చిరంజీవి, రజనీకాంత్ సినిమాలు రెండూ ఒకటేనా!

రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు తెలుగులో పెద్దన్న అనే టైటిల్ పెట్టారు. టీజర్ కూడా రిలీజ్ చేశారు. అంతా చూశారు, ఓకే అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజ్ అయిందో, అప్పుడంతా అవాక్కయ్యారు.…

రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు తెలుగులో పెద్దన్న అనే టైటిల్ పెట్టారు. టీజర్ కూడా రిలీజ్ చేశారు. అంతా చూశారు, ఓకే అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజ్ అయిందో, అప్పుడంతా అవాక్కయ్యారు. మరీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ టెన్షన్ లో పడ్డారు. దీనికి కారణం పెద్దన్న ట్రయిలర్ లో భోళాశంకర్ లక్షణాలు కనిపించడమే.

నిన్న పెద్దన్న ట్రయిలర్ రిలీజైంది. ఇందులో రజనీకాంత్ కు చెల్లెలిగా నటించింది కీర్తిసురేష్. సేమ్ టు సేమ్ చిరంజీవి హీరోగా రాబోతున్న భోళాశంకర్ లో కూడా అంతే. చిరంజీవి-కీర్తిసురేష్ అన్నాచెల్లెళ్లుగా నటిస్తున్నారు. అయితే ఇక్కడ కీర్తిసురేష్ బ్యాక్ టు బ్యాక్ చెల్లెలు పాత్రలో నటిస్తోందని సరిపెట్టుకోవడానికి వీల్లేదు. కథ ఇక్కడితో అయిపోలేదు.

పెద్దన్న సినిమాలో కోల్ కతా బ్యాక్ డ్రాప్ ఉంది. ట్రయిలర్ లో హౌరా బ్రిడ్జి కూడా చూపించారు. భోళాశంకర్ లో కూడా కోల్ కతా బ్యాక్ డ్రాప్ ఉంది. రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ లో కూడా హౌరా బ్రిడ్జి చూపించారు.

పెద్దన్న సినిమా మొత్తం చెల్లెలు కీర్తిసురేష్ చుట్టూనే తిరుగుతుందనే విషయం ట్రయిలర్ చెప్పకనే చెప్పేశారు. భోళాశంకర్ సినిమాలో కూడా చెల్లెలు పాత్రే కీలకం అనే విషయం చెబుతూ వస్తున్నారు. ఇలా రెండు సినిమాల మధ్య ఇప్పుడు చాలా పోలికలు కనిపిస్తున్నాయి.

నిజానికి భోళాశంకర్ సినిమా స్ట్రయిట్ మూవీ కాదు. కోలీవుడ్ లో హిట్టయిన వేదాళం సినిమాకు ఇది రీమేక్. పెద్దన్న సినిమాను వేదాళం స్టయిల్ లో తీసినట్టు కనిపిస్తోంది తప్ప, మక్కికిమక్కి ఫాలో అవ్వరు, అవ్వలేరు. కాబట్టి కథ విషయంలో భోళాశంకర్, పెద్దన్న మధ్య తేడా ఉండొచ్చు. కానీ పైపైన చూస్తే మాత్రం 2 సినిమాలు ఒకేలా కనిపిస్తున్నాయి.

భోళాశంకర్ లో కూడా హీరోయిన్ గా నయనతారను తీసుకుంటే ఈ కంపారిజన్స్ ఇంకా ఎక్కువవుతాయి. నవంబర్ 11 ఉదయం 7:45 గంటలకు భోళాశంకర్ లాంఛ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. నవంబర్ 15 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.