ప్లాంట్ కోసం పాల్ దీక్ష

కే ఏ పాల్ ప్రజా శాంతి పార్టీ ప్రెసిడెంట్‌గా ఉంటూ మునుగోడులో పోటీ చేశారు. 2019లో నర్సాపురం ఎంపీ సీటుకు పోటీ చేశారు. ఈసారి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తాను అని ముందే…

కే ఏ పాల్ ప్రజా శాంతి పార్టీ ప్రెసిడెంట్‌గా ఉంటూ మునుగోడులో పోటీ చేశారు. 2019లో నర్సాపురం ఎంపీ సీటుకు పోటీ చేశారు. ఈసారి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తాను అని ముందే చెప్పేశారు. తాను పక్కా లోకల్ అని తాను పుట్టిన నేలకు సేవ చేస్తానని అంటున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇపుడు పాల్ అమరణ దీక్షకు దిగారు. దీని కంటే ముందు రెండు రోజుల క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను చంపేందుకు చూస్తున్నారు అని తీవ్ర ఆరోపణలు చేశారు. అయినా సరే తాను స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతాను అని ఆయన చెబుతున్నారు.

స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటానని చెప్పి మరీ పాల్ దీక్షకు కూర్చున్నారు ఎనిమిది లక్షల కోట్ల విలువ చేసే ఉక్కు కర్మాగారాన్ని కేవలం నాలుగు వేల కోట్లకు ఎలా అమ్మేస్తారు అని పాల్ ప్రశ్నిస్తున్నారు. తనను విశాఖ వాసులు ఎంపీగా ఎన్నుకుంటే లక్షల కోట్లు తెచ్చి ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో నడుపుతానని పాల్ ప్రామిస్ చేస్తున్నారు.

పాల్ అమరణ దీక్ష సోమవారం సాయంత్రం మొదలైంది. ఆయనకు ఉక్కు ఉద్యమ కార్మిక సంఘాలతో పాటు ఎవరెవరి మద్దతు ఉంటుందో రానున్న రోజులలో తెలుస్తుంది. పాల్ రాజకీయాలను లైట్ గా తీసుకునే వారు ఇపుడు ఈ దీక్షను ఎలా చూస్తారో మరి. పాల్ మాత్రం తాను సీరియస్ పొలిటీషియన్ని అంటున్నారు.

తాను మాత్రమే ప్లాంట్ ని ప్రైవేట్ పరం కాకుండా ఆపగలను అని చెబుతున్నారు. పాల్ ని ఒక్క విషయంలో మెచ్చాలని అంతా అంటున్నారు. ప్లాంట్ కోసం ఎన్నో కబుర్లు చెప్పే వారంతా సైడ్ అయిన వేళ ఆయన మాత్రం ఒంటరిగా నిలబడి దీక్షకు సిద్ధం కావడం భేషైన చర్య అనే అంటున్నారు.