జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడిగిందే తడవు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇచ్చేశారు. ఇంతకీ చంద్రబాబు ఇచ్చిందేమిటి.? ఇంకేముంటుంది.? ప్రస్తుతానికి 'మద్దతు'. అదీ, జనసేన విశాఖలో తలపెట్టిన 'లాంగ్ మార్చ్'కి. రాష్ట్రంలో ఇసుక కొరత విషయమై జనసేన పార్టీ నవంబర్ 3న విశాఖలో 'లాంగ్ మార్చ్' చేపడ్తున్న విషయం విదితమే. ఇందుకోసం జనసేనాని, ఆయా రాజకీయ పార్టీల అధినేతలతో ఫోన్‌లో మాట్లాడారు.
వామపక్షాలు, తెలుగుదేశం పార్టీతోపాటు భారతీయ జనతా పార్టీ కూడా పవన్ లిస్ట్‌లో వున్నాయి. 'ఇసుక సమస్యపై ఎవరు పోరాటం చేస్తామన్నా మద్దతిస్తాం..' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ప్రకటించారుగానీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి మాత్రం, 'ఆ అవసరం లేదు..' అంటూ తేల్చి చెప్పేశారు. 'కన్నా లక్ష్మినారాయణ ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిన అవసరం లేదు' అని విష్ణువర్ధన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీలో కొంత అలజడికి కారణమయ్యాయి.
ఇదిలా వుంటే, పవన్ కళ్యాణ్ చేపడ్తున్న 'లాంగ్ మార్చ్'కి తెలుగుదేశం పార్టీ మద్దతిస్తుందని స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ – జనసేన మధ్య 'తెరవెనుక ఒప్పందం' కుదిరిందంటూ టీడీపీ నేతలే స్వయంగా ప్రకటనలు చేశారు. 2014 ఎన్నికల్లో అయితే బాహాటంగానే జనసేన, టీడీపీకి మద్దతిచ్చింది.
అదేంటో, ఓ సారి చంద్రబాబు వెన్నుపోటు రుచి చూసినా.. మళ్ళీ మళ్ళీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు కోసం పాకులాడుతున్నారు. జనసైనికులకు మాత్రం మింగుడుపడని విషయమిది. 'టీడీపీకి పవన్ కళ్యాణ్ ఇచ్చిన కాల్‌షీట్స్ ఇంకా అయిపోలేదు..' అంటూ వైసీపీ నేత విజయసాయిరెడ్డి సెటైర్ వేశారంటే.. అది ఉత్త సెటైర్ కాదు, నిజమేనని ఇదిగో.. చంద్రబాబు ప్రకటనతో ఇంకోసారి నిరూపితమయ్యింది.
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఆందోళనపై స్పందించి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలుస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్, ఇసుక కార్మికుల సమస్యపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలవకపోవడమేంటి.? కలుస్తానని ఇప్పటికీ చెప్పకపోవడమేంటి.? ఇదే రాజకీయాల పట్ల పవన్ కళ్యాణ్ అపరికపక్వతను బయటపెడ్తోంది.