అసలే వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. దీనికి అనేక కారణాలున్నాయి. ఏ అధికార పార్టీ అయినా తమపై కోపాన్ని చల్చార్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. అదేంటో గానీ, ఏపీ అధికార పార్టీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలు రాజకీయంగా తమకు నష్టం కలిగించేలా ఉన్నాయని వైసీపీ ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సర్కార్ తీసుకొచ్చిన నిబంధనపై వారు రగిలిపోతున్నారు.
ఇకపై విధులకు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చినా జీతాల్లో కోత విధించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నిర్దేశించిన సమయం కంటే పది నిమిషాలు ఆలస్యంగా విధులకు వెళితే ఇక మీదట జీతంలో కోతకు గురి కావాల్సి వుంటుంది.
ఈ విధానాన్ని మొదట సెంట్రలైజ్‌డ్ ఫండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సీఎఫ్ఎంఎస్) విభాగంలో అమలు చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. 10.10 గంటల తర్వాత విధులకు హాజరయ్యే వారికి లేట్ ముద్ర వేయాలని, ఆ ముద్రలు ఎక్కువ పడిన వారి వేతనంలో కోత విధించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది.
ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరు కావాలని కోరుకోవడంతో తప్పు లేదని, అయితే ప్రతి నెలా ఒకటో తేదీకి వేతనాలు ఇవ్వాలనే ధ్యాస కూడా ప్రభుత్వానికి ఉండాలని వారు హితవు చెబుతున్నారు. జీతాలు ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వానికి తాము ఎలాంటి శిక్ష విధించాలని ఉద్యోగులు నిలదీస్తున్నారు. ఉద్యోగులపై కక్షపూరిత చర్యలకు దిగిందనేందుకు తాజా ఉత్తర్వులే నిదర్శనమని వారు అంటున్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం ఏంటనే ఆవేదన అధికార పార్టీ నేతల మాటల్లో కనిపిస్తోంది.