ప్రపంచం ఏవేవో చ‌ర్చించుకుంటే, ఇక్క‌డ బికినీల‌పై!

ఒక‌వైపు గ్లోబ‌లైజేష‌న్ అంటాం. గ్లోబ‌లైజేష‌న్ ఫ‌లాల‌న్నింటినీ వాడుకోవాల‌ని చూస్తాం. త‌న వ‌ర‌కూ వ‌స్తే అంతా స‌వ్యంగానే క‌నిపిస్తుంది. విదేశీ, స్వ‌దేశీ వాద‌న‌లు సొంతానికి ఉప‌యోగ‌ప‌డ‌వు. అయితే ఒక‌వైపు గ్లోబ‌లైజేష‌న్ ఫ‌లాల‌ను భుజిస్తూనే.. మ‌ళ్లీ అవ‌త‌లి…

ఒక‌వైపు గ్లోబ‌లైజేష‌న్ అంటాం. గ్లోబ‌లైజేష‌న్ ఫ‌లాల‌న్నింటినీ వాడుకోవాల‌ని చూస్తాం. త‌న వ‌ర‌కూ వ‌స్తే అంతా స‌వ్యంగానే క‌నిపిస్తుంది. విదేశీ, స్వ‌దేశీ వాద‌న‌లు సొంతానికి ఉప‌యోగ‌ప‌డ‌వు. అయితే ఒక‌వైపు గ్లోబ‌లైజేష‌న్ ఫ‌లాల‌ను భుజిస్తూనే.. మ‌ళ్లీ అవ‌త‌లి వాళ్ల‌ను త‌క్కువ చేసే త‌త్వాన్ని భార‌తీయులు వ‌దులుకోవ‌డం లేదు. సూటిగా చెప్పాలంటే  డ‌బ్బులు వ‌చ్చే వ్య‌వ‌హారాల్లో అయితే అంత‌ర్జాతీయతం అవుతున్న భార‌తీయులు, న‌చ్చ‌ని విష‌యాల్లో మాత్రం గ‌గ్గోలు పెట్ట‌డానికి సంస్కృతి, సంప్ర‌దాయాలు అంటూ ఉండ‌టం గ‌మ‌నార్హం!

ప్ర‌త్యేకించి సినిమా వాళ్ల‌కు నైతిక పాఠాలు చెప్ప‌డంలో భార‌తీయులు త‌మ శ‌క్తియుక్తుల‌న్నింటినీ ఖ‌ర్చు పెడుతూ ఉన్నారు. ఇంకా బికినీల గురించి అభ్యంత‌రాల‌ను చెప్ప‌డంలో భార‌తీయులు త‌మ విలువైన స‌మ‌యాన్ని కేటాయిస్తూ బిజీగా ఉన్నారు. వాస్త‌వానికి భార‌తీయ సినిమా తెర‌ల‌పై బికినీలు కొత్త‌వి కావు. ద‌శాబ్దాల కింద‌టే హీరోయిన్లు బికినీల్లో క‌నిపించారు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచినే బికినీ షోలున్నాయి. అయితే వాటి క‌ల‌ర్ల‌పై అప్ప‌ట్లో ర‌చ్చ‌లేదు! ఒక హీరోయిన్ కాషాయ రంగులో బికినీ ధ‌రించిందంటూ గ‌గ్గోలు పెడుతున్న వారి తీరును చూస్తే… ఇవేనా మ‌నం చ‌ర్చించుకోవాల్సిన విష‌యాలు అనే సందేహం త‌లెత్తుతుంది. ఈ అంశం గురించి సెన్సార్ బోర్డు స‌భ్యులు, మాజీ స‌భ్యులు, సినిమా విశ్లేష‌కులు అంతా చ‌ర్చిస్తూ ఉన్నారు. ఆ చ‌ర్చ‌ను ప్రైమ్ టైమ్ బులిటెన్ లో ఇంగ్లిష్ టీవీ చాన‌ళ్లు ప్ర‌సారం చేయ‌డం, మ‌ళ్లీ ఆ అంశంపై లైవ్ అప్ డేట్లు ఇస్తూ జాతీయ వార్తా సంస్థ‌ల వెబ్ సైట్ల‌లో షో ర‌న్ చేస్తూ ఉన్నారు!

