సినిమా ప్రేక్షకులు పూర్తిగా మారిపోయారు

థియేటర్ లో సినిమా చూడ్డానికొచ్చే ప్రేక్షకులు ఇప్పుడు మారిపోయారు.  Advertisement ఇది కళ్లు, మెదడు తెరుచుకుని అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు కావల్సింది కథలు కన్నా కథనాలు. అఫ్ కోర్స్ ఎప్పుడూ అంతేగా అనుకోవచ్చు.…

థియేటర్ లో సినిమా చూడ్డానికొచ్చే ప్రేక్షకులు ఇప్పుడు మారిపోయారు. 

ఇది కళ్లు, మెదడు తెరుచుకుని అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు కావల్సింది కథలు కన్నా కథనాలు. అఫ్ కోర్స్ ఎప్పుడూ అంతేగా అనుకోవచ్చు. కానీ ఇప్పుడు టెక్నికల్ గా కూడా చాలా అప్డేటయ్యి తీయాలి సినిమాలు. న్యూ ఏజ్ సినిమాని అర్థం చేసుకోవాలి. 

రాజమౌళి నుంచి తాజాగా మెగాఫోన్ పట్టుకుని రంగప్రవేశం చేసిన కొత్తదర్శకుల దాకా అందరూ తెలుసుకోవాల్సిన నగ్నసత్యాలు కొన్నున్నాయి. 

ముందుగా ఒకసారి గతంలోకి వెళ్దాం. 

1931లో తెలుగు సినిమా పుట్టింది “భక్తప్రహ్లాద”తో. తొలినాళ్లల్లో పూర్తిగా పౌరాణిక సినిమాలే వచ్చేవి. సాంఘికాలు కూడా నడుస్తున్నా క్రమంగా జానపద చిత్రాలు కూడా తెరకెక్కడం మొదలుపెట్టాయి. 

కాలక్రమంలో 1957-1970 వరకు పౌరాణికాలకి స్వర్ణయుగం. ఆ తర్వాత 1977లో దానవీరశూరకర్ణ తో పౌరాణిక యుగం దాదాపు అంతరించింది. మళ్లీ 1996లో “శ్రీకృష్ణార్జునవిజయం” పేరిట బాలకృష్ణతో ఒక పౌరాణికం వచ్చిన అది ఫ్లాపయ్యింది. జనాదరణ లేదు. దానికి కాస్త ముందు 1994లో వచ్చిన “భైరవద్వీపం” మాత్రం చాలా గ్యాప్ తర్వాత వచ్చిన జానపదచిత్రం కావడం వల్ల బాగా ఆడింది. మళ్లీ ఇలాంటి గ్యాప్ తర్వాత వచ్చి ఆడిన సినిమా 2015, 2017 ల “బాహుబలి-1,2”. 

1960-1980ల్లో విఠలాచార్య జానపదాలది ఒక ట్రెండ్. దాంతో పాటుగా “అష్టలక్ష్మీ వైభవం” లాంటి భక్తిరస దేవతాచిత్రాలు కూడా వస్తుండేవి. క్రమంగా అవన్నీ కరుమరుగైపోయి ఎవర్ గ్రీన్ సాంఘిక చిత్రాలు మాత్రం కంటిన్యూ అయ్యాయి.

ఆ సాంఘిక చిత్రాల్లో ఫ్యామిలీ హీరోల సినిమాలు కూడా ఉండేవి. చంద్రమోహన్, మురళీమోహన్ టైపు హీరోల్ని కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరించేవారు. 

ఎందుకంటే అప్పటి వరకు ప్రేక్షకులు అన్ని రకాల సినిమాలను ఆదరించే వారు, అన్ని వయసుల వాళ్లూ చూసేవారు. కారణం ప్రత్యామ్నాయ వినోదం లేక. 

క్రమంగా 1990ల మధ్య నుంచి ప్రైవేట్ టీవీ చానల్స్ వచ్చాయి. వాటిల్లో డైలీ సీరియల్స్ రూపంలో ఫ్యామిలీ కథలు, భక్తిరస ధారావాహికాలు మొదలైపోయాయి. క్రమంగా థియేటర్లో వాటి అవసరం పోయింది. ఎందుకంటే వాటిని ఆదరించే ఫ్యామిలీ ఆడియన్స్ టీవీలకే పరిమితమవడం అలవాటు చేసుకున్నారు కనుక. 

ఇప్పుడు హోం టీవీ వినోదం కొత్త పుంతలు తొక్కింది. సగటు ప్రేక్షకుడు టీవీకి, ఓటీటీకి పరిమితమవుతున్నాడు తప్ప వాడిని బలవంతంగా థియేటర్లకి లాక్కురావడం కష్టం. 

థియేటర్స్ లో సినిమాని ఆదరించే ప్రేక్షకులు ఇప్పుడు కేవలం 16-24 ఏజ్ గ్రూప్ వాళ్లు మిగిలారు. వాళ్లకి నచ్చినట్టు సినిమాలు తీయగలగాలి. 

