కుల నాయ‌కుల‌తో పురందేశ్వ‌రి మేడమ్ హ‌ల్‌చ‌ల్‌!

ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి వ్య‌వ‌హార‌శైలిపై సొంత పార్టీ నాయ‌కులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. త‌న తండ్రి రూ.100 స్మార‌క నాణెం ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి పురందేశ్వ‌రి ఏపీ నుంచి కేవ‌లం త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల్ని…

ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి వ్య‌వ‌హార‌శైలిపై సొంత పార్టీ నాయ‌కులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. త‌న తండ్రి రూ.100 స్మార‌క నాణెం ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి పురందేశ్వ‌రి ఏపీ నుంచి కేవ‌లం త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల్ని మాత్ర‌మే వెంట తీసుకెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. బీజేపీ త‌ర‌పున ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వారిలో సీఎం ర‌మేశ్‌నాయుడు, మాజీ ఎంపీ సుజ‌నాచౌద‌రి, స‌త్య‌కుమార్‌, పాతూరి నాగ‌భూష‌ణం, లంకా దిన‌క‌ర్ త‌దిత‌ర చోటామోటా నాయ‌కులున్నారు.

పురందేశ్వ‌రి వెంట వెళ్లిన బీజేపీ నేత‌లంతా కేవ‌లం ఒక సామాజిక వ‌ర్గానికి చెందిన వారే వుండ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ర‌మేశ్‌నాయుడి అస‌లు సామాజిక వ‌ర్గం కంటే ఆయ‌న క‌మ్మ నాయ‌కుడిగానే చెలామ‌ణి అవుతున్న సంగ‌తి తెలిసిందే. స‌త్య‌కుమార్ ఢిల్లీలోనే వుంటారు. కావున ఆయ‌న ఆంధ్రా నుంచి వెళ్లినట్టు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోరు.

పురందేశ్వ‌రి బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత పార్టీని కేవ‌లం త‌న సామాజిక వ‌ర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. టీడీపీ అనుకూల నాయ‌కుల‌కు ఆమె ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏపీ బీజేపీలో టీడీపీ అనుకూల నేత‌లెవ‌రో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఎన్టీఆర్ సేవ‌ల్ని గుర్తించి ఆయ‌న పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం రూ.100 నాణేన్ని తీసుకొస్తే, దాన్ని రాజ‌కీయంగా బీజేపీకి అనుకూలంగా మ‌లుచుకోవాల్సి వుంది. అయితే ఆ ప‌ని చేయ‌డానికి పురందేశ్వ‌రికి మ‌న‌సు రాద‌నే విమ‌ర్శ లేక‌పోలేదు. ఎందుకంటే టీడీపీ దెబ్బ‌తింటుంద‌ని ఆమె భ‌యం. అందుకే ఎన్టీఆర్ స్మార‌క నాణెం ఆవిష్క‌ర‌ణ‌కు కేవ‌లం ఒక కుల, కుటుంబ కార్య‌క్ర‌మంగా నిర్వ‌హించార‌నే అభిప్రాయం ఏపీ బీజేపీలో వుంది. త‌ద్వారా ఎన్టీఆర్‌ను క‌మ్మ నాయ‌కుడిగా మాత్ర‌మే జ‌నం చూసే ప‌రిస్థితిని పురందేశ్వ‌రి, ఇత‌ర కుటుంబ స‌భ్యులు వ్య‌వ‌హ‌రించార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ఏపీ బీజేపీలో సీనియ‌ర్ నాయకులెవ‌రినీ పురందేశ్వ‌రి వెంట తీసుకెళ్ల‌క‌పోవ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. పురందేశ్వ‌రి త‌న వెంట టీడీపీ వ‌ల‌స నేత‌ల‌ను మాత్ర‌మే తీసుకెళ్ల‌డంపై బీజేపీ సీనియ‌ర్ నేత‌లు జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్నారు. సొంత సామాజిక వ‌ర్గ నేత‌లతో ఢిల్లీలో పురందేశ్వ‌రి మేడ‌మ్ హ‌ల్‌చ‌ల్ చేయ‌డంపై సొంత పార్టీ నేత‌లు ముక్కున వేలేసుకున్నారు.