గతంలో హిందీ సినిమాలను పక్కన పెడితే ఆ తర్వాత పాన్ ఇండియా అనదగ్గ మార్కెట్ తమిళ సినిమాలకు ఉండేది. దశాబ్దాల కిందటే తమిళులు తమ సినిమాలను వేరే భాషల్లో బాగా ప్రమోట్ చేసుకున్నారు. వారు చూపిన వైవిధ్యత కావొచ్చు నవ్యత కావొచ్చు.. ఇతర భాషల వాళ్లను కూడా అపరిమితంగా ఆకట్టుకుంది.
80లలో కమల్, రజనీకాంత్ లు తమిళనాడు ఆవల స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. కమల్ అయితే తెలుగు, మలయాళ, హిందీ, కన్నడ.. ఇలా ప్రతి భాషలోనూ నటించే అవకాశాలు వచ్చినప్పుడు వాటిని వదులుకోలేదు. ఇలా నటించగా వచ్చిన గుర్తింపుతో తన తమిళ సినిమాలకు అనువాద మార్కెట్ ను సృష్టించుకున్నాడు కమల్.
80లలోనే కమల్ తమిళ సినిమాలు తప్పనిసరిగా తెలుగులోకి అనువాదం అయ్యే పద్ధతి ఏర్పడింది. 90లకు వచ్చే సరికి కమల్ సినిమాలు తెలుగుతో పాటు హిందీకి కూడా తప్పనిసరిగా అనువాదం అవుతూ వచ్చాయి. కొన్ని సందర్భాల్లో హిందీలో వాటిని రీమేక్ కూడా చేశాడు ఈ హీరో.
ఇక రజనీకాంత్ అనువాద సినిమాలకు 90ల నుంచి క్రేజ్ పెరిగింది. తెలుగు, హిందీ భాషల్లో రజనీ సినిమాలు విడుదలయ్యే పద్ధతి ఏర్పడింది. వీరు ఇచ్చిన స్ఫూర్తితో తమిళంలోని ఆ తర్వాతి తరం హీరోలు కూడా తమ రాష్ట్రం ఆవల కూడా మంచి గుర్తింపును సంపాదించుకోసాగారు. విక్రమ్, సూర్య, అజిత్, విశాల్, శింబు.. ఇలా తమిళ హీరోలు సర్వత్రా గుర్తింపును పొందారు.
స్థూలంగా తమిళ సినిమాకు పెద్ద మార్కెట్ ఏర్పడింది. అనువాద సినిమాల స్థాయిలో గాక.. ఆయా భాషల్లో ఒరిజినల్స్ స్థాయిలో తమిళ హీరోల సినిమాలు స్థిరమైన మార్కెట్ ను ఏర్పరుచుకున్నాయి. ఆ స్ఫూర్తితో తెలుగు హీరోలు కూడా కొన్ని ప్రయత్నాలు అయితే చేశారు.
గత దశాబ్దకాలంగా తెలుగు సినిమాలను తమిళ, హిందీ భాషల్లోకి అనువాదం చేసి మార్కెట్ ను ఏర్పరుచుకునే ప్రయత్నాలు జరిగాయి. అయితే తెలుగు స్టార్ హీరోలకు ఇదంత తేలికగా దక్కలేదు!
మొదట్లో యూట్యూబ్ వరకూ తెలుగు నుంచి అనువాదం అయిన సినిమాలకు అవకాశం లభించింది. అదంతా లక్షల రూపాయల బేరమే. ప్రత్యేకించి హిందీ వాళ్లు సౌత్ యాక్షన్ ఎంటర్ టైనర్లను విపరీతంగా ఇష్టపడే తరుణంలో.. తెలుగు మాత్రమే కాదు, తమిళ, కన్నడ సినిమాలు కూడా విపరీతంగా డబ్ అయ్యాయి. యూట్యూబ్ లో విడుదలయ్యాయి.
అలాగే హిందీ మూవీ చానళ్లలో నిత్యం ఈ అనువాద సినిమాలే ప్రసారం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇలా తెలుగేతర మార్కెట్ లో ముక్కుతూ, మూలుగుతున్న తెలుగు సినిమాకు బాహుబలి తో కొత్త రెక్కలు వచ్చాయి. ఆరేళ్ల కిందట ఆ సినిమా సృష్టించిన సంచలనంతో.. ఆ తర్వాత తెలుగు సినిమాలపై పాన్ ఇండియా చూపు పడింది. బాహుబలి, బాహుబలి 2లతో తెలుగు సినిమా నయాతరం సినిమాలకు కొత్త మార్కెట్ ఏర్పడింది.
