మొత్తానికి గుడ్లు పగులుతున్నాయ్.. పిల్లలు బయటకు వస్తున్నాయ్.. కూతలు పెడుతున్నాయ్. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ 2019లో వైకాపా వాడిన వ్యూహాన్నే తెలుగుదేశం కూడా వాడుతుతున్నట్లు కనిపిస్తోంది. న్యూట్రల్ గా వుండేవాళ్లు, జనాలు నమ్మేవాళ్లు 2019లో కొంతమంది గొంతెత్తారు. కానీ అచిరకాలంలోనే వారంతా జగన్ కు దూరం అయ్యారు. వాళ్లలో చాలా మంది ఐఏఎస్లు వున్నారు. వాళ్లంతా ఎందుకు దూరం అయ్యారు. జగన్ వ్యవహార శైలి నచ్చకా అన్నది క్లారిటీ లేదు.
రమేష్, ఎల్వీ ప్రసాద్, అజేయ్ కల్లాం, ఐఎస్ఆర్ కృష్ణారావు ఇంకా పలువురు మొదట్లో జగన్ వైపు ఎవరి లెవెల్ లో వారు మొగ్గారు. జనం మీద దీని ఇంపాక్ట్ కూడా కనిపించింది. కానీ రాను రాను ఒక్కొక్కరూ దూరం అయ్యారు.
గెలవడానికి ముందు సరే, గెలిచిన తరువాత ఏం జరిగింది? ఎందుకు వీళ్లు దూరం అయ్యారు. అసలు సంగతేమిటి అన్నది అంతు పట్టలేదు. బయటకు రాలేదు. కానీ చిన్న చిన్న సన్నాయి నొక్కలు మాత్రం వినిపించాయి. తనతో వున్న వారు అందరినీ జగన్ అనవసరంగా దూరం చేసుకుంటున్నారు అనే కామెంట్లు బలంగా వినిపించాయి. కానీ అసలు విషయం మాత్రం తెలియలేదు.
లేటెస్ట్ గా ఓ డైలీకి అప్పటి ఐఏఎస్ రమేష్ ఇంటర్వూ ఇచ్చారు. ఇప్పుడు బయట పడింది. ఐఏఎస్ల్లోని నార్త్ లాబీ కి సౌత్ లాబీకి పడలేదు అన్నది. నిజానికి ఐఏఎస్లల్లో రెండు మూడు లాబీలు వుండడం అన్నది కొత్త సంగతి కాదు. దశాబ్దాల కిందటి నుంచి నార్త్.. సౌత్ లాబీలు అన్నవి వుంటూ వస్తున్నాయని సెక్రటేరియట్ వర్గాలకు తెలిసిన సంగతే. అంతే కాదు ఓ పర్టిక్యులర్ కాస్ట్ లాబీలు కూడా వున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కీలకమైన పోస్టింగ్ ల విషయంలో ఈ లాబీలు కీలకంగా వ్యవహరిస్తూ వుంటాయి.
రమేష్ ఇప్పుడు ఇచ్చిన ఇంటర్వూలో ఓ కీలకమైన ఆరోపణ చేసారు. ఓ సీనియర్ ఐఏఎస్ ఓ కీలకమైన సమావేశానికి హాజరు కాకపోవడం వల్లనే ప్రత్యేక హోదా రాలేదన్నది ఆ ఆరోపణ. ఆ ఐఏఎస్ ఎవరు అన్నది చెప్పలేదు కానీ ఆ పత్రిక ప్రత్యేకంగా పరిశోధించి, ఆ ఐఏఎస్ పేరు. ఆయనకు జగన్ ఇస్తున్న ప్రయారిటీని వెల్లడించింది. అతని వల్లే మొత్తం హోదా ఆగిపోయింది అని తేల్చేసారు. ఆ అధికారికి జగన్ విపరీతమైన ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పకనే చెప్పారు.
అంటే టోటల్ గా ఏమిటి? జగన్ వల్లే హోదా రాలేదు అన్న బురద ఒకటి తయారు చేసి జల్లే ప్రయత్నం ఇదంతా. సూక్ష్మంగా ఆలోచిస్తే నార్త్ ఐఏఎస్ లాబీకి జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు అని అర్థం అవుతుంది. అది మన ఐఏఎస్ లాబీకి నచ్చలేదు. అందుకే రమేష్, అజయ్, ఎల్వీ, కృష్ణారావు అందరూ దూరం అయ్యారని అర్థం అవుతోంది. సెక్రటేరియట్ లోని కీలకమైన విషయాలు, వార్తలు, సమాచారం అంతా జగన్ నెగిటివ్ మీడియాకు ఎలా అందుతోందో అర్థం అయింది. డిజిటల్ సిగ్నేచర్లు, రహస్య వర్తమానాలు, సమాచారం అంతా ఎలా బయటకు వస్తోందో తెలిసినట్లే.
మొత్తానికి ఈ ఇంటర్వూ పుణ్యమా అని చిక్కుముడి వీడింది. ఐఏఎస్ లాబీల్లో వున్న విబేధాలు, జగన్ ఒక వైపు మొగ్గడం వల్ల ఆయనకే సమస్యగా మారుతోందని తెలుస్తోంది. మరి ఇప్పటికైనా జగన్ జాగ్రత్త పడతారో, పడరో చూడాలి.