దేశం నుంచి ఎగుమతి అయ్యే హార్డ్ వేర్ ప్రోడక్ట్స్ విలువను లక్ష కోట్ల రూపాయల వరకూ పెంచడమే లక్ష్యమని అంటోంది కేంద్ర ప్రభుత్వం. అది కూడా 2023లో సాధించడమే సంకల్పంగా ప్రకటించుకుంది కేంద్రం. ప్రస్తుతం దేశం నుంచి ఎగుమతి అవుతున్న స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, ఇతర డివైజ్ ల మొత్తం విలువ సుమారు 45 వేల కోట్ల రూపాయలుగా ఉంది. ఈ సంవత్సరంలో ఈ స్థాయిని రెట్టింపు చేసి లక్ష కోట్ల రూపాయల విలువ వరకూ తీసుకెళ్లడమే తమ టార్గెట్ అని కేంద్రం అంటోంది.
మరి ఈ టార్గెట్ ను అచీవ్ చేస్తే అది మంచిదే. కరోనా అనంతరం ఎలక్ట్రానిక్ డివైజ్ ల మ్యానుఫ్యాక్చరింగ్ లో అనేక పరిణామాలు ఎదురవుతున్నాయని పేరున్న కంపెనీలు ప్రకటించుకున్నాయి. ప్రత్యేకించి చైనా వ్యవహారంతో .. అక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు తరలిపోనున్నాయనే విశ్లేషణ దాదాపు రెండేళ్ల నుంచి వినిపిస్తోంది. చైనా వదిలితే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్లకు ఇండియా మంచిదవుతుందనే విశ్లేషణలూ ఉన్నాయి ఆ రంగం నుంచి. అయితే ఆ ప్రభావం ఏమిటో ఇంకా పూర్తిగా అర్థమయ్యే పరిస్థితి లేదు. ఇలాంటి నేపథ్యంలో ఈ సంవత్సరంలో ఇండియాలో ఉత్పత్తి అయ్యే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర స్మార్ట్ డివైజ్ ల మొత్తం పరిమాణం లక్ష కోట్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్రం ప్రకటించింది.
ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న 45 వేల కోట్ల రూపాయల స్థాయి హార్డ్ వేర్ ఉత్పత్తుల్లో మెజారిటీ వాటా యాపిల్, సామ్ సంగ్ లదే ఉంది. దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను పెట్టి ఆ విదేశీ సంస్థలు ఇందులో ప్రధాన వాటాను కలిగి ఉన్నాయి. ఈ స్థాయి రెట్టింపు కావాలన్నా..ఆ సంస్థలే ఇండియాలో మరిన్ని యూనిట్లను పెట్టాల్సి ఉంటుంది.
ఇక దేశీయ సంస్థ బోట్ కూడా తన వేరబుల్ డివైజ్ లతో అంతర్జాతీయంగా దూసుకుపోతోంది. ఇలాంటి సంస్థలు మరింత ప్రగతి సాధించినా కేంద్రం లక్ష్యం కొంత వరకూ నెరవేరుతుంది.