బాహుబలి ఇమేజ్ వల్ల కేవలం ఆ సినిమాలో నటించిన వారికే కాకుండా అందరికీ మేలు జరిగింది. మార్కెటింగ్ పద్ధతులు ఒంటబట్టాయి. ఈ ఫలితాలన్నీ 2022లో విడుదలైన సినిమాల విషయంలో కనిపించాయి.
2021 చివర్లో విడుదలైన పుష్ఫ సినిమా పాన్ ఇండియా మార్కెట్ గా ప్రమోషన్ పొందింది. విశేషం ఏమిటంటే తెలుగునాట ఈ సినిమా పట్ల పెదవి విరుపులు వినిపించాయి. ఈ సినిమాలో ఏముందంతగా.. అనే టాక్ నడించింది. అభిమానులు కూడా ఈ సినిమా పట్ల మరీ ఊగిపోయింది లేదు. అయితే పుష్పకు తెలుగు భాష అవతలే మంచి రిసెప్షన్ లభించింది.
హిందీలో ఈ సినిమా సాధించిన వసూళ్లు ఏమో కానీ కల్ట్ హిట్ అనిపించుకుంది. పుష్ప హావభావాలు మాస్ కు బాగా రీచ్ అయ్యాయి. ఈ సినిమాలో నటించిన రష్మికకు హిందీజనాల్లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఫలితంగా ఆమె సినిమాలకు కొత్త మార్కెట్ దారులు తెరుచుకున్నాయి.
ఇక ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ఆర్ఆర్ఆర్ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుగా నిలిచింది. బాహుబలి రూపకర్త సినిమా కావడం, అదే స్థాయి భారీతనం ఉండటం, రామ్ చరణ్- ఎన్టీఆర్ ల విన్యాసాలు.. ఈ సినిమాకు విపరీతమైన బజ్ ను పెంపొందించాయి. బాహుబలి -2 రూపకర్త నుంచి వచ్చిన సినిమాగా ఆర్ఆర్ఆర్ అపూర్వ ఆదరణను సొంతం చేసుకుంది. అదరగొట్టే వసూళ్లను పొందింది. ఇలా తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ మరింత విస్తృతం అయ్యింది. ఏదో ఒక సినిమా వండర్ లా కాకుండా, స్థిరత్వం ఉండబోతున్న సంకేతాలు ఇచ్చింది ట్రిపుల్ ఆర్.
ఇక అనూహ్యమైన పాన్ ఇండియాగా నిలిచింది కార్తికేయ-2. ఉత్తరాదిన ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం కార్తికేయ-2 సూపర్ హిట్ కు ఆస్కారాన్ని ఇచ్చింది. ఏదేమైనా ఒక తెలుగు సినిమా ఉత్తరాదిన ఈ మాత్రం హిట్ కావడం విశేషమైన పరిణామమే.
పాన్ ఇండియా సినిమాలు కావాలంటే అన్నీ బాహుబలి, ట్రిపుల్ ఆర్ రేంజ్ లో రానక్కర్లేదు, కాన్సెప్ట్ వైజ్ గా కార్తికేయ-2, కాంతార వంటి కన్నడ సినిమా సక్సెస్ కూడా పాఠాలను నేర్పుతోంది. ఈ తరహా సినిమాలకు ఇప్పుడు మార్కెట్ ఉందని స్పష్టం అవుతోంది. ఈ తరహా సినిమాలను రూపొందించడం తెలుగు వారికి కష్టం కాకపోవచ్చు. ఈ వరసలో మరిన్ని సినిమాలు రాబోతున్నాయి కూడా!
అయితే పాన్ ఇండియా విషయంలో కొన్ని సెట్ బ్యాక్స్ కూడా తెలుగు సినిమాలకు తప్పలేదు. ప్రభాస్ కు జాతీయ స్థాయిలో ఉన్న ఇమేజ్ తో భారీ హిట్ అవుతుందనుకున్న *రాధేశ్యామ్* అంచనాలను అందుకోలేకపోయింది. బాహుబలి-2 తర్వాతి ప్రభాస్ సినిమా *సాహో* మిశ్రమ స్పందనతో కూడా హిందీలో భారీ స్థాయి వసూళ్లను సంపాదించుకుంది. తెలుగులో సాహో పట్ల తిరస్కరణ ఎదురైనా హిందీ బెల్ట్ లో ఆ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. అయితే రాధేశ్యామ్ కు ఆ అలాంటి ఊరట కూడా లభించలేదు. ఇలా ఒక తెలుగు సినిమా పాన్ ఇండియా తిరస్కరణను ఎదుర్కొంది 2022లో.
