సినీ రంగంలో సంపాదించుకున్న గ్లామర్‌ను పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. మరీ ముఖ్యంగా తమిళనాడులో ఈ ధోరణి బాగా ఉంది. ఎమ్జీఆర్, జయలలిత, కరుణానిధి, రజినీకాంత్, కమల్‌హాసన్, రాధిక, ఖుష్భూ తదితరులంతా సినిమాల్లోంచి వచ్చిన వాళ్లే. వీరిలో ఎమ్జీఆర్, జయలలిత, కరుణానిధి ముఖ్యమంత్రులుగా కూడా సేవలందించారు.
మరికొందరు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ రంగంలోకి మరో ప్రముఖ కోలీవుడ్ హీరో అడుగు పెట్టనున్నారనే సమాచారం విస్తృతంగా సాగుతోంది. ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ తనయుడు విజయ్ త్వరలో రాజకీయ బరిలో దిగి తండ్లాటకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
ఇందులో భాగంగా ఏకంగా ఆయన ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు చురుగ్గా పావులు కదుపుతున్నారని తెలిసింది. విజయ్ తండ్రి చంద్రశేఖర్ కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో పార్టీ పేరు, విధివిధానాల రూప కల్పనకు ఢిల్లీలో ప్రముఖ లాయర్‌తో కీలక చర్చలు జరిపారని సమాచారం.
తమిళనాడులో విజయ్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవల హీరో విజయ్ సినిమాల పరంగానే కాకుండా రాజకీయంగా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. బీజేపీని టార్గెస్ చేస్తూ ఆయన సినిమాల్లో డైలాగ్స్ ఉండడం, ఇదే సందర్భంలో చెన్నైలో విజయ్ ఇంట్లో, కార్యాలయాల్లో ఐటీ సోదాలు, పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడిన విషయం తెలిసిందే.
ఇది రాజకీయ రంగు పులుముకుంది. విజయ్‌ని కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ టార్గెట్‌లో భాగంగానే ఐటీ సోదాలు నిర్వహించిందని ఆయన అభిమానులు ఆరోపించారు. తమ హీరో రాజకీయాల్లో వస్తారని విజయ్ అభిమానులు గత కొంత కాలంగా చెబుతున్నట్టే…ప్రస్తుతం ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి.