తెలంగాణ హస్తం కోసం త్వరలోనే ఒక పత్రిక, ఛానెల్!

అసెంబ్లీ ఎన్నికలు మరొక మూడు నెలల్లో ముంచుకొస్తుండగా ఇప్పుడు కొత్తగా పత్రికను, ఛానెల్ ను స్థాపించి సాధించబోయేది ఎంత ఉంటుందనే అనుమానం అవసరం లేదు. తెలంగాణలో ఆల్రెడీ ఒక స్థాయి పాపులారిటీతో ఉన్న దినపత్రిక,…

అసెంబ్లీ ఎన్నికలు మరొక మూడు నెలల్లో ముంచుకొస్తుండగా ఇప్పుడు కొత్తగా పత్రికను, ఛానెల్ ను స్థాపించి సాధించబోయేది ఎంత ఉంటుందనే అనుమానం అవసరం లేదు. తెలంగాణలో ఆల్రెడీ ఒక స్థాయి పాపులారిటీతో ఉన్న దినపత్రిక, టీవీ ఛానెల్ కొత్తగా తమ విధానం మార్చుకుని హస్తం గూటికి చేరనున్నాయి. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అనుకూల ప్రచారంలో తరిస్తున్న ఆ పత్రిక, చానెల్.. కాంగ్రెస్ గూటి చిలకలుగా మారడానికి మూల కారణం.. ఆ పత్రిక యజమాని కూడా పార్టీ మారబోతుండడమే.

తెలంగాణలో ఇతర పార్టీల నుంచి నాయకులను ఫిరాయింపజేసి తమతో కలుపుకోవడం ద్వారా.. భారత రాష్ట్ర సమితికి, కేసిఆర్ పరిపాలనకు ప్రత్యామ్నాయం తాము మాత్రమే అనే భావనను కాంగ్రెస్ మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళగలుగుతోంది. 

కేసిఆర్ ను ఓడిస్తామని ఈ ఎన్నికల్లోనే అధికారంలోకి వచ్చి తీరుతామని అంటున్న బిజెపి ప్రగల్భాలు ఏ మేరకు వర్క్ అవుట్ అవుతాయో సందేహంగానే ఉంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి.. ఇప్పుడు తిరిగి తన సొంత గూటికి, అనగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లబోతున్నారు. ఆయన పార్టీ మారితే గనుక ఆటోమేటిగ్గా ఆయన యాజమాన్యంలో నడుస్తున్న వెలుగు దినపత్రిక, వి6 టీవీ ఛానల్ కూడా కాంగ్రెస్ అనుకూల ప్రచారానికి మారుతాయి అనుకోవచ్చు.

కాంగ్రెస్ పార్టీలో ఎంతో సీనియర్ నాయకుడు అయిన వివేక్ వెంకటస్వామి 2014 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ను వీడి అప్పటి తెరాసలో చేరారు. కేసిఆర్ ప్రకటించిన దళిత సీఎం లాంటి హామీలు అప్పట్లో వివేక్ ను గులాబీ పార్టీ వైపు నడిపించాయి. తీరా విభజన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఆయన తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు కృతజ్ఞతగా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. తర్వాతి పరిణామాలలో అక్కడ కూడా ఇమడలేక భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. ఇప్పటిదాకా ఆ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు. అయితే తాజాగా ఇప్పుడు తిరిగి తన సొంత గూడు అయిన కాంగ్రెస్ లోకి రాబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.

వివిధ పార్టీల నుంచి సీనియర్ నాయకులను తమతో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ గ్రాఫ్ క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నట్లుగా వారు ప్రజల్లోకి సంకేతాలు పంపుతున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇటీవల మాజీ ఎంపీ వివేక్ తో భేటీ అయినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. బుధవారం నాడు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లుగా తెలుస్తోంది.

ఈ పరిణామాన్ని తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బగా పరిగణించాల్సిందే. భారాసను ఓడించగల సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని నాయకులందరూ నమ్ముతున్నట్లుగా ప్రజల్లోకి సంకేతాలు పంపడం కూడా సాధ్యమవుతుంది. 

వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే పదవిని ఆశించి ఇతర సీనియర్ నాయకులను చికాకు పెట్టకుండా ఉన్నట్లయితే, గతంలో మాదిరిగా ఎంపీగా పోటీ చేయడానికి మాత్రమే ఉత్సాహం చూపినట్లయితే కాంగ్రెసులో మళ్ళీ మొదలుకానున్న ఆయన ప్రస్థానం.. అంతా సజావుగా సాగుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.