విశాఖను అధ్బుతనగరం అంటారు. తనకు ఎంతో ప్రేమ ఉందని కూడా చెబుతారు. ఇక్కడ జనం మంచివారు అని బిస్కెట్లు వేస్తారు. మరి అభివ్రుద్ధి విషయంలో మాత్రం నాలుక మడతేసారు. ఇదీ చంద్రబాబు నైజం.
ఆయన విశాఖ ప్రగతి కంటకుడు అంటూ విజయసాయిరెడ్డి అంటున్నారు. విశాఖలో దాదాపు వందేళ్ల ఆంధ్రా యూనివర్శిటీ ఉంది. దాన్నికి పోటీగా ప్రైవేట్ వర్శిటీకి బాబు అన్ని రకాలుగా అండదండలు అందించారని ఎంపీ ఆరోపించారు.
విశాఖలో భూములు వేలల్లో కబ్జా అయ్యాయంటే అది బాబు హయాంలో కాదా అని కూడా అయన నిగ్గదీస్తున్నారు. ఇక్కడో వింత కూడా ఉంది. అదేంటి అంటే వేలాది ఎకరాలకు సంబంధించిన భూమి పత్రాలు కనిపించలేదుట. ఇలా అడ్డూ అదుపూ లేకుండా జరిగిన భూదోపిడీ నీ జమానాలో కాదా బాబూ అంటూ విజయసాయిరెడ్డి అడుగుతున్నారు.
ఇక విశాఖలో పేరుకు తూతూమంత్రంగా సిట్ ని వేసి చేతులు దులుపుకున్నారని ఆయన మండిపడుతున్నారు, ఇపుడు విశాఖను రాజధానిని చేద్దామని తమ ప్రభుత్వం చూస్తూంటే విషం చిమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు. రాయలసీమ రౌడీలు అంటున్నావు, నీవు ఈ సీమ నుంచి వచ్చావు బాబూ అంటూ విజయసాయిరెడ్డి డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు.
విశాఖ గిరిసీమల్లో పచ్చని బాక్సైట్ బాకును గుచ్చి అక్కడ తవ్వకాలకు అనుమతించింది బాబు హయాంలో కదా అని ఆయన నిలదీస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గతంలో తొమ్మిదేళ్ళు, ఇపుడు అయిదేళ్ళు ముఖ్యమంత్రిగా విశాఖవాసులకు నీవు చేసిన మంచి పనేటో చెప్పగలవా చంద్రబాబూ అంటే తమ్ముళ్లకు ఉలుకు ఉండొచ్చేమో కానీ గట్టిగా జవాబు చెప్పలేకపోతున్నారుగా.
ఏది ఏమైనా విశాఖకు బాబు ఏమీ చేయలేదని ఆధారాలతో సహా రెడ్డి గారు రుజువు చేస్తూంటే కస్సుమనడం తప్ప తమ్ముళ్ళ నుంచి కరెక్ట్ ఆన్సర్ రావడంలేదు మరి.