టీడీపీ అధినేత చంద్రబాబు ఎత్తుకు బీజేపీ పైఎత్తు వేసింది. బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు వేసిన పాచిక పారలేదు. జగన్ ప్రభుత్వంపై మందీమార్బలంతో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అవమాన భారంతో తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మినహా మరెవరూ చంద్రబాబు బృందానికి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం ఢిల్లీలో పడిపోయిన బాబు పరపతిని తెలియజేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్రహోంమంత్రి అమిత్‌షా తమ అధినాయకుడు చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడినట్టు ఎల్లో బ్యాచ్ ఓ ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. మంగళవారం ఉదయమే కశ్మీర్ నుంచి రావడంతో పాటు సాయంత్రం మంత్రివర్గ సమావేశం వుండడంతో సమయం కేటాయించలేకపోయానని బాబుకు అమిత్ షా వివరణ ఇచ్చినట్టు టీడీపీ నాయకులు ప్రచారం చేస్తుండడం గమనార్హం. అంతేకాదు, ఇపుడు ఎక్కడున్నారని వాకబు చేయడంతో పాటు వీలైనంత త్వరలో కలుద్దామని బాబుతో అమిత్‌షా అన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారాన్ని బీజేపీ సానుకూలంగా మలుచుకుంటోంది. ఇదంతా బీజేపీ బద్వేల్ ఉప ఎన్నిక నేపథ్యంలో పన్నిన వ్యూహమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బద్వేల్ ఉప ఎన్నికలో టీడీపీ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బాబుకు అమిత్ షా ఫోన్ నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారని చెబుతున్నారు.
ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదనే కోపం టీడీపీ శ్రేణుల నుంచి తొలగించేందుకే అమిత్ షా ఫోన్ చేశారనే ప్రచారం ఉధృతంగా సాగుతోంది. అమిత్‌షా ఫోన్ చేసి తమ నాయకుడి పరువు కాపాడారని టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
బీజేపీ ప్రతి మాటకు ఓ లెక్కుంటుందని, బాబుకు అమిత్ షా ఫోన్ వెనక బద్వేల్ ఉప ఎన్నిక ప్రయోజనాలు దాగి ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.