అలాగే పాన్ ఇండియా ప్రమోషన్ ను పొందిన *లైగర్* కూడా తీవ్రమైన ఛీత్కారాన్ని పొందింది. తెలుగులోనే ఈ సినిమా పట్ల తీవ్ర మైన విమర్శలు వచ్చాయి. హిందీ దీనికి మినహాయింపు కాదు. పాన్ ఇండియా సినిమాలు అంటూ తెలుగు వాళ్లు గింజుకుంటున్నారని, ఇప్పుడు తగిన శాస్తి జరిగిందనేంత స్థాయిలో ఈ సినిమా విమర్శకులను రెచ్చగొట్టింది. అతివిశ్వాసమే ఈ సినిమాను దెబ్బతీసిందేమో కానీ స్థూలంగా దీని వల్ల తెలుగు సినిమా పరిశ్రమనే విమర్శలు ఎదుర్కొనాల్సి వచ్చింది.
ఇక ఇంకో వైపు.. ప్రతి సినిమానూ ఐదారు భాషల్లో విడుదల చేయడం సంప్రదాయంగా మారింది 2022లో. పెద్ద హీరోల సినిమాలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు.. ఏకంగా ఐదారు భాషల్లో విడుదల అంటూ హడావుడి చేయడం మొదలైంది. చిరంజీవి నటించిన రెండు సినిమాలూ వివిధ భాషల్లో విడుదలయ్యాయి. అయితే ఇవి తెలుగునాటే పెద్ద ఆదరణకు నోచుకోలేదు. దీంతో పాన్ ఇండియా లెవల్లో కూడా ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి.
అలాగే రీమేక్ సినిమాలను కూడా పాన్ ఇండియా సినిమాలు అంటూ ప్రమోట్ చేసే దౌర్భాగ్యాన్ని తెలుగు సినిమా వదులుకోలేకపోయింది. మలయాళ సినిమాలు అయ్యప్పనుమ్ కోషియుం, లూసీఫర్ వంటి సినిమాలను రీమేక్ చేసి.. ఇవి పాన్ ఇండియా సినిమాలు అంటూ వివిధ భాషల్లో విడుదలలు అంటూ జనాలను వెర్రివాళ్లను చేసే ప్రయత్నమూ జరిగింది. అయితే ఇలాంటి ప్రయత్నాలకు తిరస్కరణ తప్పలేదు. ఆల్రెడీ విడుదలైన సినిమాల కథలను కొనుక్కొనొచ్చి మళ్లీ పాన్ ఇండియా ట్యాగ్ ఏమిటంటూ కూడా క్రిటిక్స్ ఈ శైలిని తూర్పారపట్టారు. ఇందుకు తగ్గట్టుగా ప్రేక్షకులు కూడా స్పందించారు.
ఏదేమైనా.. ఇక నుంచి తెలుగు సినిమాలు కేవలం తెలుగు సినిమాలు కావు! మినిమం ఐదారు భాషల్లో విడుదల అవుతాయి. అయితే విడుదలైన చోటల్లా హిట్ అవుతాయా, ఫ్లాప్ అవుతాయా అనేది వేరే సంగతి. పాన్ ఇండియా అంటూ ఎంత చెబుతున్నా ఒక భాషలో హిట్టైన సినిమా మరో భాషలో అందులో సగం స్థాయి విజయాన్ని అందుకోవడం కూడా జరుగుతుందని ఎవ్వరూ హామీ ఇవ్వలేరు. తమిళ సినిమా పొన్నియన్ సెల్వన్-1 తమిళంలో సూపర్ హిట్. అయితే తెలుగు, హిందీ, కన్నడల్లో అంత లేదు! అలాగే కాంతార కన్నడనాట సూపర్ హిట్. తెలుగులో చెప్పుకోదగిన హిట్. అయితే హిందీ లో ఈ రేంజ్ కాదు. అలాగే ఓటీటీల్లో ఆ సినిమాను చూసిన వారు ఓవర్ రేటెడ్ అంటున్నారు.
ఇలాంటి పరిస్థితులు ఉన్నా… ప్రస్తుతానికి తెలుగు సినిమాలకు పాన్ ఇండియా ట్యాగ్ తో మార్కెట్ కు దారులు తెరుచుకున్నాయి. మరి ఈ పరిస్థితులను తెలుగు సినిమా ఎంత వరకూ ఉపయోగించుకుని స్థిరమైన ఆదాయవనరులను కొనసాగించుకుంటున్నదనేది ముందు ముందు తేలే అంశం.