Advertisement

Advertisement


Home > Politics - Opinion

2022 పొలిటికల్ రౌండప్.. ధీమా.. కుట్ర.. చెంచాగిరీ

2022 పొలిటికల్ రౌండప్..  ధీమా.. కుట్ర.. చెంచాగిరీ

2022 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినంత వరకు ఎలాంటి ప్రాధాన్యాన్ని కలిగిఉంది. వచ్చే ఎన్నికలను, భవిష్యత్ రాజకీయాలను, భవిష్యత్ తరాల తలరాతలను కూడా ఈ ఏడాది జరిగిన పరిణామాలు ఎలా నిర్దేశించబోతున్నాయి. మూడున్నరేళ్లుగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్, నాలుగోసారి సీఎం కావాలని ఆరాటపడుతున్న చంద్రబాబునాయుడు, తనకు ఏం కావాలో జీవితకాలంలో స్పష్టత తెచ్చుకోలేని పవన్ కల్యాణ్.. ఇంకా ఆటలో అరటిపండులాంటి ఇతర పార్టీల పరిస్థితులు 2022 సమగ్ర దృక్కోణంలో ఏమిటి? 

జగన్–  తాను కలగంటున్నట్టుగా మరో ముప్ఫయ్యేళ్లు ముఖ్యమంత్రిగా ఉండేలా ప్రజాశీస్సులను పొందగలరా? 

చంద్రబాబు– ముసలితనం పైబడ్డాక తాను అడుగుతున్న చివరి చాన్స్ అనే కోరికను ప్రజలు మన్నిస్తారా? 

పవన్ కల్యాణ్– కులాల ప్రస్తావన లేకుండా నిమిషమైనా మాట్లాడలేని ఈ నాయకుడు, తాను చెబుతున్నట్టుగా వందల విస్మృతకులాల వారినందరినీ ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా ఒక్కొక్కరికీ నెలరోజులైనా చాన్సులు పంచిపెడతారా? మిగిలిన పార్టీలు ఏం చేయాలనుకుంటున్నాయి? 2022.. రాజకీయ పరిణామాలపై విహంగ వీక్షణం ఈ గ్రేట్ ఆంధ్ర‌ కథనం.

మామూలు వాతావరణంలో అయితే.. 2019లో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన రాష్ట్రంలో మూడేళ్లకు, అంటే 2022 నాటికి రాజకీయంగా స్తబ్ధత మాత్రమే ఉంటుంది. జాతీయ రాజకీయాల పరంగా దేశమంతా కూడా అలాంటి స్తబ్ధతే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల రూటే సెపరేటు. ఎన్నికలు రెండేళ్ల దూరంలో ఉన్నప్పటికీ.. 2022 ఎన్నికల సంవత్సరంలాగానే చెలామణీ అయింది. ఎందుకంటే ఇక్కడి నాయకులందరికీ తక్షణం అంటే ఇప్పటికప్పుడే రాష్ట్రంలో అధికారమార్పిడి జరగాలని కోరిక. తక్షణం ఎన్నికలు వచ్చేయాలని ఆరాటం. అర్జంటుగా తామే ముఖ్యమంత్రులు అయిపోవాలని పేరాశ. ఈ నేపథ్యంలో ఏడాది ప్రారంభం నుంచి కూడా నాయకులు ఎన్నికల వాతావరణంలోనే గడుపుతున్నారు. వివాదాల కుంపట్లను రాజేస్తున్నారు. వచ్చే ఏడాది హీట్ మరింతగా పెరగబోతున్న నేపథ్యంలో.. ఈ ఏడాది ఎలా నడిచిందో.. నాయకుల వారీగా వారి బలాబలాల వారీగా సమీక్షించుకుందాం.

