కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉందని అంటున్నాడు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ! సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజావ్యతిరేకతను తను గమనించినట్టుగా చెప్పుకొచ్చారు. ఈ వ్యతిరేకత అంతా అండర్ కరెంట్ గా ఉందంటూ కూడా రాహుల్ అంటున్నాడు. మరి కాంగ్రెస్ ఎంపీ ఇలా చెప్పక ఇంకెలా చెబుతాడని అనుకోవచ్చు! అయితే రాహుల్ మాత్రం తను చెప్పాలనుకుంటున్నది చెబుతున్నాడు.
కేంద్రంపై తీవ్ర ప్రజావ్యతిరేకత ఉందని, అయితే అది ప్రజల్లో పెల్లుబుక లోలోపల ఉందని రాహుల్ విశ్లేషిస్తున్నారు. మరి ఈ వ్యతిరేకతను సొమ్ము చేసుకుని తమ పార్టీ అధికారం సాధిస్తుందని కూడా రాహుల్ చెప్పడం లేదు. ఈ వ్యతిరేకతను ఏకం చేసి కేంద్రంలోని బీజేపీ సర్కారును దించేందుకు ప్రతిపక్షాలన్నీ బాధ్యతగా తీసుకోవాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
ప్రతిపక్షాలన్నీ కలిసి ఏకంగా పని చేస్తే, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ప్రస్తుతం ఉన్న వ్యతిరేకతతోనే బీజేపీని ఓడించడం సాధ్యమవుతుందని రాహుల్ అంటున్నారు. బీజేపీని గద్దె దించాలనే వాణిని తను విన్నానని సుదీర్ఘ పాదయాత్రను చేసిన రాహుల్ అంటున్నారు.
మొత్తానికి బీజేపీని ఓడించడానికి కేవలం కాంగ్రెస్ శక్తో, తన పాదయాత్రో సరిపోదని రాహుల్ గాంధీ గ్రహించారు. ప్రతిపక్షాలన్నీ కలిసి వస్తేనే బీజేపీని ఓడించడం సాధ్యమని రాహుల్ అర్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారాయన. మరి పాదయాత్రకు అయితే రాహుల్ కు ఫిట్ నెస్ ఉంది, కాబట్టి ఎంచక్కా సాగిపోతున్నాడు. మరి ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసే నాయకత్వ స్థాయిని రాహుల్ సంపాదించుకున్నారా? అనేది ఇంకా ప్రశ్నార్థకమే!