చంద్రబాబుకు ప్రకృతి సహకరించడం లేదా అంటే? ఔనని సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. గత రెండుమూడు రోజులుగా చంద్రబాబు సభల్లో చోటు చేసుకుంటున్న విషాద ఘటనలు ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పుంజుకోవడం ఎలా వుందంటే… ఒక అడుగు ముందుకు, మూడు అడుగులు వెనక్కి అనే నానుడిని గుర్తు చేస్తోంది. నెల్లూరు జిల్లా కందుకూరు విషాదాన్ని మరిచిపోకనే, గుంటూరులో మరో దుర్ఘటన. మొన్న 8 మంది, ఇవాళ ఇప్పటి వరకూ ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
కందుకూరు విషాదం నుంచి టీడీపీ ఎలాంటి గుణపాఠం నేర్వలేదని తాజా దుర్ఘటన చెబుతోంది. చంద్రబాబు సభ అంటే… ప్రాణాలు పోగొట్టుకోడానికే భయాందోళనను కలిగిస్తోంది. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగంలో గుంటూరులో చంద్రన్న కానుకల పేరుతో మహిళలకు వస్త్రాల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథి. కొత్త ఏడాది తొలి రోజు మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లారు. చంద్రబాబు సభలో మాట్లాడి వెళ్లిపోయారు.
అయితే వస్త్రాల పంపిణీ సమయానికి చీకటి పడింది. మరోవైపు కొందరికి మాత్రమే పంపిణీ చేసి, మిగిలిన వారికి టోకెన్లు ఇచ్చినట్టు చెబుతున్నారు. మరుసటి రోజు రావాలని నిర్వాహకులు మహిళలకు చెప్పినట్టు తెలుస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి రావడం, చీకటి పడడం, ఇంటికెళ్లాలనే ఆత్రుత, మళ్లీ రేపు వస్తే పంపిణీ చేస్తారో లేదో తదితర అనేక అనుమానాల మధ్య మహిళలు ఒక్కసారిగా బ్యారికేడ్లను తోసుకుని ముందుకు తోసుకెళ్లారు. దీంతో ముందు వైపు ఉన్న మహిళలపై వెనుక నుంచి భారీ సంఖ్యలో మహిళలు పడ్డారు. ఈ తొక్కిసలాటలో అక్కడికక్కడే ఒకరు, ఆస్పత్రిలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. మరికొందరు మహిళలు తీవ్ర గాయాలపాలయ్యారు.
రెండు రోజుల క్రితం తన సభలో 8 మంది మృతి చెందడాన్ని చంద్రబాబుకు గుర్తు లేనట్టుంది. సహజంగా ఉచితంగా చంద్రన్న సంక్రాంతి కానుకలు పంపిణీ చేస్తున్నారంటే… ఎక్కడెక్కడి నుంచో మహిళలు పెద్ద సంఖ్యలో గుంటూరుకు చేరుకున్నారు. మహిళల పేదరికాన్ని, వారి ఆశల్ని రాజకీయంగా సొమ్ము చేసుకునే క్రమంలో గుంటూరుకు పెద్ద ఎత్తున తరలివచ్చేలా టీడీపీ నేతలు ప్రచారం చేశారు. కేవలం చంద్రబాబు సభ విజయవంతంపై తప్ప, వారి ప్రాణాలు, యోగక్షేమాలపై చంద్రబాబు మొదలుకుని, టీడీపీ నేతలు దృష్టి సారించలేదనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఇంక ఎంత మంది ప్రాణాలు బలిగొంటే నేతలకు ఆత్మ సంతృప్తి కలుగుతుందో అనే విమర్శ వెల్లువెత్తుతోంది.
చంద్రబాబు సభల్లో వరుస దుర్ఘటనలు చోటు చేసుకోవడం, ప్రాణాలు పోతుండడంతో ఇదేం ఖర్మ చంద్రబాబూ అని తిట్టుకుంటున్న పరిస్థితి. ఇంతకాలం చంద్రబాబు పాలనలో వర్షాలు పడవనే సెంటిమెంట్ బలంగా వుంది. బాబు పాలనలో కరవులు తప్ప, రైతులకు పంటలు పండవనే బలమైన అభిప్రాయం వుంది. ఇప్పుడు బాబు సభలంటే మనుషుల ప్రాణాల్ని బలి ఇవ్వాల్సిందే అన్న అభిప్రాయం బలపడుతోంది.
బాబు పాదం మోపితే, అక్కడ ప్రాణాలు పోవాల్సిందేనా? అనే ఆవేదన, ఆక్రోశం జనం నుంచి వస్తోంది. ఏపీకి బాబు శాపంగా మారారనే ప్రత్యర్థుల విమర్శలపై జనం ఆలోచించే పరిస్థితి ఏర్పడడం గమనార్హం. చంద్రబాబు ఏమైనా ఏపీకి శాపమా? అనే అనుమానాలు ….ఆయన సభల్లో దుర్ఘటనలు కలిగిస్తున్నాయి.