హయత్‌నగర్‌లో రజిత హత్య కేసు నిందితులను పోలీసులు గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియాకు వెల్లడించారు.
ప్రియుడి సహాయంతో కీర్తి తన తల్లి రజితను హత్య చేసిందన్నారు. 19న రజితను హత్య చేసి మూడు రోజుల తర్వాత రామన్నపేట రైల్వే ట్రాక్‌పై మృతదేహాన్ని పడేశారని చెప్పారు. ఆ తర్వాత మిస్సింగ్ కేసు పెట్టి.. తప్పించుకునే ప్రయత్నం చేశారని అన్నారు.
కీర్తితో పాటు ఆమెకు సహకరించిన రెండో ప్రియుడు శశిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టమన్నారు. ఈ క్రైమ్.. దృశ్యం సినిమాకు సెకండ్ పార్ట్‌లా ఉందని అభిప్రాయపడ్డారు.
‘కీర్తి, బాల్‌రెడ్డిల మధ్య లవ్ ఎఫైర్ ఉండటంతో.. వారిద్దరికి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలోనే బాల్‌రెడ్డి కీర్తిపై అత్యాచారం చేశాడు. గర్భం దాల్చిన కీర్తికి శశికుమార్ అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత కీర్తిని శశికుమార్ బ్లాక్మెయిల్ చేశాడు. అబార్షన్ విషయం ఇంట్లో చెబుతానని వేధించాడు.
కీర్తి ఆస్తిపై కన్నేసిన శశి.. ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. కీర్తితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. పెళ్లికి కీర్తి తల్లి అడ్డు చెప్పడంతో ఆమెను హత్య చేసేందుకు పథకం రచించారు.
శశికుమార్ సహాయంతో కీర్తి తల్లిని హత్య చేసింది. మృతదేహాం తరలించేటప్పుడు కీర్తికి శశి మద్యం తాగించాడు. రజిత హత్య చేసిన తరువాత ఇంట్లోని రూ.10 లక్షలు తీసుకోవాలని భావించారు.
గతంలోనే తల్లికి నిద్రమాత్రలు ఇచ్చి చంపేందుకు కీర్తి ప్రయత్నించినప్పటికీ.. అది విఫలమైంది. కీర్తిపై అత్యాచారానికి పాల్పడ్డ బాల్‌రెడ్డిపై కేసు నమోదు చేశాం. నిందితులపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశాం’అని సీపీ తెలిపారు.