ఓ సినిమాకు స్పెషల్ షో ల మీద షో లు వేస్తే నిర్మాతకు ఉపయోగం వుండాలి. అంతే తప్ప ప్రయాస కాదు. విరాటపర్వం సినిమాకు షో ల మీద షోలు వేస్తున్నారు. త్రివిక్రమ్, సుకుమార్, ఇలా మహా మహులంతా వస్తున్నారు..చూస్తున్నారు..వెళ్తున్నారు. అంతకు మించి ఆ సినిమాకు ప్రచారం మాత్రం జరగడం లేదు.
నిర్మాత సుధాకర్ అయినా, సినిమాలో సాయి పల్లవి పాత్ర కీలకమైనా హీరో రానా మాత్రం పనిగట్టుకుని అందరికీ ఆహ్వానాలు పంపించి సినిమా చూపిస్తున్నారు. సినిమా చూసిన వాళ్లు అక్కడ మాత్రం రానాను పొగడ్తలతో ముంచెత్తి బయటకు వచ్చి సైలంట్ అవుతున్నారు.
సినిమా చూసిన టాప్ సెలబ్రిటీని బైట్ ఇవ్వమంటే అదిగో..ఇదిగో అంటున్నారని బోగట్టా.
పెళ్లిచూపులు టైమ్ లో షో లు వేసారు అంటే దానికి ఓ స్కీము..పద్దతి పాటించారు. ట్వీట్టర్ లో, సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండేవారిని తీసుకవచ్చి చూపించి ఆ విధంగా సినిమాకు ప్రచారం తీసుకువచ్చారు.
దాంతో సినిమాకు ముందే ఓ పాజిటివ్ వాతావరణం ఏర్పడింది. సినిమా తరువాత సోషల్ మీడియాలో మరింత ప్రచారం జరిగింది. విరాటపర్వం లాంటి ఐడియాలజీ వున్న సినిమాకు అలాంటి షోలు ప్లాన్ చేయాలి తప్ప, అహో..ఒహో అని హగ్ ఇచ్చి, ఇంటికెళ్లిపోయి సైలంట్ అయ్యే వారికి షో లు వేసి ఏం ప్రయోజనం? నిర్మాత ఖాతాలో షో లకు ఖర్చు తప్ప.