మంత్రాలు మంత్ర దండాలు జానపద సినిమాల్లోనే కనిపిస్తాయి. ఆధునిక కాలంలో చూస్తే రాజకీయ నాయకులు మంత్రాలకు చింతకాయలు రాలుస్తామని చెప్పి జనాలను హామీలతో బోల్తా కొట్టిస్తూంటారు. ప్రజలకు మేలు చేయడానికి మంత్రాలు మంత్ర దండాలు లేకపోయినా తమ బాగు కోసం వారికి మంత్రదండాలు ఉన్నాయని అందుకే వారు అపర కుబేరులు అవుతున్నారన్న మాట జనాంతికంగా ఉంటోంది. అదే మాటను శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా అంటున్నారు.
చంద్రబాబు వద్ద మంత్రదండం ఒకటి ఉందంటూ స్పీకర్ జానపద కధను గుర్తు చేసే విధంగా మాట్లాడారు. బాబు నారావారిపల్లెలో కేవలం రెండు ఎకరాల ఆసామి అని ఈ రోజున ఆయన వేల కోట్లకు అధిపతి అని తమ్మినేని సీతారాం గుర్తు చేశారు. బాబుకు అన్నేసి వేల కోట్లు ఎలా వచ్చాయంటే ఆయన వద్ద ఒక అద్భుతమైన మంత్రదండం ఉందిట.
అందుకే బాబు గారు అపర కుబేరులు అయ్యారని తమ్మినేని సెటైర్లు వేశారు. ఆ మంత్రదండం ఏదో ఆంధ్రాలోని నిరుపేదలకు ఇస్తే కనుక వారు క్షణాలలో ధనవంతులు అవుతారు కదా బాబూ అంటూ ఒక విలువైన సలహా ఇచ్చారు. ఉత్త హామీలు ఇచ్చి జనాలను మభ్యపెట్టే కన్నా బాబు తన మంత్రదండాన్ని ఇస్తే చాలు ఏపీ మొత్తం బాగుపడిపోతుంది అని తమ్మినేని అంటున్నారు.
ప్రతీ ఎన్నికకు ముందూ హామీలు ఇష్టం వచ్చినట్లుగా ఇవ్వడం ఓట్లు దండుకున్నాక వాటిని పక్కన పెట్టేయడం బాబుకు అలవాటు అయిన విద్య అని తమ్మినేని విమర్శించారు. ఆయన హామీలనీ మోసాలు వంచనే తప్ప మరోటి కాదని చురకలు అంటించారు. బాబుని నమ్ముకుంటే ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను కూడా పీకి అవతల పారేస్తారు అని ఆయన హెచ్చరించారు.