భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు కొన్నాళ్లుగా వారసత్వ రాజకీయాలను తెగద్వేషించేస్తూ ఉన్నారు. ప్రాంతీయ పార్టీలు వారసత్వమయమని, ప్రాంతీయ పార్టీలతో అవినీతి అని కొత్త వాదనలు అందుకున్నారు. వారసత్వ రాజకీయాలు పోవాలని నినదిస్తున్నారు. అయితే బీజేపీలో బోలెడంతమంది వారసులు ముందుకు వస్తున్నారు. అమిత్ షా తనయుడు జై షా ఏ అర్హతతో బీసీసీఐలో పూర్తిగా చక్రం తిప్పుతున్నారంటే మాత్రం సమాధానాలు సూటిగా ఉండవు. అలాగే కాంగ్రెస్ లో వారసత్వ రాజకీయంతో వచ్చిన వారిని బీజేపీ పిలిచి మరీ చేర్చుకుంటోంది. సింధియా లాంటి వాళ్లను బీజేపీ వాళ్లు ప్రస్తావించరు. వారివి వారసత్వాలు కావంతే!
ఆ సంగతలా ఉంటే.. ఒక వారసత్వ పార్టీ, ప్రాంతీయ పార్టీ, అది కూడా అవినీతి ఆరోపణలను బోలెడన్ని కలిగి ఉన్న, మొన్నటి వరకూ కాంగ్రెస్ తో అంటకాగిన పార్టీ… అయిన జేడీఎస్ తో ఇప్పుడు కమలం పార్టీ రాసుకుపూసుకోవడానికి రెడీ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి.
కర్ణాటకలో పరిణామాలు భారతీయ జనతా పార్టీకి పెద్దగా అనుకూలంగా లేవు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బీజేపీ పూర్తి మెజారిటీ తెచ్చుకోవడం అసాధ్యమనే వాదనలున్నాయి.గత ఎన్నికల్లో కూడా బీజేపీకి మినిమం మెజారిటీ రాలేదు. హంగ్ తరహా పరిస్థితుల్లో జేడీఎస్- కాంగ్రెస్ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఆ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రులను మార్చుతూ, ఢిల్లీ నుంచి మొత్తం ఆడిస్తూ అక్కడి ప్రభుత్వాన్ని బీజేపీ మనుగడలో ఉంచుతోంది. ఇక బొమ్మై నాయకత్వంలో ఎన్నికలకు వెళితే ఎదురుదెబ్బ తప్పదని బీజేపీ వాళ్లే బాహాటంగా చెబుతున్నారు.
ఇలాంటి నేపథ్యంలో.. జేడీఎస్ కు బీజేపీ కన్ను గీటుతోందనే సంకేతాలు వస్తున్నాయి. కర్ణాటకలో ఒక కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కాగా.. దానికి దేవేగౌడ, ఆయన తనయుడు రేవణ్ణలకు ప్రత్యేక అతిథి మర్యాదలు దక్కాయి. అలాగే వక్కలిగ స్వామీజీలకు కూడా అగ్రతాంబూలాలు ఇచ్చారు. ఉన్నట్టుండి ఇలాంటి రాజకీయ పరిణామాలు జరగడం వెనుక బీజేపీ వ్యూహాలున్నాయనే మాట వినిపిస్తోంది.
వీలైతే ఎన్నికలకు ముందే జేడీఎస్ తో బీజేపీ పొత్తు కుదుర్చుకోవచ్చని లేకపోతే ఎన్నికల తర్వాత జేడీఎస్ మద్దతు తీసుకునే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జేడీఎస్ కు కావాల్సింది అధికారంలో వాటా. దీని కోసం కాంగ్రెస్ తో అయినా, బీజేపీతో అయినా జతకట్టేందుకు ఆ పార్టీ ఎప్పుడూ రెడీ గా ఉంటుంది. అధికారం తప్ప అంతకు మించి సిద్ధాంతాలు, రాద్ధాంతాలను ఈ పార్టీ పట్టించుకోదు. పదవులు వస్తే చాలు.
అయితే ఆ పార్టీ కూడా ఇప్పటికే చాలా దెబ్బతింది. పాత మైసూరు రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభావం చాలా వరకూ తగ్గింది. ఆ పార్టీకి ఇప్పుడున్న సీట్లు కూడా గౌడల జనాభా గణనీయంగా ఉన్న చోట వచ్చినవే. మొత్తం సీట్లలో 99 శాతం కొన్ని జిల్లాల పరిధి నుంచినే వచ్చాయి. మరో వక్కలిగ నేత, కాంగ్రెస్ ముఖ్య నేత డీకే శివకుమార జేడీఎస్ కు చాలా వరకూ చెక్ పెట్టాడు. గత లోక్ సభ ఎన్నికల్లో కుమారస్వామి తనయుడు నిఖిల్ మండ్యా నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. ఇలా దేవేగౌడ ఫ్యామిలీ రాజకీయంగా పరువు పోగొట్టుకుంది. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ అవసరం జేడీఎస్ కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నట్టుంది.