2024 దేశంలో ఎన్నికల సంవత్సరం. 2024లో దేశ లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఏపీ వంటి రాష్ట్రానికి అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు కూడా జరుగుతాయి. 2024లో ఎన్నికలంటే.. 2023లో అందుకు ఫుల్ ప్రిపరేషన్! పార్టీలన్నీ ఇక ఎన్నికల మూడ్ కు వెళ్లిపోతాయి. 2024లో జరగనున్న ఎన్నికలకు గానూ 2023లో అన్ని పార్టీలూ తమవైన ప్రిపరేషన్ ను చేపడతాయి. ఇప్పటికే రాజకీయ నేతలు వీధికి ఎక్కారు. ప్రతిపక్షంలోని వారి ఆరాటం ఇంకా ఎక్కువగా ఉంది. అధికార పక్షాలు తాపీగానే కనిపిస్తున్నా ప్రతిపక్షాలు మాత్రం అధిక ఆరాటాన్ని చూపిస్తున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రాల వరకూ ఇదే పరిస్థితి.
ఇప్పటికే రాహుల్ గాంధీ సుదీర్ఘ పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. కన్యాకుమారితో మొదలుపెట్టి కశ్మీర్ ను చేరుకోవడానికి వేగంగా నడుస్తున్నారు రాహుల్ గాంధీ. వేగంగా దూసుకుపోతూ తన ఫిట్ నెస్ ను చాటుకుంటున్న రాహుల్ గాంధీ ఈ వేగంలో ప్రజలకు ఏ మేరకు చేరవ అయ్యాడో!
ఇక తెలంగాణలో వరస పాదయాత్రలు సాగుతూ ఉన్నాయి. ప్రతిపక్షాల నేతలు ఒకరి తర్వాత ఒకరు రోడ్లకు ఎక్కుతున్నారు. మరి ఎవరి పాదయాత్ర ఫలప్రదం అవుతుందో. తెలంగాణకు 2023 ఎన్నికల ఏడాది. గత పర్యాయం ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ఈ సారి ఇక ముందస్తుకు వెళ్లకపోయినా ఎన్నికలకు అయితే పెద్ద సమయం లేదు. 2023లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. పార్టీలు అమీతుమీ తలపడటానికి రెడీ కావడమే మిగిలింది. అయితే ప్రతిపక్షాల పరిస్థితి ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కలహాలు ఒక కొలిక్కి రావడం లేదు. భారతీయ జనతా పార్టీకి ఆరాటం చాలానే ఉంది కానీ, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఇంకా ఆ పార్టీకి అభ్యర్థులే లేట్టుగా ఉంది పరిస్థితి. ఈ రెండు ప్రధాన పార్టీలతో పోలిస్తే కేసీఆర్ పార్టీనే ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధంగా కనిపిస్తోంది.
ఇక ఏపీలో 2023లో ఎన్నికలు వచ్చే అవకాశాలు లేనట్టే. జగన్ ముందస్తు తంత్రాలేవీ రచించడం లేదని సష్టం అవుతోంది. ఇక ప్రతిపక్షాల తరఫు నుంచి లోకేష్ ఒక యాత్రకు, పవన్ కల్యాణ్ మరో యాత్రకు రెడీ అవుతున్నారు. లోకేష్ సుదీర్ఘ పాదయాత్రను చేపట్టనున్నారట! ఇక పవన్ కల్యాణ్ యాత్ర ఎప్పుడు మొదలవుతుందో, ఎలా సాగుతుందో ఆయన సినిమా కాల్షీట్ల మీద ఆధారపడి ఉండవచ్చు.
మరోవైపు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా ఇది కీలకమైన సంవత్సరమే. మరో అవకాశం అడగడానికి తగిన గ్రౌండ్ ను బీజేపీ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంది. అలాగే తెలంగాణ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కూడా బీజేపీకి ప్రధానమైనవి. ఉన్న పరపతి నిలుపుకోవాలంటే కర్ణాటకలో గెలవాలి, కొత్త సత్తాను చాటుకోవాలంటే తెలంగాణలో సత్తా చూపించాలి బీజేపీ.