోర్ కు మాత్రం ఈ తత్వం బోధపడి హీరో పాత్రలకు దూరంగా వున్నారు.
లేటెస్ట్ విషయం ఏమిటంటే మంచి కమెడియన్ గా ఇటీవల ప్రూవ్ చేసుకుంటూ వస్తున్న సత్య కూడా హీరోగా మారిపోతున్నాడట. హీరో సందీప్ కిషన్ తన స్వంత బ్యానర్ మీద నిర్మించే సినిమాతో సత్యను హీరోగా మారుస్తున్నాడని టాక్. వివాహ భోజనంబు అనే క్యాచీ టైటిల్ తో కొత్త దర్శకుడితో తీయబోయే సినిమాను సందీప్ కిషన్ ప్రకటించారు. కానీ హీరో ఎవరు అన్నది చెప్పలేదు. తనకు ఇష్టమైన నటుడు అని మాత్రం చెప్పారు.
ఇండస్ట్రీ గ్యాసిప్ ఏమిటంటే ఆ ఇష్టమైన నటుడు కమెడియన్ సత్యనే అన్నది. సత్య మంచి కమెడియన్, మంచి నటుడు. అందులో సందేహం లేదు. కానీ అతను కూడా హీరో పాత్రల వైపు వెళ్లిపోతే, కమెడియన్ల కొరత టాలీవుడ్ కు మరింత పెరుగుతుంది.