సీనియర్ మంత్రికి ఆ మాత్రం ఆలోచన ఉండదా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయ ప్రత్యర్థులు చేస్తూ ఉండే అనేకానేక విమర్శలకు మరింత బలం చేకూర్చే విధంగా, ప్రతిపక్షాల చేతికి అస్త్రాలను సమకూర్చే విధంగా మాట్లాడడంలో సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ముందువరుసలో…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయ ప్రత్యర్థులు చేస్తూ ఉండే అనేకానేక విమర్శలకు మరింత బలం చేకూర్చే విధంగా, ప్రతిపక్షాల చేతికి అస్త్రాలను సమకూర్చే విధంగా మాట్లాడడంలో సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ముందువరుసలో ఉంటారు. 

వాలంటీర్లు అంటే కేవలం వైసీపీ కార్యకర్తలే అని, వారిద్వారా ప్రభుత్వం లోపాయికారీ రాజకీయ అవసరాలను నెరవేర్చుకుంటున్నదని విపక్షాలు పదేపదే బురద చల్లుతుంటాయి. నిజానికి ఈ ఆరోపణలు తిప్పికొట్టే విధంగా, వాలంటీరు వ్యవస్థలో ఉండే ప్రయోజనాల గురించి అధికార పార్టీ వారు మాట్లాడాలి. అయితే.. ధర్మాన ప్రసాదరావు మాత్రం చాలా తరచుగా ప్రతిపక్షాలు చెబుతున్నదే నిజం అనిపించేలా మాట్లాడుతుంటారు. ఇలా అధికార పార్టీని ఇరుకున పెట్టడం ఆయనకు కొత్తకాదు, పైగా ఆయన ఇరుకున పెట్టే అంశం ఇదొక్కటే కూడా కాదు. 

తాజాగా శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తన తమ్ముడు ధర్మాన కృష్ణదాసు నియమితులైన సందర్భంలో ప్రసాదరావు మాట్లాడారు. తన మాటల్లో.. వాలంటీర్ల వ్యవస్థ వలన తమ చేతిలో అధికారం పోయిందని పార్టీ కార్యకర్తల్లో.. నాయకత్వం పట్ల అసంతృప్తి చాలా ఉన్నదని సెలవిచ్చారు. 

మీ అసంతృప్తిని అర్థం చేసుకోగలను గానీ.. మీరు పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకోవాలని హితవు చెప్పారు. గ్రామాల్లో వైకాపా నాయకులు చెప్పిన పిల్లల్నే వాలంటీర్లుగా నియమించాం. వారి ద్వారానే పథకాలు ప్రజలకు చేరుతున్నాయి అని కూడా సెలవిచ్చారు. అసలే వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలని విపక్షాలు ఆరోపిస్తున్న తరుణంలో ధర్మాన ఇలామాట్లాడడం సొంత పార్టీ నాయకులకే చికాకు కలిగిస్తోంది. 

ఇదొక్క విషయం మాత్రమే కాదు. గతంలో విశాఖ రాజధాని విషయంలో కూడా.. ధర్మాన పార్టీని ఇబ్బంది పెట్టేలా మాట్లాడారు. మూడురాజధానులు అనే కాన్సెప్టు ఒక ట్రాష్ అని, విశాఖ ఒక్కటే రాజధానిగా ఉంటుందని.. అమరావతి, కర్నూలు ఉత్తుత్తివేనని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడడం వివాదాస్పదం అయింది. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయనను పిలిపించి మందలించినట్టుగా కూడా గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత.. రాజధాని విషయంలో నోరు జారకుండా ధర్మాన అదుపు పాటిస్తున్నారు గానీ.. వాలంటీర్ల విషయంలో ఆయన ప్రతిసారీ.. పార్టీని ఇబ్బంది పెట్టే ప్రకటనలతో దూసుకెళుతున్నారు.