‘నేను దేశవ్యాప్త పాదయాత్ర చేస్తున్నది రాజకీయం కోసం కానేకాదు.. దేశ ప్రజలకు ప్రేమను పంచిపెట్టడానికి, వారిని ఏకం చేయడానికి’ అని తన భారత్ జోడో యాత్ర గురించి రాహుల్ పలుమార్లు చెబుతూ ఉంటారు. కానీ ఆయన కాలుమోపుతున్న ప్రతిచోటా.. భాజపా వ్యతిరేక, కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండగల పార్టీ నాయకులను కూడా పాదయాత్రకు ఆహ్వానిస్తూ.. తద్వారా రాజకీయంగా తాము ఒకటిగా ఉన్నామనే భావనను కలిగిస్తూ యాత్ర ముందుకు సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
తాజాగా ఈ భారత్ జోడో యాత్ర వెనుక గల హిడెన్ ఎజెండాలను కూడా ఆ పార్టీ సీనియర్లు నెమ్మదినెమ్మదిగా బయటపెడుతున్నారు.వచ్చే ఎన్నికల సమయానికి విపక్షాల తరఫు ఉమ్మడి కూటమికి సారథ్యం వహించడం గానీ, ప్రధాని అభ్యర్థిగా నిలవడం గానీ రాహుల్ అవుతారని అంటున్నారు.
‘‘రాహుల్.. కాంగ్రెస్ పార్టీ తరఫున కాబోయే ప్రధాని’’ అనే ట్యాగ్ లైన్ కొన్ని దశాబ్దాలుగా మనకు వినిపిస్తూనే ఉన్న సంగతి. కాంగ్రెస్ పార్టీకి సువర్ణఅవకాశం చేతికి వచ్చినప్పుడు.. సోనియా కుటుంబం ఉదారవాదాన్ని ప్రదర్శించి మన్మోహన్ సింగ్ చేతిలో అధికారం పెట్టారు. స్టీరింగ్ వద్ద ఆయన ఉన్నప్పటికీ.. బ్యాక్ సీట్ నుంచి సోనియానో, రాహుల్ నో నడిపిపంచారనే ఆరోపణలు ఎన్ని ఉన్నప్పటికీ ‘రాహుల్-ప్రధాని’ అనిపించుకోలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభలు మసకబారిపోయాయి. దేశంలో పలుప్రాంతాల్లో అసలు సోదిలో లేకుండాపోయింది. 2014 తర్వాత క్రమంతప్పకుండా పతనం చెందుతూ వస్తోంది.
ఇలాంటి నేపథ్యంలో 2024 ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే ప్రయత్నాల్లో భాగంగా.. రాహుల్ భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. కన్యాకుమారి టూ కాశ్మీర్ సుదీర్ఘ పాదయాత్ర ఇది. దేశం కోసం ఈ యాత్రను సోనియా కుటుంబం చేస్తున్న అతి గొప్ప త్యాగంగా కాంగ్రెస్ సీనియర్లు, భజనపరులు అభివర్ణిస్తున్నారు. మాజీ సీఎం కమల్నాథ్ మాట్లాడుతూ.. ఇన్ని త్యాగాలు చేసిన రాహుల్ మాత్రమే విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థి అవుతారని సెలవిస్తున్నారు.
దేశంలో మోడీ హవా మొదలైన తర్వాత.. విపక్షాల పరిస్థితి గందరగోళంగా తయారైంది. భాజపా వ్యతిరేక కూటమిలో అసలు కాంగ్రెస్ పార్టీనే అవసరం లేదని వాదించే బలమైన ప్రాంతీయ పార్టీలు కూడా తయారయ్యాయి. భాజపా,కాంగ్రెస్ ఇద్దరినీ సమానంగా దూరం పెట్టాలనే వాదన తయారవుతోంది. విపక్ష కూటమిలో బలంగా ఉండగల పార్టీలకు చెందిన చాలా మంది సీనియర్ నేతలకు తామే ప్రధాని కావాలనే కోరిక ఉంది.
ఇన్ని రకాల సమీకరణలు ఉండగా.. రాహుల్ నే ప్రధాని చేయాలనే ప్రతిపాదన రావడం కామెడీగా ఉంది. రాహుల్ తన చరిష్మాతో ఓట్లు కురిపించగల నేతగా ఇప్పటిదాకా పేరుతెచ్చుకోనేలేదు. అలాంటప్పుడు.. ఇతర పార్టీల్లో ఉన్న సీనియర్లు ఆయన అభ్యర్థిత్వాన్ని ఎలా తీసుకుంటారనేది ముఖ్యం. రాహుల్ ను ప్రధానిగా అభ్యర్థిగా ప్రకటించడం అనేది.. విపక్షాల ఐక్యతకు దెబ్బ అని పలువురు భావిస్తున్నారు.