భారత రాష్ట్ర సమితి పేరిట జాతీయ పార్టీగా మారిన క్రమంలో ఏపీలో చేరికలకు రంగం సిద్ధం అయింది. ముక్కోటి ఏకాదశి శుభవేళ బీఆర్ఎస్ లో ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు చేరుతున్నారు. అయితే వారంతా జనసేనకు చెందిన మాజీ తాజా నాయకులు కావడమే గమనార్హం.
జనసేన తరఫున 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసిన మాజీ ఐఆరెస్ అధికారి చింతల పార్ధసారధి బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోబోతున్నరు. ఆయన జనసేన తరఫున అప్పట్లో సీరియస్ గానే రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆయనకు 82 వేల 588 ఓట్లు లభించాయి. అలాగే మొత్తం పోల్ అయిన ఓట్లలో 6.67 శాతాన్ని తెచ్చుకున్నారు. గట్టి నేతగా మేధావిగా పేరున్న ఆయన బీఆర్ఎస్ లో చేరడం విశేషం.
అలాగే గోదావరి జిల్లాలకు చెందిన జనసేన సీనియర్ నేత తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఆయన 2014లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత జనసేనలో చేరి 2019లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడారు. పవన్ కి సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. ఆయన ఏపీ బీఆర్ఎస్ పార్టీకి ప్రెసిడెంట్ అని ప్రచారం సాగుతోంది.
ఏపీలో ప్రధాన సామాజికవర్గానికి చెందిన కాపుల మద్దతు పొందేందుకే బీఆర్ఎస్ ఆ సామాజికవర్గం నుంచి కీలక నేతను తెచ్చి రాష్ట్ర పార్టీ పగ్గాలను అందించబోతోంది అని అంటున్నారు. ఈ ఇద్దరుతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి రావుల కిషోర్ బాబు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఆయన 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు.
ఇలా బీఆర్ఎస్ తొలి బోణీ జనసేన నుంచే కావడం విశేషం. పైగా జనసేనకు అండగా ఉంటున్న బలమైన సామాజికవర్గం మీద దృష్టి సారించడం కూడా ఆలోచించాల్సిన విషయం. ఉత్తరాంధ్రాలో రానున్న రోజుల్లో మరింతమంది మాజీ మంత్రులు బీఆర్ఎస్ వైపు చూస్తారని తెలుస్తోంది. అలాగే కోస్తా గోదావరి జిల్లాల నుంచి కూడా అనేకమంది నాయకుల చేరిక ముందు ముందు ఉండొచ్చు అంటున్నారు.