‘తెలంగాణా’ పోయిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలి?

కేసీఆర్ మోడీపైనా, బీజేపీ మీద కోపంతో తెలంగాణా రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చారు. కానీ ఆయన ఆవేశం అనర్ధక దాయంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ నాయకులెవరూ సంతోషంగా…

కేసీఆర్ మోడీపైనా, బీజేపీ మీద కోపంతో తెలంగాణా రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చారు. కానీ ఆయన ఆవేశం అనర్ధక దాయంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ నాయకులెవరూ సంతోషంగా లేరు. ఎందుకంటే ఇంతకాలం తెలంగాణా సెంటిమెంటుతో లాక్కొని వచ్చారు. ఇప్పుడు పార్టీ పేరులోనుంచి “తెలంగాణా” పదం ఎగిరిపోవడంతో బతుకు బస్సు స్టాండ్ అవుతుందని భయపడుతున్నారు. కేసీఆర్ కూడా భయపడుతున్నారని సమాచారం. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత పార్టీ పేరులోంచి తెలంగాణ పదం మాయమైంది. దీని ప్రభావం గ్రామ స్థాయిలో ఎక్కువగా ఉన్నట్టు పార్టీ లీడర్లు ఆందోళన చెందుతున్నారు.

ఈ ఎఫెక్ట్ వచ్చే ఎన్నికల్లో ఉంటుందనే భయం వారిలో కనిపిస్తున్నది. ఓ వైపు తెలంగాణ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూనే, మరోవైపు జాతీయ రాజకీయాలకు అనుగుణంగా ఉండే విధానంతో ఎన్నికల ప్రణాళిక తయారు చేస్తున్నట్టు కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే ఓ మంత్రి వివరించారు. వచ్చే ఎన్నికల ప్రణాళిక కూడా చాలా భిన్నంగా అందరూ జై కొట్టేవిధంగా ఉంటుందని అన్నారు. అభివృద్ధి మంత్రం వర్కవుట్ అయ్యేలా లేదు.. ఇప్పుడు పార్టీ పేరులో నుంచి కూడా 'తెలంగాణ' తొలగిపోయింది. ఆ ఎఫెక్ట్ ప్రజలపై పడకుండా..వచ్చే ఎన్నికలకు వెళ్లేందుకు పవర్ ఫుల్, ఎమోషనల్ స్లోగన్ కోసం సీఎం కేసీఆర్ అన్వేషిస్తున్నారు. 

దీనిపై బీఆర్ఎస్ నేతలతో సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు తెలిసింది. ఏ నినాదంతో వెళ్తే ఓట్లు రాలుతాయని సీనియర్ల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నట్టు తెలిసింది. 2014 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ గులాబీ పార్టీని అధికారంలో కూర్చోబెట్టింది. 2018 ఎన్నికల్లో చంద్రబాబును బూచిగా చూపించి విజయం సాధించారు. 9 ఏండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమం నినాదంతో వచ్చే ఎన్నికలకు వెళ్తే వర్కవుట్ కాదని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ మధ్య జరిగిన మునుగోడు బై ఎలక్షన్‌లో ప్రభుత్వ పథకాలు ఓట్లు రాల్చలేదని పార్టీ లీడర్లే చెబుతున్నారు. అక్కడి ఓటర్లలో 90 శాతం మంది ప్రభుత్వం నుంచి ఏదో ఒక స్కీమ్ కింద లబ్ధిపొందిన వారే.

వారందరూ కృతజ్ఞతగా అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే ఇతర పార్టీలకు ఓట్లు రాకూడదు. కాని అక్కడ కేవలం 10 వేల ఓట్లు మెజార్టీతో బీఆర్ఎస్ గెలిచింది. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందనే ఆందోళన గులాబీ లీడర్లలో ఉంది. అందుకే దీటైన నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు పార్టీ లీడర్లు చెబుతున్నారు. ప్రజల మద్దతు ఉండాలంటే గన్ షాట్ లాంటి నినాదం ఉండాలని గులాబీ లీడర్లు అభిప్రాయపడుతున్నారు. వరసగా రెండు సార్లు అధికారంలో ఉండటంతో రూలింగ్ పార్టీ పట్ల సహజంగా వ్యతిరేకత ఉంటుంది.

ఆ వ్యతిరేకతను అధిగమించడంతోపాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఢీ కొనేలా కొత్త నినాదాన్ని కేసీఆర్ తయారు చేసే పనిలో ఉన్నట్టు పార్టీ లీడర్లు చెపుతున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాత కేసీఆర్ 'జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నా.. మీ ఆశీస్సులు కావాలి' అని పలు బహిరంగ సభల్లో మాట్లాడారు. దానికి ప్రజల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదని పార్టీ లీడర్లు అంటున్నారు. అందుకే ఏ నినాదంతో వెళ్లాలనే దానిపై తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నట్టు చెపుతున్నారు. ఇప్పటివరకు అనేక కారణాలతో జాతీయ పార్టీ అడుగులు ముందుకు పడలేదు. తెలంగాణా ప్రజలకు వారి సమస్యలపై మాట్లాడాలిగానీ జాతీయ రాజకీయాలు వారికెందుకు?