రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తిని బిగ్బాస్ లేడీ కంటెస్టెంట్ గీతు రాయల్ వ్యక్తం చేశారు. బిగ్బాస్ రియాల్టీ షో సీజన్-6లో గీతు రాయల్ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. చిత్తూరు యాసలో మాట్లాడుతూ రాయలసీమ బిడ్డగా అందరికీ పరిచయం అయ్యారు. బిగ్బాస్ షోలపై రివ్యూయర్గా ఆమె సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్నారు.
అదే ఆమెకి బిగ్బాస్కు వెళ్లే అవకాశాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో బిగ్బాస్ హౌస్ నుంచి అనూహ్యంగా ఆమె ఎలిమినేట్ అయ్యారు. హౌస్ నుంచి బయటికొచ్చే క్రమంలో తాను ఏడ్వడంతో పాటు ప్రేక్షకుల్ని కూడా కన్నీళ్లు పెట్టించింది. చిత్తూరు చిరుతగా పేరొందిన గీతు రాయల్ మనసులో ఏదీ దాచుకోని మనస్తత్వం ఉన్న కంటెస్టెంట్గా పేరు తెచ్చకున్నారు.
రాజకీయాల్లోకి రావాలనే తన మనసులో మాటను ఆమె బయట పెట్టుకున్నారు. చిత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో గీతు మాట్లాడుతూ ప్రజాసేవ చేయడం కోసం త్వరలో రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్టు చెప్పారు. “గ్రేట్ ఆంధ్ర ప్రతినిధి”తో ఆమె ప్రత్యేకంగా మాట్లాడుతూ…. ప్రజలు ఆకాంక్షలకు తగ్గట్టుగా ఏ పార్టీలోకి వెళ్లాలో నిర్ణయించుకుంటానన్నారు. ఇంకా ఫలానా పార్టీలో చేరాలని అనుకోలేదన్నారు. బిగ్బాస్ హౌస్ నుంచి ఇటీవలే బయటికొచ్చానన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు గీతు చెప్పుకొచ్చారు.
ఎన్నికల బరిలో పోటీ చేయాలని అనుకుంటున్నారా? అని 'గ్రేట్ ఆంధ్ర ప్రతినిధి” ప్రశ్నించగా….తనది చిన్న వయసు అని అన్నారు. పదవులపై కోరిక లేదన్నారు. రూలర్ కావాలనే తన బలమైన కోరికను బిగ్బాస్ హౌస్లో పదేపదే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయాల్లోకి వచ్చి రూలర్ కావాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. అది నెరవేరడానికి ఏది మంచి వేదికో ఆలోచించుకుని నిర్ణయించుకుంటానని గీతు స్పష్టం చేశారు.