బీసీలు జగన్ ను తిరస్కరిస్తున్నారు, బీసీలకు మోసం జరిగింది, బీసీలు ఆగ్రహంగా ఉన్నారు, బీసీలు ఈసారి బుద్ధిచెప్తారు.. అన్నీ ఇలాంటి అనాకానీ మాటలే తప్ప నిర్మాణాత్మకమైన విమర్శ ఒక్కటైనా ఉండదు చంద్రబాబునాయుడు మాటల్లో! బీసీలంటే ఎవరో.. ఎందుకు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారో.. వారికి ఏం అన్యాయం జరుగుతోందో.. నిర్దిష్టమైన విమర్శ ఒక్కటీ ఉండదు. అదే తరహాలో ఇప్పుడు తాను ఈసారి అధికారంలోకి రాగానే బీసీల సంక్షేమానికి సంబంధించిన అంశం మీదనే తొలి సంతకం చేస్తానని చంద్రబాబునాయుడు ఇప్పుడు సరికొత్త గాలిమాటలు మాట్లాడుతున్నారు.
బీసీల సంక్షేమానికి సంబంధించిన అంశం అంటే ఏమిటి? చంద్రబాబు నాయుడు మనసులో ఏముంది? అసలు సంక్షేమం అనే పదానికి చంద్రబాబుకు అర్థం తెలుసా? ఇంత అస్పష్టమైన హామీతో ప్రజలను అయోమయంలోకి నెట్టేసి, వారు ఆ అయోమయంలో ఉండగానే ఓట్లను దండుకోవాలని ఆయన చూస్తున్నారా లేదా, బీసీల సంక్షేమం అంటూ తన వద్ద ఉన్న తారకమంత్రం లాంటి పథకమేదో చెప్పేస్తే.. జగన్మోహన్ రెడ్డి తక్షణం అమలు చేస్తాడని భయపడుతున్నారా అర్థం కావడం లేదు.
జగన్ బీసీలకు అన్యాయం చేస్తున్నాడు అంటూ ఒక స్వీపింగ్ రిమార్క్ విసిరేస్తే జనం మోసపోయి వర్కవుట్ అయ్యే రోజులు పోయాయి. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు తమ స్వబుద్ధితో ఆలోచించగలుగుతున్నారు. జగన్ సర్కారు బీసీలకు, ప్రత్యేకించి వృత్తి పనివాళ్లకు అన్ని రంగాల్లో ఉన్నవారి వికాసానికి ఎన్నెన్ని పథకాలు అమలుచేస్తున్నదో వారికి స్వయంగా తెలుసు. క్షేత్రస్థాయిలో ఆ పథకాల్ని జనం చూస్తున్నారు. అలాంటిది చంద్రబాబు చెప్పగానే ఎందుకు నమ్ముతారు?
పైగా ఆలూలేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం అన్నట్టుగా.. ఇప్పట్లో ఎన్నికలే లేవు. ఇంకా ఏడాదిన్నర ఆగాలి. ఈలోగా తెలుగుదేశం పార్టీ ఏమైపోతుందో కూడా వారికి తెలియదు. అలాంటిది.. ఆ ఎన్నికల్లో తాను విజయం సాధించి.. సీఎం అయి మీకు ఒరగబెడతా అని గుంభనంగా మాట్లాడితే జనం ఎందుకు పట్టించుకుంటారు? నిర్దిష్టమైన హామీలు గుప్పిస్తేనే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అన్నదాతలకు రుణమాఫీ కూడా పూర్తిగా చేయని ఆయన వైఖరి వల్ల చంద్రబాబు క్రెడిబిలిటీ ఏనాడో అడుగంటిపోయింది. ఇప్పుడు కొత్తగా ఇలాంటి దొంగ హామీలతో ఆకట్టుకోవడం సాధ్యం కాదు.