అంటే ఏవిటి? అర్థం, పరమార్థం కంటే గ్రాండియర్ ఎక్కువుండాలి. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సన్నివేశాలు కావాలి, క్రిస్ప్ ఎడిటింగ్ కావాలి, కలర్ టోన్ బేస్డ్ కెమెరా అండ్ డిజిటల్ వర్క్ ఉండాలి, న్యూ ఏజ్ ఒరిజినల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కావాలి…నేటి యువ ప్రేక్షకులు ఇన్ని చూస్తున్నారు.

ఈ తరహా సినిమాలు నేటి రాజమౌళి, త్రివిక్రం, సుకుమార్ లాంటి వాళ్లకి నచ్చకపోవచ్చు. తమ స్టైల్ ఇది కాదు అనొచ్చు. తమ స్టైల్లో సినిమాలు తీసి ఇండస్ట్రీ హిట్స్ కొట్టామని చెప్పొచ్చు. అవన్నీ నిజాలే. కానీ ఇకపై తమ స్టైలునే ఫాలో అయ్యి సినిమాలు తీస్తామంటే వీళ్లు కూడా గత తరం టాప్ దర్శకుల్లాగ కనుమరుగైపోవడం ఖాయం… అది కూడా చాలా ఫాస్ట్ గా. 

కొత్త ట్రెండ్ ని అర్థం చేసుకోవాలి. కెజీఎఫ్-2 అంతలా ఎలా ఆడేసిందో తెలుసుకోవాలి. పాత తరం హీరో అయినా కమల్ హాసన్ నటించిన “విక్రం” ఎందుకాడేసిందో ఆలోచించాలి. ఈ రెండు సినిమాల్లోనూ పైన చెప్పుకున్న న్యూ ఏజ్ అంశాలున్నాయి. 

అంటే ఇక్కడ సినిమాని హాల్లో ఆడిస్తున్నది హీరోలే అనుకుంటే పొరపాటు. యాష్ కన్నడలో పెద్ద హీరో కావొచ్చు. కానీ తెలుగులో ఎంతమందికి తెలుసు, హిందీలో ఎవరికి తెలుసు? అయినా అద్భుతం సృష్టించింది. ఇప్పుడు అంతా టెక్నికల్ వ్యవహారం. ఆ టెక్నిక్ ని పట్టుకున్న దర్శకులే నేటి ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్ లు. వీరి మార్గంలో ఇంకొంతమంది దర్శకులు రావడం ఖాయం. వీళ్లే ప్యాన్ ఇండియా సినిమాలు తీయగల శక్తిమంతులౌతారు. 

ఆర్.ఆర్.ఆర్ తో రాజమౌళి గొప్ప కలెక్షన్స్ సాధించి ఉండొచ్చు. కానీ ఆయన తరహా నెరేషన్ బోర్ కొట్టడానికి అతి సమీపంలో ఉంది. ఆర్.ఆర్.ఆర్ చూసిన చాలామంది ప్రేక్షకులకి ఈ అనుమానం అనుభవంలోకి వచ్చింది. ఆయన మారుతున్న ట్రెండ్ కి దగ్గర్లో లేడన్నది వాస్తవం. 

పుష్ప తో సుకుమార్ ప్రస్తుతానికి ట్రెండ్ కి దగ్గర్లోనే ఉన్నట్టు లెక్క. పుష్ప-2 కి కూడా ఆయనకి ఢోకా ఉండకపోవచ్చు. కానీ ఆ తర్వాత ఏంటనేది మ్యటర్. 

త్రివిక్రం అయినా తన తరహా సినిమాలతో ఇంకెన్నాళ్లు రంజింపజేయగలడో తెలీదు. న్యూ ఏజ్ స్టైల్ ని అడాప్ట్ చేసుకుని తీరాల్సిందే. కొంతలో కొంత తన తొలి చిత్రాల నుంచి పరిశీలిస్తే అరవింద సమేత మీదుగా అల వైకుంఠపురం లో వరకు సాగిన తన ప్రయాణంలో చాలా విషయాల్లో అప్డేటవుతూ వస్తున్నాడు. ఇప్పుడు ఒక్కసారిగా మేక్ షిఫ్ట్ చేసుకోవాల్సిన పరిస్థితైతే ఉంది. లేకపోతే 16-24 ఏజ్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం కష్టం. మిగిలిన ఏజ్ గ్రూప్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడం “అల వైకుంఠపురంలో” కాలమంత ఈజీ కాదు. అవును మరి..2020 కి 2022కి రెండేళ్లే తేడా ఉన్నా నిజానికి పదిపదిహేనేళ్లంత గ్యాప్ లాంటి పరిస్థితి కనిపిస్తోంది. 

రెండేళ్ల కరోనా సమయం అన్నీ మార్చేసింది. పెద్ద సినిమాలు తీసే వాళ్లు ఒళ్లు దగ్గరపెట్టుకుని చాలా మార్పులు చేసుకోవాలి.

– శ్రీనివాసమూర్తి

2 Replies to “సినిమా ప్రేక్షకులు పూర్తిగా మారిపోయారు”

Comments are closed.