సీఎం రమేష్: కోవర్టు మాత్రమే కాదు.. స్లీపర్ సెల్ కూడా!

చంద్రబాబునాయుడు సొంతంగా ఎన్నికల్లో నెగ్గగలిగే లాగా ప్రజల అభిమానాన్ని, నమ్మకాన్ని తన జీవితంలో ఒక్కసారైనా చూరగొనగలరో లేదో గానీ.. రాజకీయంగా పైచేయి సాధిస్తూ ఉండడానికి ఆయన బుర్రలో పుట్టెడు వక్రబుద్ధులు మాత్రం తప్పకుండా ఉంటాయి. …

చంద్రబాబునాయుడు సొంతంగా ఎన్నికల్లో నెగ్గగలిగే లాగా ప్రజల అభిమానాన్ని, నమ్మకాన్ని తన జీవితంలో ఒక్కసారైనా చూరగొనగలరో లేదో గానీ.. రాజకీయంగా పైచేయి సాధిస్తూ ఉండడానికి ఆయన బుర్రలో పుట్టెడు వక్రబుద్ధులు మాత్రం తప్పకుండా ఉంటాయి. 

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన తర్వాత.. ఏనాడూ ఆ పార్టీని ఒంటరిగా అధికారంలోకి తీసుకురాగల సత్తా లేని చంద్రబాబునాయుడు.. ప్రతిదశలోనే అనేకానేక కుట్రవ్యూహాలను అమల్లో పెడుతూ ఉంటారు. వాటిలో ఏదో ఒకటి ఫలిస్తుంటుంది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దెబ్బకు తెలుగుదేశం కుదేలైపోయిన తర్వాత.. ఆయన వ్యూహాల్లో భాగంగానే.. ఆయన ఏజంట్లుగా, కోవర్టులుగా సుజనాచౌదరి, సీఎం రమేష్ వంటి నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. 

సీఎం రమేష్ మాత్రం తాను ఎక్కడున్నా సరే.. చంద్రబాబునాయుడు కోవర్టుగా మాత్రమే, తెలుగుదేశానికి మాత్రమే సేవలందిస్తుంటానని తాజాగా మరోసారి నిరూపించారు. రాష్ట్రపతి భవన్ లో ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమం సందర్భంగా ఈ విషయం బట్టబయలైంది.

ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో కార్యక్రమానికి వెళ్లిన వారంతా ముందుగా మాట్లాడుకుంటూ ఉన్న ఫోటోలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. వాటిలో దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు, వారితోపాటు చంద్రబాబునాయుడు ఒక సోఫాలో కూర్చోగా, చంద్రబాబు పక్కనే ఉన్న సోఫాలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, ఆయనకు ఎదురుగా ఉన్న సోఫాలో సీఎం రమేష్ మొబైల్ ఫోను చూసుకుంటూ కూర్చున్నారు. పక్కపక్కనే ఉన్న చంద్రబాబునాయుడు- జెపినడ్డా చాలా సీరియస్ గా మాట్లాడుకుంటూ ఉన్నట్టుగా ఉంది. ఇది మీడియాలోకి రాగానే.. బిజెపికి తెలుగుదేశానికి మధ్య సఖ్యత కుదిరిందని పచ్చదళాలు ప్రచారం మొదలెట్టేశాయి.

ఇండైరక్టుగా ఇలాంటి అర్థం వచ్చేలాగానే సీఎం రమేష్ కూడా మాట్లాడుతున్నారు. ఒక టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో, ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తనకు తెలియదని అన్న సీఎం రమేష్.. ఏమైనా సరే రాజకీయాలే మాట్లాడుకుని ఉంటారని ఒక హింట్ ఇచ్చారు. మీరు అక్కడే ఉన్నారు కదా.. ఏం మాట్లాడుకున్నారు.. వినపడలేదా.. అంటే తనకు తెలియదని సెలవిచ్చారు. 

అదే సమయంలో అసలు రాష్ట్రపతి భవన్ లోకి ఎవ్వరికీ ఫోన్లు అనుమతించరని, తన ఒక్కడి వద్ద మాత్రమే ఫోను ఉన్నదని, తన ఫోనులోనే ఆ భేటీని ఫోటో తీశారని కూడా ఆయన వెల్లడించారు. అంటే.. ప్రత్యేకించి.. ప్రజల్లోకి తెదేపా-బిజెపి మైత్రీబంధం గురించిన పుకార్లను వ్యాపింపజేయడానికే ఉద్దేశపూర్వకంగా ఈ ఫోటో తీశారని అర్థమవుతూనే ఉంది. ఒక పెద్దాయన ‘లీక్ దిస్ ఫోటో టూ దీ మీడియా’ అని తనకు చెప్పినందువల్లనే.. తానే తన ఫోనులోంచి ఆ ఫోటోను మీడియా మిత్రులందరికీ పంపానని కూడా సీఎం రమేష్ అంటున్నారు. ఆ పెద్దాయన ఎవరనేది మాత్రం చెప్పడం లేదు.

‘లీక్ దిస్ ఫోటో’ అనే పదం వాడడం అంటేనే దాని ద్వారా ఒక వక్రప్రయోజనాన్ని వారు కోరుకుంటున్నారనే సంగతి అర్థమవుతుంది. సాధారణంగా అయితే.. మీడియాలో కేవలం ప్రచారాన్ని మాత్రమే కోరుకుంటే.. ‘సెండ్ దిస్ ఫోటో’ అనే పదాలు వాడాలి. కానీ.. ‘లీక్’ చేయడం ద్వారా.. సదరు ‘పెద్దాయన’ ఆశించే వక్రప్రయోజనం ఈ ప్రచారమే అన్నమాట.

ఆ పెద్దాయన చంద్రబాబునాయుడేనా అని అడిగిన ప్రశ్నకు సీఎం రమేష్ తడబడ్డారు. ‘ఎవరనేది చెప్పను. కానీ.. ఆయన మాత్రం కాదు’ అని సెలవిచ్చారు. అలాగే, తెలుగుదేశమా, బిజెపినా అనే ప్రశ్నకు కూడా జవాబివ్వలేదు. ఎవరైనా సరే.. తెలుగుదేశం పెద్దలే అయి ఉంటారని చర్చలో అడిగినప్పుడు.. చిరునవ్వులతో ఊరుకున్నారు.

ఈ వ్యవహారం మొత్తం గమనిస్తే.. భారతీయ జనతా పార్టీలోకి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన కోవర్టులు ఎంత విశ్వసనీయంగా.. గుట్టుచప్పుడు కాకుండా.. ఆయన ఆశించే వక్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనే సంగతి అర్థమవుతుంది. వీళ్లు కేవలం కోవర్టులు మాత్రమే కాదని, స్లీపర్ సెల్స్ లాగా.. బిజెపి పార్టీనే నాశనం చేయగల సమర్థులని ప్రజలు అనుకుంటున్నారు. మరి ఇలాంటి కుట్రలను కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న ఉద్ధండులున్న బిజెపి ఎప్పటికి గుర్తిస్తుందో మరి.