వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలను లీజుకు తీసుకుంటోంది. అసలు పార్టీకి ఇప్పటికే అనేక జిల్లాల్లో సొంత కార్యాలయాలు ఉన్నప్పటికీ.. కార్యాలయాలు లేని కొత్త జిల్లాల్లో అవసరమైన చోట మాత్రమే ప్రభుత్వ స్థలాలు తీసుకుంటున్నారు. ఇది కేవలం లీజు ప్రాతిపది మాత్రమే. కబ్జా చేయడం లేదు. దందా చేయడం లేదు. ఏళ్లతరబడి వృథాగా ఉన్న భూములను వాడుకలోకి తెస్తున్నారు. అయితే ఈ వ్యవహారాలపై కూడా పచ్చమీడియా చెత్త కథనాలు రాస్తోంది. వైసీపీ కి భూసంతర్పణ చేస్తున్నారంటూ గోల చేస్తున్నారు. స్థలం లీజుకు ఇస్తే అది భూ సంతర్పణ ఎలా అవుతుందో అర్థం కాని సంగతి.
అయితే పచ్చమీడియా ఈ విషయంలో గురివింద నీతిని అనుసరిస్తున్నట్లు పలువురు విశ్లేషిస్తున్నారు. గురివింద గింజకు తన వీపు మీద ఉన్న నలుపు తెలియదు.. ఎదుటి గింజ ను చూసి నవ్వుతుందని సామెత. ఇప్పుడు పచ్చమీడియా వ్యవహారాలు అలాగే ఉన్నాయి. తెలుగుదేశాన్ని భుజాన మోసే ఈ మీడియా.. తెలుగుదేశం పార్టీ కార్యాలయం విషయంలో ఏం చేస్తున్నారనేది ప్రశ్న.
హైదరాబాదు జూబ్లీ హిల్స్ లో అత్యంత విలువైన స్థలంలోనే తెలుగుదేశం ప్రధాన కార్యాలయం ఉంది. అయితే ఇది పార్టీ ఆఫీసు కాదు. ఇది ఎన్టీఆర్ ట్రస్టు భవన్. ఎన్టీఆర్ మరణం తర్వాత.. ఆయన పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు చేసి ప్రపంచాన్ని ఉద్ధరించేస్తాం అనే ముసుగులో అప్పటికే కొన్ని కోట్ల రూపాయల విలువైన ఈ స్థలాన్ని ప్రభుత్వం నుంచి తీసుకున్నారు. అందులో ట్రస్టు కార్యక్రమాలే ఉండాలి. ట్రస్టు సేవా కార్యక్రమాలే నిర్వహించాలి. కానీ రెండు పెద్ద భవనాలు కట్టి.. ఒకటి ఎన్టీఆర్ ట్రస్టు కార్యాలయంలాగా నిర్వహిస్తారు. మరొక పెద్ద భవనాన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీకే కేటాయించారు. పేరుకు ట్రస్టు కార్యాలయంలాగా ఉండే భవనంలో కూడా నడిచేవి అన్నీ పార్టీ వ్యవహారాలే.
అయితే ఇలాంటి డొంకతిరుగుడు లోపాయికారీ చాటుమాటు వ్యవహారాలు ఇష్టం లేకనే జగన్ తన పార్టీకోసం స్పష్టంగా ప్రభుత్వం ద్వారా లీజుకు తీసుకుంటున్నారు. లీజు ధర విషయంలో తేడా ఉండొచ్చు. కానీ నిరుపయోగంగా ఉన్న భూములను తీర్చి వాడుకలోకి తెస్తారనే సంగతి మరువరాదు. దీని మీద మాత్రం ఎడాపెడా కథనాలు రాస్తున్న పచ్చమీడియా.. తెలుగుదేశం పార్టీ వారి చాటుమాటు బాగోతాల గురించి ఎందుకు రాయదు. ట్రస్టు భవన్ లో కేవలం ట్రస్టు కార్యక్రమాలు మాత్రమే ఉండాలని ఆదేశిస్తే , చిటికెలో తెలుగుదేశం దిక్కులేని పార్టీ అయిపోతుందనే సంగతి వారు తెలుసుకోవాలి.