కోత‌లు కోయ‌డంలో బాబును మించిపోతున్న లోకేశ్‌!

మాట‌లు చెప్ప‌డంలో చంద్ర‌బాబుకు సాటి వ‌చ్చే నాయ‌కులు ద‌రిదాపుల్లో లేర‌ని ఇంత కాలం అంద‌రూ అనుకున్నారు. కానీ కోత‌లు కోయ‌డంలో తండ్రికి మించిన త‌న‌యుడు అని లోకేశ్ నిరూపించుకుంటున్నారు. పాద‌యాత్ర‌లో భాగంగా లోకేశ్ ప్ర‌సంగాల్ని…

మాట‌లు చెప్ప‌డంలో చంద్ర‌బాబుకు సాటి వ‌చ్చే నాయ‌కులు ద‌రిదాపుల్లో లేర‌ని ఇంత కాలం అంద‌రూ అనుకున్నారు. కానీ కోత‌లు కోయ‌డంలో తండ్రికి మించిన త‌న‌యుడు అని లోకేశ్ నిరూపించుకుంటున్నారు. పాద‌యాత్ర‌లో భాగంగా లోకేశ్ ప్ర‌సంగాల్ని వింటుంటే …ఔరా, రాజ‌కీయాల్లోకి కొత్త‌గా వ‌చ్చారేమో, అందుకే హామీల వ‌ర్షం కురిపిస్తున్నాడ‌నే భావ‌న క‌ల‌గ‌కుండా వుండ‌దు.

తాజాగా ఆయ‌న పాదయాత్ర చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గంలో సాగుతోంది. అక్క‌డ ఆయ‌న మాట్లాడుతూ అధికారంలోకి వ‌స్తే  రైతుల‌పై కేసుల‌న్నీ మాఫీ చేస్తామ‌ని హామీ ఇచ్చారు. దీన్ని ప‌చ్చ మీడియా బ్యాన‌ర్ చేయ‌డం విశేషం. లోకేశ్ హామీపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఏకిపారేస్తున్నారు.

2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో త‌మ‌కు అధికారం ఇస్తే రైతుల రుణాల‌న్నీ మాఫీ చేస్తామ‌ని, బ్యాంకుల్లో కుదువ పెట్టిన బంగారాన్ని ఇంటికి తీసుకొస్తామ‌ని చంద్ర‌బాబు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ, లోకేశ్‌కు నెటిజ‌న్లు చీవాట్లు పెట్టారు. హామీకి క‌ట్టుబ‌డి రుణ‌మాఫీ చేస్తార‌ని అధికారాన్ని ఇస్తే, ఆ ప‌ని చేయ‌లేద‌ని, ఇప్పుడు కేసుల‌న్నీ మాఫీ చేస్తామ‌ని క‌బుర్లు చెప్ప‌డం ఏంట‌ని నిల‌దీస్తున్నారు.

అధికారంలో ఉన్న‌ప్పుడు ఏమీ చేయ‌కుండా, ఇప్పుడు మ‌ళ్లీ గెలిపిస్తే బీసీ అట్రాసిటీ చ‌ట్టం, అలాగే సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తాం, చంద‌మామను తీసుకొచ్చి అర‌చేతిలో పెడ్తాం, ప్ర‌త్యేక హోదా తీసుకొస్తాం త‌దిత‌ర హామీలు ఇవ్వ‌డం లోకేశ్‌కు చెల్లింద‌ని దెప్పి పొడుస్తున్నారు. చంద్ర‌బాబు 14 ఏళ్లు సీఎంగా అధికారం చెలాయించి ఏం చేశార‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. లోకేశ్ హామీల‌ను చూస్తుంటే, అస‌లు టీడీపీ ఇప్పుడే కొత్త‌గా పుట్టుకొచ్చిందా? అనే అనుమానం క‌లుగుతోంద‌ని నెటిజ‌న్లు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. 

చంద్ర‌బాబు నుంచి క‌ళ్లార్ప‌కుండా అబ‌ద్ధాలు చెప్ప‌డంలో లోకేశ్ బాగా ట్రైన్ అయ్యార‌ని ఆయ‌న మాట‌లు వింటుంటే అర్థ‌మ‌వుతోంద‌ని వ్యంగ్య కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.