సంగీత ప్రియులకు ఓ శుభవార్త. కరోనాబారిన పడ్డ పాటల కోయిల సునీత …దాని నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని తనే స్వయంగా ఓ వీడియో ద్వారా ప్రకటించి అభిమానులకు ఊరట కలిగించారు. ఇప్పటికే గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా బారిన పడి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతుండడం యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేసింది.
ఈ నేపథ్యంలో సునీత ఓ వీడియో సందేశాన్ని తన మధుర కంఠంతో వినిపించారు. చాలా స్వల్ప కరోనా లక్షణాలతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు తెలిపారు. ఇప్పుడు కరోనాను జయించి క్షేమంగా ఉన్నట్టు ఆమె ప్రకటించడం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఇంతకూ ఆ వీడియోలో ఏముందంటే…
‘అందరికీ నమస్కారం. నా ఆరోగ్యం గురించి బంధువులు, స్నేహితులు, మీడియా నుంచి వరుస ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దీనిపై స్పష్టత ఇచ్చేందుకే మీ ముందుకు వచ్చా. కొన్ని రోజుల కిందట నేను కరోనా బారిన పడ్డా. ఒక షూటింగ్‌కు వెళ్తే తలనొప్పిగా అనిపించింది. అశ్రద్ధ చేయకుండా నా తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకుని పరీక్ష చేయించుకున్నా. దురదృష్టవశాత్తూ పాజిటివ్ అని వచ్చింది. చాలా స్వల్ప లక్షణాలు ఉన్నాయి. సాధారణ జీవితంలో అలాంటివి మనం లెక్క చేయం.
ఇప్పుడు నేను పూర్తిగా కరోనా నుంచి బయటపడ్డా. ఆరోగ్యంగా ఉన్నా. ఇప్పుడు నేను బాలుగారి ఆరోగ్యం విషయంలో చాలా ఆందోళనగా ఉన్నా. నేను, నా కుటుంబం ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. మనందరం ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం’ అని సునీత పేర్కొన్నారు.
కరోనా ఏ ఒక్కర్నీ విడిచి పెట్టేలా లేదు. దాని నుంచి అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మనపైనే ఉంది. అందుకే ఎంతో అవసరం ఉంటే తప్ప మనం గుంపులోకి వెళ్లకపోవడమే ఉత్తమం. కరోనా బారిన పడిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం ఒక ఎత్తైతే, దాని కంట పడకుండా ఉండడమే శ్రేయస్కరమని అనేక మంది అనుభవాల ద్వారా నేర్వాల్సిన గుణపాఠం.