కొత్త ఏడాది 2023లో అడుగు పెట్టాం. ఈ ఏడాది అంతా బాగుండాలని ఆయా రంగాలకు చెందిన వారు కోరుకోవడం సహజం. ఏపీ రాజకీయాల విషయానికి వస్తే… కొత్త ఏడాది ఎంతో కీలకం అని చెప్పొచ్చు. 2024లో జరగనున్న ఎన్నికలకు సన్నద్ధం కావడానికి 2023 అత్యంత కీలకం. రాజకీయ పార్టీల నేతలు సర్వశక్తులు ఒడ్డడానికి ఈ ఏడాదిని ఉపయోగించుకోనున్నారు. వైసీపీ తిరిగి తన అధికారాన్ని నిలబెట్టుకోడానికి ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే సీరియస్‌గా దృష్టి సారించారు.
ఈ నేపథ్యంలో ఆయన మరింతగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఈ ఏడాదిలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే తన పార్టీ ఎమ్మెల్యేలను గడపగడపకూ జగన్ పంపిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ, ప్రభుత్వంపై అసంతృప్తులను చల్లార్చేందుకు జగన్ ఎలాంటి వ్యూహాలు రచిస్తారో ఈ ఏడాది చెప్పనుంది.
మళ్లీ అధికారాన్ని దక్కించుకునేందుకు చంద్రబాబునాయుడు తన అనుభవాన్ని అంతా ఉపయోగించనున్నారు. పోయిన చోటే వెతుక్కోవాలనే సామెత చందాన, లోపాలను సవరించుకునేందుకు చంద్రబాబుకు ఇదే సరైన సమయం. టీడీపీ భవిష్యత్‌ను తేల్చే ఎన్నికలు కావడంతో ప్రతి నిమిషాన్ని చంద్రబాబు, లోకేశ్ సద్వినియోగం చేసుకునేందుకు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. లోకేశ్‌కు ఈ ఏడాది అనేక పరీక్షలు పెట్టనుంది.
ఈ నెల 27న కుప్పం నుంచి లోకేశ్ పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. వైసీపీతో తాడేపేడో తేల్చుకునేందుకు లోకేశ్ బరిలో దిగినట్టు కనిపిస్తోంది. ఇంతకంటే లోకేశ్‌కు మరో మార్గం కూడా కనిపించడం లేదు. ఎందుకంటే టీడీపీ ఆశాకిరణం ఆయనే కాబట్టి. తన నాయకత్వ సమర్థతను నిరూపించుకోడానికి లోకేశ్ నడక చేపట్టనున్నారనేది బహిరంగ రహస్యమే. చంద్రబాబు సమర్థతకు ఈ ఏడాది చాలా పెద్ద పరీక్ష పెట్టనుంది.
ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏ మాత్రం మొహమాటానికి పోయినా… టీడీపీ కథ కంచికే అని హెచ్చరించక తప్పదు. ప్రజలతో సంబంధం లేకుండా కేవలం తన చుట్టూ పరిభ్రమించే వారే నాయకులని నమ్మి టికెట్లు ఇస్తే మాత్రం ఆయన శాశ్వతంగా అధికారాన్ని మరిచిపోవచ్చు. మరీ ముఖ్యంగా నాన్చుడు ధోరణి టీడీపీని చావు దెబ్బ తీసే అవకాశాలున్నాయి. అలాగే ఎవరినైనా పక్కన పెట్టాల్సి వస్తే జగన్‌ను ఆదర్శంగా తీసుకోవడం మంచిది. నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు పిరికివాడనే ఆరోపణ సొంత పార్టీ నేతల నుంచే బలంగా వినిపిస్తోంది. ఇదే జగన్ అయితే…అని ప్రత్యర్థులు కూడా అంటున్న పరిస్థితి.
ప్రస్తుతం చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు జనం వస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది. దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లగలిగితే టీడీపీకి రాజకీయంగా ప్రయోజనం వుంటుంది. అలాగే జనసేనతో పొత్తు అంశం కూడా ఈ ఏడాదిలో అటోఇటో తేలిపోనుంది. అయితే జనసేనకు ఇచ్చే సీట్ల సంఖ్యకు టీడీపీకి లాభమా? నష్టమా? అనేది ఆధారపడి వుంటుంది. జనసేనకు 40-50 సీట్లు ఇస్తే మాత్రం లాభం కథ దేవుడెరుగు, టీడీపీ భారీగా దెబ్బ తింటుంది. మరీ ముఖ్యంగా ముఖ్యంగా తప్ప అసెంబ్లీలో అడుగు పెట్టననే శపథాన్ని నెరవేర్చుకోవడం ఈ ఏడాది అనుసరించే విధానాలపై ఆధారపడి వుంటుంది. ఇటీవల ఇవే తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు చేసిన కామెంట్స్ రాజకీయంగా దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. తనే ఆ మాట అన్న నేపథ్యంలో ఇక ఆయన రాజకీయ భవిష్యత్‌పై మనం చర్చించుకోనవసరం లేదు.
ఇక పవన్‌కల్యాణ్ విషయానికి వస్తే భవిష్యత్‌పై ఆయనకే ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. జనసేన రాజకీయ పంథాపై తనకంటూ ఒక స్పష్టత వుండడంతో పాటు జనానికి వచ్చేలా చేసే బాధ్యత పవన్‌కల్యాణ్‌పై వుంది. ఇందుకు త్వరలో ఆయన చేపట్టే ప్రచార యాత్రను ఉపయోగించుకుంటే మంచిది. పవన్ రాజకీయంగా తెలివిగా అడుగులు వేస్తే… ఏపీలో మంచి భవిష్యత్ వుంటుంది. ఇప్పటికే ఆయన ఆ పని చేసి వుంటే… బాగుండేది. ఎందుకో కొన్ని బలహీనతలు జనసేనను ఎదగనీయకుండా చేస్తున్నాయి. ఆ బలహీనతల్ని అధిగమించాల్సిన అవసరం ఆయనకే వుంది. బీజేపీతో పొత్తును తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక కొత్తగా బీఆర్ఎస్, ఆప్ పార్టీల ప్రవేశం కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎంతోకొంత ప్రభావం చూపే అవకాశాలున్నాయి. రాజకీయంగా 2023 మాత్రం అత్యంత ఆవశ్యకత ఉన్న ఏడాదిగా మనందరికి గుర్తుండే అవకాశాలున్నాయి.