చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట. ముగ్గురు పేద మహిళలు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన టీడీపీ… దీనికి ప్రభుత్వానిదే బాధ్యత అనడం విమర్శలకు దారి తీస్తోంది. మరీ ముఖ్యంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జగన్ సర్కార్ వైఫల్యం వల్లే గుంటూరు దుర్ఘటన చోటు చేసుకుందని విమర్శించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిగ్గు… సిగ్గు అని వారు వ్యంగ్య కామెంట్స్ చేస్తున్నారు.
కనీసం కందుకూరు దుర్ఘటనతోనైనా గుణపాఠం నేర్చుకుని, మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోడానికి బదులు ఎదురుదాడికి దిగడం అచ్చెన్నాయుడికే చెల్లిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీగా జనాన్ని రప్పించుకుని, అరకొరగా కానుకలు పంపిణీ చేయడం వల్లే దుర్ఘటన చోటు చేసుకుందన్నది వాస్తవం. కానుకలకు బదులు టోకెన్ల పంపిణీకే ప్రాధాన్యం ఇవ్వడంతో తమకు దక్కుతాయో లేదో అనే ఆందోళనతో మహిళలు ఒక్కసారిగా ముందుకెళ్లే క్రమంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు గాయాలుపాలైన సంగతి తెలిసిందే.
ఈ దుర్ఘటనకు చంద్రబాబు ప్రచార యావే కారణమని వైసీపీ విమర్శలు చేస్తోంది. నిర్వాహకుల బాధ్యతా రాహిత్యానికి టీడీపీ క్షమాపణలు చెప్పి, ప్రాయశ్చిత్తం చేసుకోడానికి బదులు రాజకీయ లబ్ధి పొందడానికే అచ్చెన్నాయుడు ఉత్సాహం చూపారని ఆయన విమర్శలు తెలియజేస్తున్నాయి. పోలీసులు తక్షణం స్పందించడం వల్లే మిగిలిన వారి ప్రాణాలు కాపాడినట్టు ప్రభుత్వం చెబుతోంది.
లేదంటే పెద్ద సంఖ్యలో మృత్యువాత పడేవారని ప్రభుత్వ వాదన. ఏది ఏమైనా రాజకీయ నేతల స్వార్థపూరిత ఆటలో అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇప్పటికైనా అమాయకుల బతుకులతో చెలగాటం ఆడడం మానుకుంటే మంచిదని పౌర సమాజం హితవు చెబుతోంది.