ఏపీలో మళ్లీ 2014 నాటి రాజకీయ పరిస్థితులు పునరావృతం కానున్నాయా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులుండరనే మాట తరచూ వింటుంటాం. రాజకీయ అవసరాలను బట్టి పొత్తులు కుదుర్చుకోవడం, విడిపోవడం జరుగుతూ వుంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఎదుర్కోవాలంటే ఎవరికి వారు విడివిడిగా వుంటే సాధ్యం కాదని ప్రతిపక్ష పార్టీల నేతలు గట్టిగా నమ్ముతున్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యంగా టీడీపీ, జనసేన జగన్ను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉన్నాయి. లేదంటే అందరం రాజకీయంగా చావు దెబ్బతింటామనే భయం ఆ రెండు పార్టీల నేతల్లో వుంది. దీంతో బీజేపీని కలుపుకుని వెళ్లాలని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. కానీ బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. ఇది నిన్నమొన్నటి మాట. ఇప్పుడు బీజేపీ అగ్రనేతల మనసు మారుతున్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో రానున్న రోజుల్లో బీజేపీ కొంత వరకు దెబ్బతినే ప్రమాదం వుందని ఆ పార్టీ ఆందోళన చెందుతోంది.
దీంతో ప్రత్యామ్నాయంగా దక్షిణాదిలో ఎక్కువ సీట్లలో గెలుపొంది, నష్టాన్ని భర్తీ చేసుకునే క్రమంలో సుమారు 180-190 లోక్సభ స్థానాలపై దృష్టి సారించినట్టు సమాచారం. ఇందులో భాగంగా ఏపీలో 10 లోక్సభ స్థానాలపై బీజేపీ కన్నేసింది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ బలం శూన్యం. మరి ఆ పార్టీ పది స్థానాల్లో గెలుపొందాలంటే ఎలా? అనేది పెద్ద ప్రశ్న. దీంతో టీడీపీ-జనసేనతో కలిసి వెళ్లడమే ఉత్తమమని బీజేపీ అగ్రనేతలు ఆలోచిస్తున్నారని తెలిసింది.
ఈ నేపథ్యంలో ఈ నెల 8న కర్నూలులో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ రోజు బహిరంగ సభనా లేక పార్టీ నేతలతో మాత్రమే సమావేశం అవుతారా? అనేది ఇవాళ తేలనుంది. కర్నూలు తర్వాత తిరుపతిలో ప్రధాని మోదీతో సభ నిర్వహించేందుకు బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈ లోపు టీడీపీతో ఓ అవగాహనకు వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీకి పది లోక్సభ స్థానాల్లో మద్దతు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు.
బీజేపీతో పొత్తు వల్ల వ్యవస్థల మద్దతు వుంటుందని చంద్రబాబు భావన. అందుకోసమే బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు లోక్సభ స్థానాలను త్యాగం చేసేందుకు చంద్రబాబు సంకోచించరు. టీడీపీకి బీజేపీని దగ్గర చేయడమే లక్ష్యంగా పవన్ పని చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఆ మూడు పార్టీల మధ్య పొత్తుకు నెమ్మదిగా మార్గం సులువవుతోందనే ప్రచారానికి తెరలేచింది.