వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి.. తెలంగాణలో కేసీఆర్ సాగిస్తున్న ప్రజావ్యతిరేక పాలనను అంతం చేస్తానంటూ.. చాలా భీషణమైన ప్రతిజ్ఞతో వైఎస్ షర్మిల తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. చాలా విస్తారంగా ప్రజల్లో తిరుగుతూ, కేసీఆర్ కుటుంబ పాలనను నిందిస్తూ సంచలనాలు నమోదు చేశారు. అయితే తెలంగాణలో ఎన్నికలు ముంచుకు వచ్చేసిన ప్రస్తుత సమయంలో ఆమె పేరు కూడా ఎక్కడా వార్తల్లో కనిపించడం లేదు. ఆమె ఊసు వినిపించడం లేదు.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత.. షర్మిల తన వైతెపా పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తారనే ప్రతిపాదన బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆమె రెండు మూడు దఫాలు బెంగుళూరు వెళ్లి డిప్యూటీసీఎం శివకుమార్ ను కలవడం, రాహుల్ తో భేటీకోసం ఢిల్లీ వెళ్లి రావడం వంటి పరిణామాలు జరిగాయి. డీల్ ఏమిటనేది తేలలేదు తప్ప.. ఆమె కాంగ్రెసులో విలీనం కావడం తథ్యం అని ప్రజలందరికీ అర్థమైపోయింది.
అయితే, వైతెపా ప్రారంభించిన నాటినుంచి ఆమె ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీచేస్తానని అంటూ వచ్చారు. అయితే షర్మిల కాంగ్రెసు పార్టీలోకి రావడం తమకు సంతోషమే గానీ.. ఏపీకి చెందిన ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఉండడం అవసరం లేదని మెజారిటీ నాయకులు అభిప్రాయపడ్డారు.
ఏపీ రాజకీయాల్లో పనిచేసేట్లయితే ఆమెకు పగ్గాలు అప్పగిస్తాం అని కూడా కాంగ్రెస్ బేరం పెట్టినట్టుగా వార్తలు వచ్చాయి. ఆమె మాత్రం తెలంగాణ రాజకీయాల్లోనే తనకు స్థానం కావాలని పట్టుదలగా కూర్చున్నారు. ఈ ప్రతిష్ఠంభన ఒక కొలిక్కి రాలేదు. మాణిక్ రావు ఠాక్రే వంటి పార్టీ ఇన్చార్జిలను అడిగినప్పుడు వారు, షర్మిల విలీనం వ్యవహారం హైకమాండ్ చూసుకుంటోంది.. మా పరిధిలో లేదు అని సులువుగా తప్పించుకుంటున్నారు.
అయితే ప్రస్తుత పరిణామాలను గమనిస్తున్నప్పుడు.. ఆమె పరిస్థితి త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టేనా? అని ప్రజలు అనుకుంటున్నారు. పాలేరు స్థానం నుంచి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీచేసి తీరుతానని ఆల్రెడీ ప్రకటించిన తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెసులో చేర్చుకోవడానికి, ఈ పార్టీ నాయకులే వెళ్లి మంతనాలు సాగిస్తున్నారు. అదే జరిగితే.. షర్మిల కోరుకుంటున్న స్థానం ఆమెకు దూరమైనట్టే.
ఇన్నాళ్లూ అక్కడ పోటీచేస్తానంటూ ఫోకస్ పెట్టి, ఇప్పుడు మరో సీటు ఇవ్వజూపితే ఆమె అంగీకరించకపోవచ్చు. లేదా, తుమ్మలకు పాలేరు ఇవ్వడం ద్వారా.. షర్మిల పార్టీలోకి వచ్చినా సరే.. ఏపీ వ్యవహారాలే ఎక్కువగా చూసుకోమని, సీటు కూడా అక్కడినుంచి ఇస్తాం అని కాంగ్రెస్ ఆశ పెట్టవచ్చు. ఈ రకంగా ఆమె రాజకీయ భవిష్యత్తు హఠాత్తుగా అస్థిరంగా మారిపోయింది.