జగన్.. ధీమా

ఈ ఏడాదికి సంబంధించినంతవరకు జగన్మోహన్ రెడ్డిని ఒక్క పదంలో నిర్వచించాల్సి వస్తే ‘ధీమా’ అని చెప్పాలి. లెక్కకు మిక్కిలిగా, ప్రజలు ఊహించనంతగా, మేనిఫెస్టోలో చెప్పినదానికంటె ఎక్కువగా తాను సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నాననే ధీమా జగన్ ది. ఆ సంక్షేమమే మళ్లీ మళ్లీ తనను ముఖ్యమంత్రిని చేస్తూనే ఉంటుందని ఆయన నమ్మకం. అందుకేనేమో.. యాభయ్యేళ్ల వయసున్న జగన్.. మరో  ముప్ఫయ్యేళ్ల వరకు, అంటే తనకు ఎనభై వచ్చే వరకు ముఖ్యమంత్రిగా ఉంటానని కూడా విశ్వాసం వ్యక్తం చేస్తుంటారు. లక్షల కోట్ల రూపాయల సంక్షేమం వల్ల, రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఇంటికీ.. ఏదో ఒకరీతిగా ప్రభుత్వ లబ్దిని చేరుస్తున్నందువల్ల.. ఆయనలో అపరిమితమైన ఆత్మవిశ్వాసం, ధీమా తొణికిసలాడుతున్నాయి. 

జగన్ అంటే గిట్టని వారు ఇదే లక్షణాన్ని ‘పొగరు’ అని కూడా అనుకోవచ్చు. తటస్థంగా ఉండగల వారు కూడా దీనిని పొగరుగా భావింవచ్చు. ఆ పొగరు కారణంగానే ఆయన ఈ ఏడాదిలో చాలా దూకుడును ప్రదర్శించారు. ఉద్యోగుల పీఆర్సీ విషయంలో తాను నమ్మినదే కరెక్టు అని చాలా మొండిగా, దృఢంగా వ్యవహరించారు. ఉద్యోగ సంఘాలన్నీ కలిసి నిరసనలు తెలియజేసినా, ఉద్యమాలకు దిగినా ప్రభుత్వం తలొగ్గలేదు. సుదీర్ఘమైన రాజీచర్చల తర్వాత చాలా స్వల్పంగా మాత్రమే మెత్తబడింది. ఉపాధ్యాయులు మరికొన్ని వర్గాల్లో పీఆర్సీ, ఇతర సర్వీసు అంశాల పట్ల అసంతృప్తులు ఉన్నప్పటికీ జగన్ ఖాతరు చేయలేదు. ఒకవైపు– పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లలాగా మార్చేస్తూ.. మరొకవైపు– ఒకటో తరగతినుంచి ఇంగ్లిషు మీడియంతో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే నాణ్యతప్రమాణాలను తీసుకువస్తూ.. ప్రజల హృదయాలను చూరగొంటున్న జగన్మోహన్ రెడ్డి.. ఉపాధ్యాయుల తిరస్కారాన్ని పట్టించుకోవడం లేదు. పైగా స్కూళ్ల మీద పిల్లల తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరగడానికి, హాజరు విషయంలో అవకతవకలు జరగకుండా చూడడానికి ఆధునిక సాంకేతికత సాయంతో.. కొత్త నిబంధనలు కూడా తీసుకువస్తున్నారు. 

మాట తప్పను మడమ తిప్పను అని తన కేరక్టర్ గురించి తాను గర్వంగా చెప్పుకునే, అనేక రూపాల్లో నిరూపించుకునే జగన్మోహన్ రెడ్డి ఒక్కవిషయంలో మాత్రం దారుణంగా ఫెయిలయ్యారు. ఆ వైఫల్యం ఈ ఏడాదిలోనే బయటకు వచ్చింది. ఎన్నికలకు ముందు ఉద్యోగవర్గాలనుంచి తనకు లభిస్తున్న ఆదరణ చూసి, ఆ అత్యుత్సాహంలో సాధ్యాసాధ్యాల విచక్షణ మరచిపోయి జగన్ ఒక అలవిమాలిన హామీ ఇచ్చారు. పాత పెన్షను విధానాన్ని పునరుద్ధరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయనకు అందులోని భారం, ఎవ్వరూ ఆ అంశాన్ని టచ్ చేయకుండా ఉండడంలోని మర్మం బోధపడ్డాయి. అప్పటికీ మధ్యేమార్గంగా ఇంకో పద్ధతిని ఉద్యోగులకు లాభదాయకంగా సూచించారు. కానీ ఉద్యోగులు గట్టిగాపట్టుపట్టి పాత పెన్షన్ విధానమే కావాలని కోరుతున్నారు. అది పూర్తిగా సీఎం వైఫల్యం. ఆ విషయంలో ఉద్యోగవర్గాలు జగన్ ను ఇరుకున పెట్టడానికి ఈ ఏడాదిలో చాలా ప్రయత్నాలుచేశాయి. ఉద్యోగులు రచ్చ చేసినప్పుడు, ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నించినప్పుడు.. విపక్షాలు పండగ చేసుకున్నాయి.

