ఇది సామెత మాత్రమే. ఒకరి మీద కోపం మరొకరి మీద చూపిస్తే.. మనం ఈ సామెతను వాడుతుంటాం. కానీ అత్తమీద కోపాన్ని అల్లుడి మీద చూపిస్తే దాన్ని ఏమనగలం? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అచ్చంగా అదే జరిగింది. పార్టీలో తన నిర్ణయాన్ని ధిక్కరించి తిరుగుబాటు బావుటా ఎగరేయడానికి పూనుకున్న వారిమీద ఆగ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇలాంటి పనే చేశారు.
తన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న అత్తమీద కోపంతో.. ఒక జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న అల్లుడికి బదిలీ గిఫ్ట్ గా ఇచ్చారు.! సొంత ఎమ్మెల్యేను ఏమీ చేయలేని స్థితిలో కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? అని ప్రజలు అనుకుంటున్నారు.
గులాబీ దళపతి.. రాబోయే ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థుల జాబితాను ప్రకటించేసిన సంగతి తెలిసిందే. టికెట్లు నిరాకరింపబడిన అతికొద్దిమంది సిటింగ్ ఎమ్మెల్యేల్లో ఖానాపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రేఖా నాయక్ కూడా ఒకరు. ఆమె కేసీఆర్ నిర్ణయాన్ని ధిక్కరించారు. పార్టీలో తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. జాబితా వెలువడిన తర్వాత కాంగ్రెసులో చేరేది లేనిదీ ఇంకా నిర్ణయించుకోలేదని ఆమె సన్నాయి నొక్కులు నొక్కారు. ఈలోగా ఆమె భర్త మాత్రం ఎంచక్కా గాంధీభవన్ కు వెళ్లి కాంగ్రెసు కండువా కప్పుకోవడంతో పాటు తన పేరుతో ఎమ్మెల్యే టికెట్ కు దరఖాస్తు కూడా చేసేసుకున్నారు.
అయితే రేఖానాయక్ ఫైనల్ గా తన నిర్ణయాన్ని తెగేసి చెప్పేశారు. కాంగ్రెసులో చేరబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటిస్తే.. అనర్హత వేటు పడుతుందని కొన్నిరోజులు సంకోచించారేమో గానీ.. తాజాగా ప్రకటన చేసేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచానని, ఈ టర్మ్ ఎమ్మెల్యే పదవి పూర్తయ్యేవరకు బీఆర్ఎస్ లో కొనసాగుతానని ఆ తర్వాత కాంగ్రెసులో చేరుతానని ఆమె వెల్లడించారు.
అయితే ఆమె ఈనిర్ణయాన్ని ప్రకటించిన కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే.. మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న ఆమె అల్లుడు శరత్ చంద్ర పవార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. కేవలం రేఖా నాయక్ మీద రాజకీయ కక్షతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి.
నిజానికి జాబితా విడుదలైన తర్వాత అసంతృప్తులుగా చెలరేగిన వాళ్లు చాలా మంది ఉన్నారు. పట్నం మహేందర్ రెడ్డి, చెన్నమనేని రమేష్ వంటి వారికి పెద్ద పెద్ద తాయిలాలు అందించిన కేసీఆర్.. రేఖా నాయక్ కు మాత్రం.. అల్లుడి బదిలీని గిఫ్ట్ గా ఇచ్చారని జనం అంటున్నారు.