పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం పెంపు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నాడు జరిగిన ఒక గొప్ప పని. అప్పట్లో దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. 11 వేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని వైఎస్ 44 వేల క్యూసెక్కుల స్థాయికి పెంచగా, తెలుగుదేశం కృష్ణా జిల్లా నేతలు గగ్గోలు పెట్టారు. ఆ తర్వాతి కాలంలో రాష్ట్రానికి సాగునీటి పారుదల శాఖ మంత్రిగా చేసిన దేవినేని ఉమామహేశ్వరరావు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై వైఎస్ హయాంలో మామూలుగా గగ్గోలు పెట్టలేదు!
నీటిని రాయలసీమకు తరలించుకుపోతున్నారంటూ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నిరసన తెలిపిన ఘనత ఆయనది! అలాంటి వ్యక్తి మంత్రి అయినప్పుడు మరెంత కుంచితంగా వ్యవహరించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఆ దరిద్రం సంగతలా ఉంటే.. పోతిరెడ్డిపాడు రెగ్యులేటరీ నుంచి ఇప్పుడు పూర్తి సామర్థ్యం మేరకు నీరు విడుదల అవుతుండటం శుభ సూచకం.
అటు తుంగభద్ర నుంచి, ఇటు కృష్ణ నుంచి భారీగా వరద వెల్లువెత్తుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి మట్టం భారీగా పెరిగింది. 215 టీఎంసీలకు గానూ దాదాపు రెండు వందల టీఎంసీల నీటి మట్టంతో ఉంది శ్రీశైలం డ్యామ్. ఈ నేపథ్యంలో అటు విద్యుత్ ఉత్పత్తికి, ఇటు రాయలసీమ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులకూ నీటి విడుదల జరుగుతోంది.
నిన్నటి నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 44 వేల క్యూసెక్కుల మేరకు నీటి విడుదల జరుగుతూ ఉంది. 30 రోజుల వ్యవధిలో దాదాపు 120 టీఎంసీల స్థాయిలో నీటిని విడుదల చేయడానికి అనుగుణంగా అప్పట్లో వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచారు. ఇప్పుడు పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నీటి విడుదల ద్వారా గ్రేటర్ రాయలసీమ దాహార్తి తీరే అవకాశం ఉంది.
ఇప్పుడు కృష్ణ వరదల సమయం మరింత తగ్గిన నేపథ్యంలో.. జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద దృష్టి సారించారు. 30 రోజులకు పైగా వరద ఉంటుందో లేదో తెలియని పరిణామాల్లో జగన్ ఆలోచన అమల్లోకి వస్తే.. సీమ ప్రాజెక్టులకు ప్రతియేడాదీ తప్పనిసరిగా నీటి లభ్యతకు అవకాశాలు పెరుగుతాయి.