ఏపీలో బీఆర్ఎస్ ప్రవేశం నేటి నుంచి అధికారికంగా జరగనుంది. టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా అవతరించి బీఆర్ఎస్‌గా రూపాంతరం చెందింది. ఈ నేపథ్యంలో ఏపీలో ఆ పార్టీ పాగా వేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంది. ఇందులో భాగంగా ఇవాళ కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో పలువురు కీలక నేతలు చేరనున్నారు. బీఆర్ఎస్‌లో చేరుతున్న ముగ్గురు ముఖ్య నేతల గత రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే… జనసేనతో సంబంధాలున్న వారు కావడం గమనార్హం.
తోట చంద్రశేఖర్, రావెల కిషోర్‌బాబు, పార్థసారథిలతో పాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నేతలు కూడా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది కాపు సామాజిక వర్గ నేతలుండడం విశేషం. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈయన ఏపీలో ప్రభావిత సామాజిక వర్గమైన కాపు నేత కావడం గమనార్హం. కాపులపై వల విసరడానికి కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.
ఇదే జరిగితే జనసేనాని పవన్‌కల్యాణ్‌కు రాజకీయంగా నష్టం జరిగే ప్రమాదం వుంది. ఎందుకంటే పవన్ బలమంతా ఆయన సామాజిక వర్గమే. ఈ నేపథ్యంలో కాపుల్లో రాజకీయ చీలిక వస్తే పవన్ కల్యాణ్ బలహీనపడతారు. బీఆర్ఎస్‌లో జనసేన మాజీ నేతలు చేరాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జనసేనాని పవన్‌కల్యాణ్ రాజకీయ పంథాపై ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి వుందనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? పవన్‌కల్యాణ్ జనసేన కోసం కాకుండా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చేందుకు పని చేస్తున్నారనే ఆవేదన, ఆగ్రహం ఆ పార్టీ నేతల్లో ఉందని అంటున్నారు.
అందుకే ప్రత్యామ్నాయ మార్గాలను జనసేన నేతలు అన్వేషిస్తున్నారనేందుకు బీఆర్ఎస్‌లో చేరికలే ఉదాహరణగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో కాపు నేతల్ని ఎక్కువ సంఖ్యలో చేర్చుకునేందుకు కేసీఆర్ పకడ్బందీ వ్యూహం రచించే అవకాశాలున్నాయని సమాచారం. ఏపీలో పవన్‌కల్యాణ్ పొలిటికల్ ఫెయిల్యూర్‌ను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ఓ టీంను కేసీఆర్ సిద్ధం చేశారని తెలిసింది. ఈ టీం ఏపీలో రాజకీయాలను ప్రభావితం చేసే సామాజికవర్గాలపై దృష్టి సారించినట్టు సమాచారం. ఈ క్రమంలో ఇటు టీడీపీ, అటు వైసీపీలపై విసిగిపోయిన కాపు సామాజికవర్గం నేతలను తమ వైపు తిప్పుకునేందుకు కసరత్తు చేస్తోంది.
జనసేన తమకు సరైన వేదిక కాదనే భావన చాలా మంది పవన్ సామాజిక వర్గానికి చెందిన నేతల్లో వుంది. ఈ అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు బీఆర్ఎస్ చురుగ్గా పావులు కదుపుతోంది. తోట చంద్రశేఖర్ తదితర నేతల చేరిక ఆరంభమే అని, రానున్న రోజుల్లో కీలక నేతల్ని అక్కున చేర్చుకునే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదనేందుకు ఎన్నైనా ఉదాహరణలు చెప్పుకోవచ్చు.