చంద్రబాబునాయుడు ఆ ఎపిసోడ్ లను ఆస్వాదించారు గానీ.. ‘నన్ను గెలిపించండి, తక్షణం పాత పెన్షన్ విధానం తెస్తా’ అనే మాట మాత్రం అనలేదు. ఉద్యోగులు ఆయన చాణక్యంలోంచి అయినా వాస్తవం గ్రహించాలి. అది మినహాయిస్తే.. జగన్ పాలన ఈ ఏడాది పొడవునా ప్రజారంజకంగా సాగినట్టే. సంక్షేమ పథకాలు అనూహ్యమైన రీతిలో అమలవుతున్నాయి. కానీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవం. అప్పులకోసం నిత్యప్రయత్నాలు కొనసాగిస్తున్న మాట కూడా వాస్తవం. ఆ విషయం ప్రభుత్వం కూడా దాచడం లేదు. కాకపోతే చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో అవకతవకల వల్ల ఈ ఆర్థిక దుస్థితి ఏర్పడిందని చెప్పుకుంటూ ఉంటుంది. అయితే విపక్షాల స్ట్రాటజీ వేరు. ‘‘ఈ నెలలోనే తీసుకోండి. వచ్చే నెలలో ఏ పథకాలూ ఉండవు..’’  అని విపక్షాలు ప్రతిరోజూ ప్రచారం చేస్తుంటాయి. ‘‘జీతాలు ఇవ్వలేకపోతున్న సర్కారు’’ అని 2,3 తేదీలనుంచి పచ్చమీడియా ప్రచారం ప్రారంభిస్తుంది. ఆలస్యం అవుతున్నాయి గానీ.. ప్రతినెలా జీతాలైతే వస్తున్నాయి. ఏవీ ఆగడం లేదు. ఇది విపక్షాలకు జీర్ణం కావడం లేదు. ఏ పథకం కూడా ఆగలేదు. బటన్ నొక్కి  ప్రజల ఖాతాల్లో వేసేస్తున్నారు. 

రాష్ట్రానికి రాజధాని విషయంలో జగన్ నిర్ణయం అధికార వికేంద్రీకరణ నుంచి, అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి అనే లక్ష్యంనుంచి పక్కకు మరలలేదు గానీ.. న్యాయపరంగా ఎదురుదెబ్బ తగిలింది. వికేంద్రీకరణ చట్టాన్ని ఉపసంహరించుకున్నాక కూడా .. అది చెల్లదని, రాజధాని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కోర్టు చెప్పింది. దాంతో మూడురాజధానుల వ్యవహారం సస్పెన్స్ లో పడింది. అయితే.. అధికార వికేంద్రీకరణ– మూడురాజధానుల ఆశయం పట్ల తమ చిత్తశుద్ధిని జగన్ సర్కారు చాటుకుంటూనే ఉంది. న్యాయపరమైన ఇబ్బందిని అధిగమించి.. మూడురాజధానుల కల సాకారం చేసే మార్గాలను జగన్ అన్వేసిస్తున్నారు. పార్టీ నాయకులు విశాఖలో ఇప్పుడే రాజధాని అని రకరకాలుగా చెబుతున్నా, 2024 ఎన్నికల్లో విజయం దక్కిన వెంటనే ఆ పర్వం పూర్తవుతుందని అనుకుంటున్నారు. జనం మొహాల్లో చిరునవ్వు ఒక్కటే లక్ష్యం అని చెప్పుకునే జగన్ దాన్ని సాధించగలుగుతున్నారు. 2022 ఏడాది మొత్తం ఇలాంటి సంక్షేమ నామసంవత్సరంగానే సాగిపోయింది. 

