దేశానికంతా తాను తెలుసుననే ఫీలింగ్ చంద్రబాబులో చాలా ఎక్కువ. అసలు ఈ దేశానికి, ప్రపంచానికి ప్రధాని మోడీ అయినా సరిగ్గా తెలుసో లేదో గానీ, తాను మాత్రం ఓ పొలిటికల్ సెలబ్రిటీననే భావన చంద్రబాబులో ఉండడంతో…ప్రతి ఘటనపై ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తుంటారు. తాజాగా ఇండియన్ క్రికెటర్ ఎమ్మెస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటనపై కూడా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు.
ఈ సందర్భంగా ధోనీకి శుభాకాంక్షలు చెబుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏముందంటే… “అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీకి శుభాకాంక్షలు. జీవితంలో ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న ధోనీకి నా హార్థిక శుభాకాంక్షలు. భారత క్రికెట్‌కు మీరు చేసిన ఎనలేని కృషి మరువలేనిది. ఇక ముందు మీరు లేని ఆటను చూడడం కాస్త వెలితిగానే ఉంటుంది. అత్యుత్తమైన ఆట తీరుతో మీరు దేశాన్ని గర్వించేలా చేశారు. వీడ్కోలు ధోనీ” అని బాబు ట్వీట్ చేశారు.
ధోనీకి శుభాకాంక్షలు చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ ధోనీ కనబరిచిన స్ఫూర్తి చంద్రబాబులో ఒక్క శాతమైనా కనిపించక పోవడమే ఇప్పుడు ప్రధానంగా విమర్శలకు తావిస్తోంది. ఎమ్మెస్ ధోనీ వయస్సు 39 ఏళ్లు. ఆయన భారత్‌కు 16 ఏళ్ల పాటు అద్వితీయమైన విజయాలు అందించి క్రీడాభిమానులకు చిరస్థాయిగా గుర్తుండే జ్ఞాపకాలు మిగిల్చారు.
2004 డిసెంబర్ 23న వన్డే ఇంటర్నేషనల్ కెరీర్‌ను ధోనీ ప్రారంభించారు. చివరి మ్యాచ్‌ను 2019, జూలై 10న వరల్డ్ కప్‌లో భాగంగా సెమీ ఫైనల్లో ఆడారు. 2014లోనే ధోనీ టెస్ట్ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కెప్టెన్‌గా భారత్‌కు చిరకాలం గుర్తుండే విజయాలను ధోనీ అందించారు.
ధోనీ నాయకత్వంలో 2007లో టీ 20 ప్రపంచ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో వన్డే చాంపియన్స్ ట్రోపీని సాధించి దేశం తనకు అప్పజెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. భవిష్యత్ క్రికెట్ క్రీడాకారులకు రోల్ మోడల్‌గా నిలిచారు. తన రిటైర్మెంట్ ప్రకటనను ఇన్స్టాగ్రామ్ ద్వారా సింపుల్‌గా ప్రకటించి తన ఔన్నత్యాన్ని, సింప్లిసిటీని చాటుకున్నారు.
ఇదిలా ఉంటే ధోనీకి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు…తన వరకూ వచ్చే సరికి అలాంటివేవీ వర్తించవనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు వయస్సు 72 ఏళ్లు. 1975 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ప్రస్తుతం ఆయన కుప్పం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
40 ఏళ్లకు పైబడి రాజకీయ జీవితంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా, 25 ఏళ్ల పాటు టీడీపీ అధ్యక్షునిగా పనిచేశారు. అయినప్పటికీ రాజకీయాల నుంచి తప్పుకుని కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పోనీ చంద్రబాబు రాజకీయ జీవితం అంటే గుర్తొచ్చేది…వెన్నుపోట్లు, ఎన్నికల పథకాలు , కుట్రలు, కుతంత్రాలు, వ్యవస్థలను మేనేజ్ చేయడం, తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేస్తారనే కీర్తిని మూట కట్టుకున్నారు.
కరోనా కారణంగా హైదరాబాద్‌లో తన ఇంటి నుంచి కదల్లేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు. 70 ఏళ్లకు పైబడి ఉన్న చంద్రబాబు ఇంటి పట్టునే ఉంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేందుకు వయస్సు సహకరించని పరిస్థితుల్లో …రాజకీయాలను గబ్బిళం మాదిరిగా అంటిపెట్టుకోవడంపైనే అభ్యంతరం.
తాను తప్ప టీడీపీలో ఇతర నాయకులు నాయకత్వానికి పనికి రారని చంద్రబాబు భావిస్తున్నారా? మరెందుకని చంద్రబాబు తర్వాత ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం లేని భేతాళప్రశ్నగా మిగులుతోంది. ధోనీ నుంచి చంద్రబాబు ఏం నేర్చుకున్నట్టు? ఊరికే శుభాకాంక్షలు చెప్పడం అంటే…ఓ సెలబ్రిటీ గురించి ట్వీట్ చేస్తే పబ్లిసిటీ పొందాలనే యావ తప్ప మరే కారణమైనా కనిపిస్తోందా? ఎందుకీ డ్రామాలు? ఇదే అమెరికాలో రెండుసార్లు కంటే అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అనర్హులు. అలాంటి మంచి సంప్రదాయాన్ని తానెందుకు పాటించాలనుకోవడం లేదో ప్రపంచ ప్రఖ్యాత నాయకుడు చంద్రబాబే సమాధానం చెప్పాలి.
చంద్రబాబు ఎప్పుడెప్పుడు రిటైర్మెంట్ ఇస్తారా అని ఏపీ సమాజం ఎదురు చూస్తోంది. ఇక ఆయన చిల్లర రాజకీయాలను చూసి భరించే స్థితిలో కొత్త జనరేషన్ సిద్ధంగా లేదు. జూమ్ మీటింగ్‌లు, అబద్ధాలు, కట్టు కథలు, మీడియా మేనేజ్మెంట్తో ఏదో చేయాలనే ఎత్తుగడలకు కాలం చెల్లింది. ఇంకా వాటిని పట్టుకుని తమను చంద్రబాబు చావ బాదుతున్నాడనే అభిప్రాయంలో జనం ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా బాబు గ్రహించి గౌరవంగా తప్పుకుని ధోనీ స్ఫూర్తిని చాటితే మంచిది.