మన సినిమాలలో ఫైటింగ్‌లు ఒక ముఖ్యభాగం. ఫైటింగ్ సీన్స్ లేకపోతే…సినిమాలు తీసినట్టూ కాదు; చూసినట్టూ కాదు. అమితాబ్ బచ్చన్ అయినా…ఆలీ అయినా హీరో పాత్ర అయితే….కనీసం రెండు, మూడు ఫైటింగ్ సీన్‌లు ఉండాల్సిందే. పది, పదిహేను మంది రౌడీలను చితక్కొట్టాల్సిందే. సినిమా హాల్‌లో ఈలలు మోగాల్సిందే. హీరోల కటౌట్లకు పాలాభిషేకాలు జరగాల్సిందే. హీరోల జన్మదినాలకు …రక్తదానాలు, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంచడాలు -మస్ట్ గా ఉండాల్సిందే. విలేకరులు ఆ వార్తలు రాయాల్సిందే.
అప్పటి ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఇప్పటి పిల్ల హీరోల వరకు….ఇదే వరుస. ఓకే. హీరో అన్నవాడు విలన్లనీ, రౌడీలనూ చితక్కొట్టాల్సిందే. న్యాయాన్నీ, ధర్మాన్నీ నిలబెట్టాల్సిందే. అందులో సెకండ్ ఒపీనియన్‌కు తావు లేదు. ఈ విలన్లనీ; ఒక్కసారిగా చుట్టుముట్టిన రౌడీలను చితక్కొట్టే క్రమంలో మన దర్శకులు అనుసరించే మూస బాణీ యే నాకు అర్ధం కావడం లేదు. అదేంటి అంటే….
హీరో ఒక్కడే ఉంటాడు. రేబాన్ కళ్ళజోడు పెట్టుకొని ఉంటాడు. సడన్‌గా పదిహేను, ఇరవై మంది విలన్ మనుషులు హీరోని కార్నర్ చేస్తారు. కానీ…వాళ్ళందరూ హీరోని ఒకేసారి ఎటాక్ చెయ్యరు. సినిమా టికెట్ల కోసం క్యూ లో నించున్నట్టు….ఒకరి తరువాత ఒకరు హీరో మీదకు వస్తారు.హీరో వాళ్ళందరినీ చిత్తు చిత్తుగా కొడతాడు. ఒక రౌడీ ని ఫిల్మ్ నగర్ లో కొడితే…ఆ రౌడీ గింగరాలు తిరుగుతూ వెళ్లి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర ఏ కారుకో గుద్దుకుని; ఆ కార్లో వాళ్ళు ఆ తాకిడికి వెళ్లి రన్-వే మీద పడిపోతారు.
హీరో ఈ రౌడీని కొట్టిన తరువాత-ఇంకో రౌడీ వస్తాడు. హీరో కొట్టిన దెబ్బకు అతను దొల్లుకుంటూ వెళ్లి… నాంపల్లి రైల్వే స్టేషన్ పైకప్పు రేకుల మీద పడతాడు. ఆ తాకిడికి రేకులు పప్పు..పప్పు అయి; ప్లాట్ఫారం మీదున్న ప్రయాణికులు సామాన్లు వదిలేసి తలో దిక్కుకూ పరుగులు తీస్తారు.
సరే. హీరో బలవంతుడు కాబట్టి; రకరకాల ఫైటింగ్ టెక్నిక్స్ తెలిసినవాడు కాబట్టి- రౌడీలను అలా చితక్కొట్టాడు అనుకుందాం. హీరో ను ఎటాక్ చేయడానికి అంతమంది రౌడీలు కట్టగట్టుకు వచ్చి…హీరో మీదకు ఒకరి తరువాత ఒకరు రావడం ఏమిటి? అందరూ ఒకేసారి హీరో మీద పడాలి కదా; హీరో …విలన్ల తో ఫైట్ చేస్తుంటే…హాల్లో ఉన్న మనకు-రోమాలు నిక్కబొడుచుకోవాలి కదా! మన రోమాల సంగతి దేముడు ఎరుగు… హీరో కళ్ళజోడు కూడా కిందపడదు. అలా ఉంటే గానీ; ఆ హీరో ఫాన్స్ శాటిస్ ఫై అవ్వరేమో! సరే. వదిలేద్దాం.
ఇంకో కామెడీ!
సినిమాల్లో పోలీస్ ఆఫీసర్స్ పాత్రలు సర్వసామాన్యమైపోయాయి. SI అయితే.?రెండు, CI అయితే మూడు స్టార్స్ ఉంటాయి. CI కి అయినా; DSP కి అయినా మూడు స్టార్ లే ఉంటాయి. తేడా అల్లా క్యాప్, విజిల్, బెల్ట్ లో ఉంటాయి. ఇక IPS ఆఫీసర్స్ కి ఎస్పీ కి ఒక స్టార్, సింహం; సీనియర్ ఎస్ పి అయితే,రెండు స్టార్స్, సింహం, DIG ర్యాంక్ కు వస్తే- మూడు స్టార్స్, సింహం, కాలర్ బ్యాడ్జి ఉంటాయి.(ఈ సింహాలు మన జాతీయ చిహ్నం). ఎస్ఐలకు, సీఐ లకు, డిఎస్పీ లకు, ఏసీపీ లకు ఈ కాలర్ బ్యాడ్జి ఉండదు.
ఏ IPS ఆఫీసర్ కూడా ఆన్ డ్యూటీ లో ఉన్నప్పుడు- తనకార్ తానే సింగిల్ గా నడుపుకుంటూ వెళ్లి; విలన్లతో ఫైట్ చెయ్యడు. దేశభక్తి ప్రవచనాలు రౌడీలకు బోధించడు. సాయికుమార్ లాగా గుక్క తిప్పుకోకుండా… అరిచి గీపెట్టడు. పోలీస్ స్టేషన్‌లకు వచ్చి…ఎస్ఐ, సీఐ కుర్చీలలో కూర్చుని రౌడీలను డీల్ చెయ్యడు.
ఒక్క మాటలో చెప్పాలంటే అసలు మాట్లాడడు. కను సైగలతోనే కథ నడిపిస్తాడు, మంచి గానీ-చెడు గానీ! చిరునవ్వుతో వ్యవహారం చక్కబెడతాడు. చేయించాల్సిన కార్యాన్ని డిఎస్పీ తోనో…సీఐలతోనో, ఎస్ఐలతోనో…పెదాలు కదపకుండా చెప్పి చేయిస్తాడు. ఎన్కౌంటర్లు కూడా దగ్గరుండి చేయించడు.
సినిమాలకు పోలీస్ కథలు రాసేవాళ్ళు…ఆ కథలను సినిమాలుగా తీసేవారు కూడా- కొంచెం 'వాడితే'….పోలీసు పాత్రలను సీరియస్ గా చిత్రీకరిస్తూ కూడా హాస్యం పండించవచ్చు. వారి కథకు కావలసిన ఎఫెక్ట్ తీసుకురావచ్చు. హాస్యం కోసం పోలీస్‌ను అపహాస్యంగా చిత్రీకరించాల్సిన పని లేదు.
డైరెక్టర్లూ….కొంచెం వాడండి.
భోగాది వేంకట రాయుడు