చంద్రబాబు.. కుట్ర

రాజకీయం అంటేనే అవకాశవాదం. ఈ రెండూ కవలపిల్లలు. అవకాశవాదం ఎరగని రాజకీయనాయకుడిని.. ఏదో కవిత్వంలో చెప్పినట్టు, భూతలమంతా వెతికినా దొరకడు. కాకపోతే చంద్రబాబునాయుడు అవకాశవాదానికి పరాకాష్ట. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే వైఖరికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. ఒక్క నరేంద్రమోడీ విషయంలోనే ఎన్నెన్ని రకాలుగా నాలుక మడతపెట్టాడో అందరికీ తెలుసు. ఎన్ని వక్రబుద్ధులను ప్రదర్శించాడో.. ఇప్పుడెలా వ్యవహరిస్తున్నాడో.. అవసరం కొద్దీ ఆయన మర్చిపోయినా.. బిజెపి ప్రతి కార్యకర్తా బాగానే గుర్తుంచుకున్నారు. అలాంటి నిలువెత్తు అవకాశవాది చంద్రబాబునాయుడు.. ఇప్పుడు 2022 సంవత్సరాన్ని తన రాజకీయ జీవితంలో ‘కుట్ర నామసంవత్సరం’గా రూపుదిద్దుకున్నారు.

2022 సంవత్సరం మొదలయ్యే నాటికి జగన్ సర్కారు ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయ్యాయి. అప్పటికి ఆయన రాష్ట్రంలో రాజకీయ స్థితిగతులను తనకున్న అపారమైన అనుభవంతో సమీక్షించుకున్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. చంద్రబాబుకు అస్సలు నచ్చని సంగతి అది. అందరూ ఏడుస్తూ ఉంటేనే ఆయనకు సంతోషం. మీ ఏడుపులు నేను కడతేరుస్తా అంటూ మాయమాటలు చెప్పే అవకాశం ఉంటుందని ఆయనకు ఆశ. సంక్షేమ  పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయి. అందరూ జగన్ పట్ల సానుకూల అభిప్రాయంతో, ప్రేమతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో తాను మళ్లీ గెలవడం అనేది అసాధ్యం. గెలవాలంటే రాష్ట్రంలో కల్లోలం పుట్టించాలి. కానీ శాంతి భద్రతల్ని కూడా జాగ్రత్తగానే చూసుకుంటున్నారు.. అది తన వల్ల కాదేమో. అందుకే ఆయన ప్లాన్ బీ కుట్రకు తెరతీశారు. జగన్ కు చెందని ప్రతి ఓటును కూడా తానే దక్కించుకుంటే తప్ప.. గెలుపు గురించి ఆలోచన కూడా సాగదని ఆయనకు అర్థమైంది. అందుకే పవన్ కల్యాణ్ ను దేబిరించడం ప్రారంభించారు. 

2014లో అమాయకత్వం కొద్దీ, ప్యాకేజీకి ఆశపడి, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి తన కులాన్ని, సినిమా హీరోగా తనకున్న ప్రజాదరణను అమ్మేసుకున్న పవన్ కల్యాణ్, బాబు పాలన చూసి కళ్లు తెరచుకుని, 2019 ఎన్నికల నాటికి ఛీకొట్టి వెళ్లిపోయాడు. అయినాసరే.. పవన్ కల్యాణ్ ను దేబిరించి మళ్లీ ఆయనతో కలిసి పోటీచేయాలనే ప్రతిపాదనను చంద్రబాబు ఈ ఏడాదిలోనే తెరపైకి తెచ్చారు. పవన్ కల్యాణ్ పట్ల నాకు వన్ సైడ్ లవ్ ఉన్నదని, ఆయన ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని సిగ్గువిడిచి బహిరంగ సభ వేదికమీదనుంచి చెప్పుకున్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటిదాకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనేలేదు. లోపాయికారీ కుట్రలు మాత్రం బీభత్సంగా సాగుతున్నాయి.

