రోడ్డు ప్రమాదంలో ప్రముఖ యువ క్రికెటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ దగ్గర పంత్ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రిషబ్ పంత్ తల, మోకాలికి తీవ్ర గాయాలయ్యాయి. అసలేం జరిగిందంటే…
ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌కు తన మెర్సిడెస్ కారును స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళుతుండగా …మార్గమధ్యంలో రూర్కీ వద్ద రిషబ్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగాయి. రిషబ్ అప్రమత్తమై కారు విండో పగలగొట్టుకుని బయటికి దూకాడు. ఈ ఘటనలో అతను గాయాలపాలయ్యాడు. మంటల్లో అతని వీపు భాగం కాలింది.
స్థానికులు, పోలీసులు అతన్ని వెంటనే రూర్కీ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం రిషబ్‌ను మెరుగైన వైద్యం కోసం డెహ్రాడూన్‌లోకి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. రిషబ్ పంత్‌కు ప్రాణాపాయం తప్పడంతో క్రికెట్ అభిమానులు, సహచరులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.