విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. అలాంటి ప్లాంట్ ఇపుడు ఖాళీ అవుతోంది. మూడేళ్ళుగా ప్రైవేటీకరణ వ్యూహాలు ఇక్కడ అమలు అవుతున్నాయి. దాంతో కొత్త కొలువులకు చెక్ పెట్టేశారు. అదే విధంగా ప్లాంట్ లో రిటైర్ అవుతున్న ఉద్యోగుల స్థానంలో పోస్టింగులు లేవు.
అలా కీలక విభాగాలు అన్నీ ఒక్కటొక్కటిగా ఖాళీ అవుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రతీ నెలా తీసుకుంటే సగటున యాభై నుంచి అరవై మంది దాకా ఉద్యోగులు వివిధ కేటగిరీలకు చెందిన వారు పదవీ విరమణ చేస్తునారు. వారిలో అనుభవం కలిగిన వారు నిష్ణాతులు ఎందరో ఉన్నారు.
వీరి స్థానాలు ఖాళీ అవడం వల్ల ప్లాంట్ కి తీరని నష్టే కలుగుతోందని కార్మిక సంఘాలు అంటున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో గత మూడేళ్ల వ్యవధిలో చూసుకుంటే రెండు వేల మంది దాకా ఉద్యోగులు రిటైర్ అయిన చోట పోస్టింగులు అయితే లేవు. ఎటూ ప్లాంట్ ని ప్రైవేట్ దిశగా నడిపిస్తున్నందువల్ల ఎందుకు అదనపు భారమని కేంద్రం అనుకుంటోందిట.
దాంతో విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఎటు చూసినా అంతా ఖాళీగానే కనిపిస్తోంది. 2023 ఏడాది విశాఖ భవిష్యత్తుని నిర్ణయించేదిగా అటు కార్మిక సంఘాలతో పాటు ఇటు యాజమాన్యం కూడా భావిస్తోంది. ప్లాంట్ ప్రైవేటీకరణకు ఈ ఏడాదిలో ఒక కచ్చితమైన ముగింపు లభిస్తుంది అంటున్నారు. ఈ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ప్రజా సంఘాల సహకారంలో కొత్త ఏడాది కూడా పోరాటాలను కార్మిక సంఘాలు ముమ్మరం చేస్తున్నాయి.