చంద్రబాబు నాయుడు తిరిగి బీజేపీ పంచన చేరడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మోదీని ప్రసన్నం చేసుకోడానికి ఆయన చేయని ప్రయత్నాలంటూ లేవు. బాబు కరపత్రికలు కూడా దీనికి వంతపాడుతున్నాయి. అయితే రాష్ట్ర బీజేపీలో పరిస్థితులు చంద్రబాబుకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. కేంద్రంతో ఆయన సయోధ్యకు ప్రయత్నిస్తుంటే, రాష్ట్ర నేతలు మోకాలడ్డుతున్నారు. బాబుని పూర్తిగా ఇరుకున పెట్టేస్తున్నారు.
కొత్త అధ్యక్షుడు వీర్రాజు వస్తూ వస్తూనే టీడీపీని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని, ఆ స్థానాన్ని తాము భర్తీ చేస్తామంటూ బాహాటంగానే ప్రకటించారు. పదవిలోకొచ్చిన తొలిరోజుల్లోనే బాబుకి వంతపాడే సుజనా చౌదరి లాంటివారి తోకలు కత్తిరించేశారు. రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నవారిపై వేటు వేశారు. ఒకరకంగా చంద్రబాబుని పూర్తిగా ఇరుకున పెట్టారు.
వీర్రాజుతో పాటు.. రామ్ మాధవ్, విష్ణువర్దన్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావు ఇలా వీరంతా టీడీపీని పూర్తిగా టార్గెట్ చేశారు. మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం ఉండబోదని రామ్ మాధవ్ తేల్చి చెప్పారు. సైకిల్ పోతే పోలీస్ స్టేషన్లో కాకుండా పోస్టాఫీస్ లో కంప్లైంట్ చేస్తే ఎలా అంటూ.. ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంపై చంద్రబాబు రాసిన లేఖని చీల్చి చెండాడారు విష్ణువర్ధన్ రెడ్డి.
గతంలో చంద్రబాబు మోదీని తిడుతూ పెట్టిన పోస్టులన్నిటినీ బైటకు తీసి మరీ బాబు పరువు తీశారు. అప్పుడు దుర్మార్గుడిగా కనిపించిన మోదీ, ఇప్పుడు న్యాయమూర్తిలా ఎలా మారారంటూ బాబుని ప్రశ్నించారు విష్ణు. జీవీఎల్ కూడా ఇదే విషయంపై కాస్త గట్టిగా స్పందించారు. కేంద్రం ఫోన్ ట్యాపింగ్ విషయంలో జోక్యం చేసుకోదని, చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటూ చురకలంటించారు. ఇలా నేతలంతా కలిసి వరుసగా షాకులిస్తున్నా, బాబు మాత్రం సిగ్గులేకుండా అవన్నీ దులిపేసుకొని మోదీకి దగ్గరవ్వాలనే తన ప్రయత్నాల్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇప్పటివరకూ ఏపీలో కమలం ఎదగకుండా చేసిన ఘనత చంద్రబాబుదేనని రాష్ట్ర నాయకుల నిశ్చితాభిప్రాయం. బాబు సామాజిక వర్గానికే చెందిన ఓ “పెద్దాయన” కూడా ఈ వెన్నుపోటుకి సూత్రధారి అనే ప్రచారం ఉంది. ఇప్పుడు బీజేపీ నేతలకు సొంతంగా ఎదిగే అవకాశం దక్కింది. జనసేనతో కలసి వారి తంటాలేవో వారు పడుతున్నారు. ఇలాంటి టైమ్ లో చంద్రబాబు అడ్డు తగిలి మళ్లీ పొత్తు పెట్టుకుంటామని బతిమిలాడితే, జాతీయ నాయకత్వం కూడా మెత్తబడితే.. ఆ ఆలోచనే రాష్ట్ర నాయకత్వానికి నచ్చడం లేదు.
అందుకే ఎక్కడికక్కడ చంద్రబాబుకి కౌంటర్లిస్తూ కేంద్రానికి ఆయన దగ్గర కాకుండా చేస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ నేతలంతా ప్రస్తుతానికి సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కానీ బాబు నక్కజిత్తుల ముందు వీళ్లు ఎన్నాళ్లు ఇలా నిలబడగలరనేది ప్రశ్న.