చంద్రబాబు ఏడాది పొడవునా కుట్రలు మాత్రమే చేస్తున్నారు. అమరావతి ముసుగులో తెలుగుదేశం కార్యకర్తలను పోగేసి వారితో యాత్రలు చేయించడం, ఆందోళనలు చేయించడం, యాత్రలను స్పాన్సర్ వంటివన్నీ చంద్రబాబు కుట్రలే. చంద్రబాబుకు నిజాయితీ ఉంటే అమరావతి రైతుల పోరాటాన్ని పార్టీ సమర్థిస్తుందని.. మేమే ఏర్పాట్లన్నీ చేస్తాం అని ధైర్యంగా చెప్పుకోవాలి. అలా అనాలంటే భయం. కమ్మకులం కోసం చేసిన రాజధానికి అంత లావు సపోర్ట్ బాహాటంగా ఇస్తే కులం ముద్ర పడిపోతుందనే భయం. కానీ కులం కోసం ఆరాటం. కాబట్టే అన్నీ దొంగచాటు పనులే. అన్నీకుట్రలే. అటు తిరుపతి దాకా వారిని నడిపించిన చంద్రబాబు, యాత్ర ప్రశాంతంగా జరిగేసరికి ఓర్వలేకపోయాడు. విధ్వంసం రేపడానికి అరసవెల్లి వైపు యాత్రకు స్కెచ్ వేయించారు. విశాఖ రాజధాని గురించి ఉత్తరాంధ్ర పండగ చేసుకుంటోంటే.. వారిని రెచ్చగొట్టడానికి అరసవెల్లి దాకా విశాఖను వ్యతిరేకించే గూండాలతోయాత్ర ప్లాన్ చేయించారు. కోర్టు అనుమతులతో మొదలైంది. కొన్ని దుర్ఘటనలు జరిగాక.. ఐడీ ప్రూఫ్ లు చూపాలని పోలీసులు అడిగేసరికి.. రైతుల ముసుగులోని తెలుగుదేశం గూండాలు తోకముడిచి పలాయనం చిత్తగించారు. యాత్ర ఆగిపోయింది. అమరావతి డిమాండ్ విషయంలో డ్రామాలు బయటపడ్డాయి. దానికి అతీగతీ లేకుండాపోయింది. 

2022 సంవత్సరాన్ని తన రాజకీయ జీవితంలో కుట్ర నామ సంవత్సరంగా తీర్చిదిద్దుకున్న చంద్రబాబు.. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ పేరుతో ఆ ఏడాదిలో ఖర్మ నామ రుతువుతో మగించారు. ఇదేం ఖర్మ ముసుగులో ప్రాణాల్ని కూడా బలితీసుకున్నారు. ఈ ముసుగులో ఇంకెన్ని ఘోరాలుచేస్తారో తెలీదు. లోకేష్ పాదయాత్ర మొదలయ్యాక ఈ ఖర్మ గోల ఉండదు. 

పవన్ కల్యాణ్.. చెంచాగిరీ

కుల మతాల ఊసే లేకుండా ఈలలు వేసే జనం.. సిద్ధాంతాలు విశ్వసనీయత సామర్థ్యం పట్టించుకోని కులం.. ఈ రెండూ తనకు పుష్కలంగా ఉన్నాయి గనుక.. ఏదో ఒక నాటికి ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని అయిపోతాను అని బలంగా నమ్మే అత్యాశపరుడు సినీనటుడు పవన్ కల్యాణ్. బహిరంగ సభావేదికల మీద కూడా ఉగ్ర, వెకిలి, హాస్యగాడు, బాబా రూపాలను ఏకకాలంలో ప్రదర్శించగల అసమాన ప్రజ్ఞాధురీణుడు. అనేక సుద్దులు చెబుతారు. పార్టీని ఎలా నడపాలో తెలియదు. పార్టీకి కేడర్ ఉంటుందనే సంగతి కూడా తెలియనట్టుగా నడుపుతారు. అదేం అంటే.. నాకు పార్టీ సంస్థాగత నిర్మాణం కాదు, ప్రజలు ఉంటే చాలు.. అంటూ నాటకీయ పంచ్ డైలాగులు చెబుతారు. 2019లో ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత.. బిజెపి పంచన చేరిన ఈ రాజకీయ నాయకుడు.. వారితో సంసారాన్నయినా మనస్ఫూర్తిగా చేస్తున్నాడా అంటే అదీ లేదు. మనసంతా చంద్రబాబు మీదనే ఉంటుంది. ఆయన వన్ సైడ్ లవ్ పేరుతో కన్నుగీటితే మురిసిపోతుంటాడు. 

‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు’ అనే మాట ‘జైకిసాన్ జై జవాన్’ లాంటి నినాదం  అని ఆయన ఫీలైపోతాడు. ‘వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అనే డైలాగు ‘వందేమాతరం’ వంటి ప్రతిజ్ఞ అని భావిస్తాడు. ఇలాంటి అమాయకుడైన, సొంత బుర్రలేని నాయకుడు చంద్రబాబు స్కెచ్ లో పావుగా మారిపోయాడు. పవన్ కల్యాణ్ రాజకీయం మొత్తం చంద్రబాబుకు చెంచాగిరీ చేయడానికే అన్నట్టుగా తయారైంది. చంద్రబాబును తిరిగి సీఎం పీఠం మీదకు తీసుకురావడమే ఆయన జీవిత లక్ష్యం. తనకు సినిమా షూటింగుల్లో గ్యాప్ దొరికినప్పుడెల్లా అందుకు సర్వశక్తులు ఒడ్డడానికి ఆయన కష్టపడుతున్నారు. 

అంతా అనుకున్నట్టుగా, ఆయన ముందే ప్రకటించినట్టుగా విజయదశమి నాడే రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర ప్రారంభించి ఉంటే 2022 పవన్ కల్యాణ్ కు వారాహి నామ సంవత్సరంగా మారి ఉండేది. కానీ.. సినిమా షూటింగుల బిజీ వల్ల.. ప్రజల వద్దకు వెళ్లే కార్యక్రమాన్ని ఎన్నడో తెలియలనంత దూరానికి వాయిదా వేసినందుకు ఇది కేవలం చెంచాగిరీ నామ సంవత్సరంగానే ఆయన కెరీర్ లో మిగిలిపోయింది.

ఇతరులకు టైంపాస్

ఇతర పార్టీల వారికి ఇది టైంపాస్ సంవత్సరం అని చెప్పాలి.- భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర రాజకీయాలు అవసరం లేదు. రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా కేంద్రంలో అవసరాలకు తమకు మద్దతిస్తారనే ధీమా.. వారు ఈ రాష్ట్రం మీద కనీస ఫోకస్ పెట్టడానికి, రాష్ట్రానికి క నీసమైన మేలు చేయకపోవడానికి ప్రధాన కారణం. సోము వీర్రాజు వంటి అసమర్థుడి సారధ్యంలో పార్టీ ఏ పాతాళాలకు పోయినా పర్లేదులెమ్మని వారు ఏదో చిన్నా సన్నా కార్యక్రమాలతో కాలం గడుపుతున్నారు. 

వామపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా స్పందిస్తున్నాయి. ఉద్యోగుల పోరాటాలు, అమరావతి పోరాటాలకు దన్నుగా నిలిచాయి. కానీ గెలిచేంత బలం లేని పార్టీలు. చంద్రబాబు పంచన చేరాలని వారికి కోరిక. వారి ఓటు బ్యాంకు పర్లేదు గానీ.. దానికంటె తక్కువ ఓటు బ్యాంకు ఉన్నా బిజెపితో ముడిపడాలని చంద్రబాబు ఉబలాటం. మోడీ ప్రాపకం పొందితే లబ్ధి ఎక్కువని ఆయన పేరాశ. అలా వారు ఏదో అలా రోజులు నెట్టుకొస్తూ.. 2022 ను టైంపాస్ సంవత్సరంగానే నడిపిస్తున్నారు.

2023లోకి అడుగుపెడితే..

గుర్తుపెట్టుకోండి.. ఏపీలో ఎన్నికలు 2024లోనే జరగవచ్చు గాక.. కానీ.. 2023 మాత్రం యుద్ధనామ సంవత్సరంగానే గడవబోతున్నది. ధర్మయుద్ధమా? అధర్మయుద్ధమా? ఏది ఎవరివైపున ఉన్నది.. అనే సంగతులను ఎప్పటికప్పుడు గమనించి నిర్ణయించుకోవాల్సిందే.

.. ఎల్. విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?