మహా భక్తులం అంటున్న రాజా వారు

కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఆగ్రహించారు. ఆయన వైసీపీ ప్రభుత్వం తీరు మీద నిప్పులు కురిపించారు. తమకు వంశపారంపర్యంగా వచ్చే సింహాచలం ధర్మకర్తల మండలి ధర్మకర్త బాధ్యతలను రబ్బర్ స్టాంపుగా చూడవద్దంటూ…

కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఆగ్రహించారు. ఆయన వైసీపీ ప్రభుత్వం తీరు మీద నిప్పులు కురిపించారు. తమకు వంశపారంపర్యంగా వచ్చే సింహాచలం ధర్మకర్తల మండలి ధర్మకర్త బాధ్యతలను రబ్బర్ స్టాంపుగా చూడవద్దంటూ ఘాటుగానే హెచ్చరించారు. ప్రభుత్వ అధికారుల తీరు మీద ఫైర్ అయ్యారు.

సింహాచలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. అయిపోయిన పనులకు సంతకాలు పెట్టమంటే మేమేమైనా రబ్బర్ స్టాంప్ అనుకుంటున్నారా అని హూంకరించారు. సింహాచలం ధర్మ కర్తల మండలి బోర్డు మీటింగ్ అంటే ముందే అజెండా పంపించాలని అలా కాకుండా అయిపోయిన పనులకు ఆమోదం తెలపడమేంటి అని కన్నెర్ర చేశారు. తాము అలా చేయబోమని హెచ్చరించారు. మేము నిండుగా దైవ భక్తి ఉన్నవాళ్ళమని రాజు గారు అంటున్నారు.

ఇదిలా ఉంటే ట్రస్ట్ బోర్డు సమావేశం విషయంలో కూడా తమకు మూడు తేదీలను సూచిస్తే తాము ఒకదాన్ని నిర్ణయిస్తామని ఆయన అంటున్నారు. నాలుగు నెలల క్రితం జరిగిన చందనోత్సవం ఏర్పాట్ల పైనా కూడా అశోక్ గజపతి మండిపడ్డారు. అప్పట్లో నిర్వహణ అంతా తప్పుగా చేశారని విమర్శించారు.

అశోక్ గజపతిరాజు ధర్మకర్త మాత్రమే కాదు టీడీపీ కీలక నాయకుడు. దాంతో ఆయన ప్రభుత్వ తీరుని తనదైన శైలిలో తప్పు పట్టారు. ప్రభుత్వం  పనితీరు ఏ మాత్రం బాగులేదని ఆయన అంటున్నారు. ఇవన్నీ చూసిన వారు ఎందుకో పెద్దాయనకు కోపం బాగానే వచ్చింది అని అంతా అనుకుంటున్నారు.