ఒక హీరోయిన్ సినిమాలో ధ‌రించిన బికినీ రంగు గురించి ఇంత చ‌ర్చ‌నా, ఇంత ర‌చ్చ‌నా! ఆ సినిమాను బ‌హిష్క‌రించాలంటూ, ఆ సినిమాను నిషేధించాలంటూ, టీవీల్లో ప్ర‌సారం చేయ‌కూడ‌దంటూ త‌లా ఒక వాద‌న‌ను ప‌ట్టుకుని త‌యార‌వుతున్నారు! వీరి కోరిక మేర‌కు ఆ సినిమా నుంచి ఆ బికినీ సీన్ ను క‌ట్ చేసేస్తార‌ట‌. ఎందుకంటే.. మార్కెట్ కోసం! ఆ సినిమా వాళ్లు త‌క్కువైన వాళ్లేమీ కాదు. ఇలాంటి వివాదాలే వారికీ కావాల్సిందీ! లేక‌పోతే ఆ సినిమా గురించి ఇంత ప‌బ్లిసిటీ లేదు. ప్రైమ్ టైమ్ లో వారి సినిమా గురించి చ‌ర్చ పెట్టాలంటే వారు కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టాలి. ఇప్పుడు అంతా ఉచిత ప‌బ్లిసిటీ. ఈ ప‌బ్లిసిటీతో ఆ సినిమా వ‌స్తోంద‌నే విష‌యం అనేక మందికి తెలుస్తోంది. వివాదాన్ని రాజేసిన వారికి కావాల్సిందీ ప‌బ్లిసిటీనే! లేక‌పోతే ఇన్నేళ్ల సినిమా చ‌రిత్ర‌లో ఆరెంజ్ క‌ల‌ర్ బికినీలో మెరిసిన న‌టీమ‌ణులే లేరా!

మ‌రి ఆరెంజ్ క‌ల‌ర్ మీద భార‌త‌దేశానికే పేటెంటు కూడా లేదు! వేరే దేశాల జాతీయ జెండాల్లో కూడా ఈ క‌ల‌ర్ ఉంది. అలాగే అంత‌ర్జాతీయంగా ఈ క‌ల‌ర్ బికినీలు ధ‌రించే వాళ్లూ ఉంటారు. మ‌రి వారినేం చేద్దాం! ఆ హీరోయిన్ ఇలా చూపించింది, ఈ హీరోయిన్ ఇలా చూపించింది.. అనే అంశం గురించి చ‌ర్చించేది ఈ టీకొట్టులోనో అయితే వారి కాల‌క్షేపం అనుకోవ‌చ్చు. దీన్నో జాతీయ వివాదంగా మార్చ‌డం మాత్రం విడ్డూరం. అటు సినిమా వాళ్లూ, ఇటు ఈ రాజ‌కీయ వాదులు క‌లిసి జ‌నాల‌ను వెర్రివాళ్లుగా చేస్తున్నారు.

ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన అంశాల గురించి చ‌ర్చ జ‌రిగితే దానితో ఎంతో కొంత ప్ర‌యోజ‌నం ఉంటుంది. పెరుగుతున్న ధ‌ర‌లు, అంత‌ర్జాతీయ ప‌రిణామాల నుంచి ముంచుకొస్తున్న ఆర్థిక విప‌త్తులు, ప్ర‌జ‌ల స్థితిగ‌తులు.. వీటిపై చ‌ర్చ జ‌రిగితే ప్ర‌జ‌ల‌కు ఏ మూలో అయినా మేలు జ‌రుగుతుంది. ఇలాంటి అంశాల‌ను చ‌ర్చ‌లో ఉంచితే ప్ర‌భుత్వాలు కూడా జాగ్ర‌త్త వ‌హిస్తాయి. అంతే కానీ.. కాషాయ బికినీ వేసింది,  బ్లూ బికినీ వేసిందా అంటూ రాద్ధాంతాలు చేస్తూ.. ప్ర‌జ‌ల‌కు పంగ‌నామాలు పెట్టేలా ప్ర‌ధాన మీడియా వ‌ర్గాలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి.

ఆర్థిక అంశాలూ, ప్ర‌జా ప్ర‌యోజ‌నాల గురించి మాట్లాడ‌టం ప్రైమ్ టైమ్ లో సేల‌బుల్ కాక‌పోతే ఏ క్రీడ గురించినో మాట్లాడినా ఉప‌యోగం ఉంది. సాక‌ర్ లో మ‌న‌కెందుకు లేము, వివిధ రంగాల్లో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌ను మ‌న‌మెందుకు అందుకోలేక‌పోతున్నామో.. నిపుణుల‌ను కూర్చోబెట్టి మాట్లాడిస్తే.. అందులో ఏదైనా సారాన్ని అందుకుని ఆస‌క్తి ఉన్న వారు అయినా త‌మ నైపుణ్యాల‌ను మెరుగు ప‌రుచుకుంటారు. అంతే కానీ.. సినిమాలు, బికినీలు, వాటి రంగులు ఇవా చ‌ర్చా? అక్క‌డికేదో భార‌తీయ తెర‌పై తొలి బికినీ అయిన‌ట్టుగా మీడియా చేస్తున్న యాక్టింగ్ అంతా ఇంతా కాదు! రాత్రి ప‌ది దాటితే.. త‌మ వార్తా చాన‌ళ్ల‌లోనే హాట్ క్లిప్స్ ను, సినిమాల్లోని హాట్ సీన్ల‌ను క‌ట్ చేసి మ‌రీ ప్ర‌సారం చేసే వార్తా చాన‌ళ్లున్న‌దేశంలో మ‌ళ్లీ సినిమాల్లో ఎక్స్ పోజింగ్ అంటూ విలువ‌ల గురించి మాట్లాడ‌ట‌మా హ‌త‌విధీ!